చర్చల్లేవ్‌.. పోరాటమే! | Employes unions ultimatum to Telangana government | Sakshi
Sakshi News home page

చర్చల్లేవ్‌.. పోరాటమే!

Aug 19 2026 2:17 AM | Updated on Aug 19 2026 2:17 AM

Employes unions ultimatum to Telangana government

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌. పక్కన సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు తదితర ఉద్యోగ సంఘాల నాయకులు

ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం 

టీఈజేఏసీ భేటీలో కార్యాచరణకు ఆమోదం

ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి

ఈనెల 27న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ఉద్యోగుల మహాధర్నా 

పీఆర్సీ అమలు చేసేవరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు 

సెప్టెంబర్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్‌ విద్రోహ దినం నిరసనలు 

సెప్టెంబర్‌ 10న ఉద్యోగులతో చలో హైదరాబాద్‌... మహా ధర్నా 

జేఏసీ కార్యాచరణ ప్రకటించి రద్దు చేసుకుంటుందనే అపోహ ఉంది 

ఈసారి అలా కానివ్వం... టీఈజేఏసీ చైర్మన్‌ మారం, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఇక చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని టీఈజేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్వర్‌ స్పష్టం చేశారు. ఇప్పటివరకు వేచిచూశామని, ఇప్పుడు క్షేత్రస్థాయిలోని ఉద్యోగులంతా ఉద్యమించి సాధించుకుందామని ఒత్తిడి చేస్తున్నారన్నారు. అందుకే ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు. మంగళవారం నాంపల్లిలో ని టీఎన్జీఓ భవన్‌లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై చర్చించిన అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. అనంతరం మీడియాతో మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. 

వేచిచూసే పరిస్థితి లేదు... 
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే మూడేళ్లు వేచి చూశామని జగదీశ్వర్‌ అన్నారు. ‘పీఆర్సీ ఫిట్‌మెంట్‌ కోసం మూడేళ్లు దాటి మరో నెల గడిచింది. గత జూన్‌ 2న సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగుల హామీలు అమలు చేస్తామని చెప్పారు. సీఎం ఆదేశించినా, డిప్యూటీ సీఎం చెప్పినా అవేవీ అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారు. ఓపిక నశించింది. ఇప్పుడు వేచి చూసే పరిస్థితి లేదు. కొట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని ఉద్యోగులు ఆవేదనతో చెబుతున్నారు. జేఏసీ చెప్పినా వినే పరిస్థితిలో ఉద్యోగులు లేరు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏమీ కోరడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో నిర్దేశించిన వాటినే అమలు చేయాలని కోరుతున్నాం. జేఏసీ కార్యాచరణ ప్రకటించి రద్దు చేసుకుంటుందనే అపోహ క్షేత్రస్థాయిలో ఉంది. 

ఈసారి అలా కాకుండా కొట్లాడతాం. అందుకోసం ఈనెల 27న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు మహాధర్నా నిర్వహిస్తాం. అదేవిధంగా పీఆర్సీ అమలయ్యే వరకు ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారు. సెప్టెంబర్‌ 1న పెన్షన్‌ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుంటాయి. సెప్టెంబర్‌ 10న ఉద్యోగులతో చలో హైదరాబాద్‌ నిర్వహించి మహా ధర్నా జరుపుతాం’అని తెలిపారు. సమావేశంలో టీఈజేఏసీ నేతలు పి.దామోదర రెడ్డి, చావ రవి, వంగ రవీందర్‌ రెడ్డి, జి.సదానందం గౌడ్, ముజీబ్, బి.శ్యామ్, అనిల్‌ కుమార్, లింగారెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, కృష్ణ మూర్తి, ఉమాదేవి, కె రమే‹Ù, ఉపేందర్‌ రెడ్డి, బిక్షం గౌడ్, వెంకట్, గజేందర్, కస్తూరి వెంకట్, స్థితప్రజ్ఞ, విక్టర్, రామారావు, కృష్ణ యాదవ్, మోహన్‌ నారాయణ వివిధ జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 

నెలకు రూ.2వేల కోట్లు ఇస్తేనే: ఏలూరి శ్రీనివాసరావు 
‘ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి 64 డిమాండ్లతో వినతిపత్రం సమర్పించింది. కొన్ని హామీలు కార్యరూపం దాల్చినా అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ప్రధానంగా విద్య, ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖలకు సంబంధించిన అంశాలు అమలు కావడం లేదు. ఈహెచ్‌ఎస్‌ ప్రకటించినా వాటికి సంబంధించిన నిబంధనలు విడుదల కాలేదు. ఏయే ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మూడున్నర పీఆర్సీలు కోల్పోయాం. పీఆర్సీ కమిటీ నివేదిక వెంటనే తెప్పించుకుని ఫిట్‌మెంట్‌ అమలు చేయాలి. రూ.6వేల కోట్లు విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి మరో రూ.8వేల కోట్ల వరకు బకాయిలున్నాయి. ప్రతినెలా సగటున 500మంది ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. దీంతో ప్రతినెలా రూ.2వేల కోట్లు చొప్పున విడుదల చేస్తే వచ్చే మార్చికల్లా బకాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’

ప్రధాన డిమాండ్లు ఇవీ...
ఈహెచ్‌ఎస్‌ను సమర్థంగా అమలు చేయాలి.  
⇒ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డుల వినియోగంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. ⇒ పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి ఫిట్‌మెంట్‌ అమలు చేయాలి 
⇒ ఉద్యోగులకు రావాల్సిన 6 పెండింగ్‌ డీఏలను ఒకేసారి విడుదల చేయాలి 
⇒ ఉద్యోగుల పెండింగ్‌ బిల్లుల కోసం ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.2వేల కోట్లను కొనసాగించాలి 
⇒ సీపీఎస్‌ రద్దు చేసి ఏపీఎస్‌ అమలు చేయాలి. 
⇒ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించాలి
⇒ 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి. 190 జీఓను విద్యాశాఖ, పోలీసుశాఖతో పాటు అన్ని శాఖల్లో అమలు చేయాలి. 
⇒ సీఎం ఆదేశాలను అమలు చేయని ఉన్నతాధికారుల అలసత్వంపై చర్యలు తీసుకోవాలి   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement