ఎల్‌నినో వేళ ప్రతి నీటి చుక్కకూ లెక్క ఉండాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి | Uttam Kumar Reddy Reacts El Nino Water Scarcity | Sakshi
Sakshi News home page

తాగునీటికే తొలి ప్రాధాన్యం... పంటలకూ భరోసా కల్పించాలి

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

Uttam Kumar Reddy Reacts El Nino Water Scarcity

హైదరాబాద్: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన వర్షాకాలంపై అనిశ్చితి కొనసాగుతున్నందున 'తాగునీటి భద్రతకు తొలి ప్రాధాన్యం.. అదే సమయంలో అందుబాటులో ఉన్న నీటితో ఖరీఫ్ పంటలకు గరిష్ఠ రక్ష' అనే సూత్రంతో ముందుకు సాగాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. మంగళవారం జలసౌధలో రాష్ట్రంలోని జలాశయాల నీటిమట్టాలు, ప్రవాహాలు, మిగిలిన ఖరీఫ్ సీజన్‌కు సాగునీటి అవకాశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీగా వర్షాలు కురుస్తాయని, ఎగువ నుంచి పెద్దఎత్తున వరదలు వస్తాయని ముందుగానే ఊహించుకొని నీటి నిర్వహణ ప్రణాళికలు రూపొందించడం సమంజసం కాదని ఉత్తమ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న నీరే ప్రామాణికం కావాలి, నమ్మదగిన ప్రవాహాలే అంచనాలకు ఆధారం కావాలి, వర్షపాతంపై శాస్త్రీయ విశ్లేషణే నిర్ణయాలకు దిక్సూచి కావాలి అని స్పష్టం చేశారు.

ప్రజల తాగునీటి అవసరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమాదంలోకి నెట్టకూడదు. అదే సమయంలో తాగునీటి అవసరాలకు మించి అందుబాటులో ఉన్న నీరు జలాశయాల్లో ఉన్నప్పుడు పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఉండకూడదు. ప్రతి నీటి విడుదల నిర్ణయం వాస్తవంగా వినియోగించగల నిల్వలు, నమ్మదగిన ప్రవాహాలు, వాస్తవిక వర్షపాత అంచనాల ఆధారంగానే జరగాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రధాన జలాశయాల్లో మొత్తం 973.68 టీఎంసీల సామర్థ్యానికి గాను 746.12 టీఎంసీల నీరు ఉండి, 76.63 శాతం నిల్వలు నమోదయ్యాయని సమీక్షలో వెల్లడైంది. గోదావరి బేసిన్‌లో 306.20 టీఎంసీల సామర్థ్యానికి 208.38 టీఎంసీలు, అంటే 68.1 శాతం నీరు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు.

కృష్ణా నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం సుమారు 164 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రాజెక్టు స్థూల సామర్థ్యం సుమారు 312 టీఎంసీలు కాగా, ఇంకా దాదాపు 47 శాతం మేర వరద జలాలను స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 6.4 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉన్న నేపథ్యంలో సాగునీటి అవసరాలను అత్యంత జాగ్రత్తగా అంచనా వేయాలని మంత్రి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement