రసాయనాలతో కల్తీ నెయ్యి .. 36 టన్నులు స్వాధీనం | Huge seizure of adulterated ghee in Hyderabad | Sakshi
Sakshi News home page

రసాయనాలతో కల్తీ నెయ్యి .. 36 టన్నులు స్వాధీనం

Aug 18 2026 3:46 PM | Updated on Aug 18 2026 4:07 PM

Huge seizure of adulterated ghee in Hyderabad

సాక్షి,హైదరాబాద్‌:హెచ్‌-ఫాస్ట్‌ ఆధ్వర్యంలోని హైదరాబాద్‌ ఫుడ్‌ అడల్టరేషన్‌ సర్వైలెన్స్‌ టీమ్‌.. ఆహార భద్రతా శాఖతో కలిసి అక్రమంగా కల్తీ నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై భారీ స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా మొత్తం 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, ప్రమాదకర రసాయన పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  

ఈ తనిఖీల్లో మొత్తంగా 130 సంస్థలను పరిశీలించారు. వీటిలో 39 నెయ్యి తయారీ కేంద్రాలు, 91 నెయ్యి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. తనిఖీల్లో పెద్ద ఎత్తున కల్తీ నెయ్యి తయారీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. నాణ్యత లేని, నకిలీ పదార్థాలతో పాటు అనుమతి లేని రసాయనాలను కలిపి సింథటిక్‌ నెయ్యిని తయారు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ కల్తీ నెయ్యిని ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసి, బ్రాండ్ల పేరుతో ప్యూర్‌ దేశీ నెయ్యిగా మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని తెలిపారు.

36 టన్నుల కల్తీ పదార్థాలు స్వాధీనం

ఆహర భద్రతా అధికారులు అక్కడికక్కడే చట్టబద్ధమైన నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో సమగ్ర పరీక్షల కోసం పంపించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం నిల్వతో పాటు ఇతర పదార్థాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. ఈ నెయ్యిని ప్రధానంగా దీపం/ పూజా నెయ్యి, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, స్వీట్‌ తయారీ కేంద్రాలు, ఆయుర్వేద దుకాణాలు వంటి వాటికి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పలు రాష్ట్రాల నుంచి క్రీమ్‌ కొనుగోలు
నెయ్యి తయారీలో ఉపయోగించిన పాల క్రీమ్‌ను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని సరఫరాదారుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. చౌకైన ప్రత్యామ్నాయ పదార్థాలను ఉపయోగించి అత్యంత తక్కువ ఖర్చుతో కల్తీ నెయ్యిని తయారు చేసి, దానిని అసలైన నెయ్యిగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా భారీగా అక్రమ లాభాలను ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రత్యేక తనిఖీల్లో  హెచ్‌-ఫాస్ట్‌ ఇన్‌స్పెక్టర్లు ఎన్‌. రంజిత్‌ కుమార్‌ గౌడ్‌, ఎం. అంజయ్య, వారి బృంద సభ్యులు ఎస్‌ఐలు రమ్య, అభిలాష్‌, శంకర్‌, కృష్ణ, అఖిల్‌ నిర్వహించారు. ఈ మొత్తం ఆపరేషన్‌ హైదరాబాద్‌ నగర టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ శ్రీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఐపీఎస్‌ నేతృత్వంలో జరిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement