breaking news
jagadishwar
-
చర్చల్లేవ్.. పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో ఇక చర్చలు జరిపే ప్రసక్తే లేదని తెలంగాణ ఉద్యోగ జేఏసీ అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని టీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు వేచిచూశామని, ఇప్పుడు క్షేత్రస్థాయిలోని ఉద్యోగులంతా ఉద్యమించి సాధించుకుందామని ఒత్తిడి చేస్తున్నారన్నారు. అందుకే ఉద్యమానికి సిద్ధమయ్యామని చెప్పారు. మంగళవారం నాంపల్లిలో ని టీఎన్జీఓ భవన్లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరిపై చర్చించిన అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. అనంతరం మీడియాతో మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తదితరులు మాట్లాడారు. వేచిచూసే పరిస్థితి లేదు... ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే మూడేళ్లు వేచి చూశామని జగదీశ్వర్ అన్నారు. ‘పీఆర్సీ ఫిట్మెంట్ కోసం మూడేళ్లు దాటి మరో నెల గడిచింది. గత జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి ఉద్యోగుల హామీలు అమలు చేస్తామని చెప్పారు. సీఎం ఆదేశించినా, డిప్యూటీ సీఎం చెప్పినా అవేవీ అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారు. ఓపిక నశించింది. ఇప్పుడు వేచి చూసే పరిస్థితి లేదు. కొట్లాడి సమస్యలను పరిష్కరించుకుందామని ఉద్యోగులు ఆవేదనతో చెబుతున్నారు. జేఏసీ చెప్పినా వినే పరిస్థితిలో ఉద్యోగులు లేరు. కొత్తగా ప్రభుత్వాన్ని ఏమీ కోరడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో నిర్దేశించిన వాటినే అమలు చేయాలని కోరుతున్నాం. జేఏసీ కార్యాచరణ ప్రకటించి రద్దు చేసుకుంటుందనే అపోహ క్షేత్రస్థాయిలో ఉంది. ఈసారి అలా కాకుండా కొట్లాడతాం. అందుకోసం ఈనెల 27న జిల్లా కేంద్రాల్లో ఒకరోజు మహాధర్నా నిర్వహిస్తాం. అదేవిధంగా పీఆర్సీ అమలయ్యే వరకు ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుంటాయి. సెప్టెంబర్ 10న ఉద్యోగులతో చలో హైదరాబాద్ నిర్వహించి మహా ధర్నా జరుపుతాం’అని తెలిపారు. సమావేశంలో టీఈజేఏసీ నేతలు పి.దామోదర రెడ్డి, చావ రవి, వంగ రవీందర్ రెడ్డి, జి.సదానందం గౌడ్, ముజీబ్, బి.శ్యామ్, అనిల్ కుమార్, లింగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ మూర్తి, ఉమాదేవి, కె రమే‹Ù, ఉపేందర్ రెడ్డి, బిక్షం గౌడ్, వెంకట్, గజేందర్, కస్తూరి వెంకట్, స్థితప్రజ్ఞ, విక్టర్, రామారావు, కృష్ణ యాదవ్, మోహన్ నారాయణ వివిధ జిల్లాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. నెలకు రూ.2వేల కోట్లు ఇస్తేనే: ఏలూరి శ్రీనివాసరావు ‘ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి 64 డిమాండ్లతో వినతిపత్రం సమర్పించింది. కొన్ని హామీలు కార్యరూపం దాల్చినా అవి పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ప్రధానంగా విద్య, ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖలకు సంబంధించిన అంశాలు అమలు కావడం లేదు. ఈహెచ్ఎస్ ప్రకటించినా వాటికి సంబంధించిన నిబంధనలు విడుదల కాలేదు. ఏయే ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు మూడున్నర పీఆర్సీలు కోల్పోయాం. పీఆర్సీ కమిటీ నివేదిక వెంటనే తెప్పించుకుని ఫిట్మెంట్ అమలు చేయాలి. రూ.6వేల కోట్లు విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి మరో రూ.8వేల కోట్ల వరకు బకాయిలున్నాయి. ప్రతినెలా సగటున 500మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. దీంతో ప్రతినెలా రూ.2వేల కోట్లు చొప్పున విడుదల చేస్తే వచ్చే మార్చికల్లా బకాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ప్రధాన డిమాండ్లు ఇవీ...⇒ ఈహెచ్ఎస్ను సమర్థంగా అమలు చేయాలి. ⇒ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డుల వినియోగంలో ఇబ్బందులు లేకుండా చూడాలి. ⇒ పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి ఫిట్మెంట్ అమలు చేయాలి ⇒ ఉద్యోగులకు రావాల్సిన 6 పెండింగ్ డీఏలను ఒకేసారి విడుదల చేయాలి ⇒ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.2వేల కోట్లను కొనసాగించాలి ⇒ సీపీఎస్ రద్దు చేసి ఏపీఎస్ అమలు చేయాలి. ⇒ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు నిబంధనలు రూపొందించాలి⇒ 317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి. 190 జీఓను విద్యాశాఖ, పోలీసుశాఖతో పాటు అన్ని శాఖల్లో అమలు చేయాలి. ⇒ సీఎం ఆదేశాలను అమలు చేయని ఉన్నతాధికారుల అలసత్వంపై చర్యలు తీసుకోవాలి -
టీఎన్జీఓ అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికా రుల సంఘం అధ్యక్షు డిగా మారం జగ దీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం హుస్సేనీ ముజీబ్ నియ మితుల య్యారు. ఆదివారం గచ్చిబౌలిలోని టీఎన్జీఓ హౌసింగ్ సొసైటీ ఆవరణలో ఎన్నికల అధి కారి సుగుణాకర్ రెడ్డి, సహాయ ఎన్నికల అధి కారి సురేశ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది. అధ్యక్ష పదవికి ఒకేఒక్క నామినేషన్ రావడంతో మారం జగదీశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి ఎన్నిక కూ డా ఏకగ్రీవం అయింది. కార్యవర్గ సభ్యులుగా 17మంది నామినేషన్ దాఖలు చేయడంతో వారిని నియమించారు. అధ్యక్ష, కార్యదర్శు లుగా మారం జగదీశ్వర్, ఎస్ఎం హుస్సేనీ ముజీబ్ వరుసగా రెండోసారి ఎన్నిక య్యారు. అనంతరం అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యద ర్శులు నూతన అధ్యక్ష, కార్యద ర్శులను సన్మానించారు. -
కమిటీలతో కాలయాపన వద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేయొద్దని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చిన్నారెడ్డి అధ్యక్షతన కమిటీ, ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం, తాజాగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు.ఇలా కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల కాలయాపన తప్ప.. 16 నెలలుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు. మంగళవారం టీఎన్జీఓ భవన్లో టీజీఈజేఏసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఐదు అంశాలపై తీర్మానాలు చేశారు. అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉద్యోగులను దోషులుగా చూపుతున్న సర్కారు ప్రకటనలు జేఏసీ అడుగుతున్నవన్నీ న్యాయబద్ధమైన డిమాండ్లేనని, తామెన్నడూ ఏదీ అదనంగా కోరలేదని జగదీశ్వర్ చెప్పారు. కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉద్యోగులను దోషులుగా చూపుతున్నట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉందని, ఇంకో నెలరోజులు గడిస్తే ఆరో డీఏ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం త్రిసభ్య కమిటీకి వినతులు సమర్పించామని, ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉందని వివరించారు. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాల వారీగా నిరసనలు చేపట్టాలని టీజీఈజేఏసీ పిలుపు ఇచ్చిందని, ప్రస్తుతం త్రిసభ్య కమిటీకి పరిస్థితిని వివరించినందున నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పణ, రాష్ట్ర ప్రభుత్వ స్పందన తర్వాత జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అధికారుల కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఆర్థికేతర అంశాలతో కూడిన డిమాండ్లను వేగవంతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలు–2025 మే నెలలోనే చేపట్టాలని, గత ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారికి తిరిగి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. -
కమిషనర్‌తో బల్దియాకు ఆర్థిక భారం
రాయికల్: అసలే కొత్తగా ఏర్పడిన బల్దియా.. పైగా పన్నుల వసూలు చాలా తక్కువ. అలాంటి రాయికల్ మున్సిపాలిటీకి కమిషనర్‌గా రూ.1.49 లక్షల వేతనం ఉన్న గ్రేడ్–1 స్థాయికి చెందిన జగదీశ్వర్‌గౌడ్‌ను నియమించారు. వచ్చిన పన్నులతో పారిశుధ్య సిబ్బంది, కార్మికులకే వేతనాలు చెల్లించలేని పరిస్థితి. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న తాము కమిషనర్‌కు ప్రతినెలా జనరల్‌ఫండ్ నుంచి అంత వేతనం చెల్లించలేమని, బల్దియాకు గ్రేడ్–1 స్థాయి కమిషనర్ కాకుండా.. ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని ఆగస్టు 31న నిర్వహించిన సమావేశంలో పాలకవర్గం తీర్మానం చేసి సీడీఎం (హైదరాబాద్)కు పంపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రభుత్వం గత ఫిబ్రవరి 21న జగదీశ్వర్‌గౌడ్‌ను బల్దియాకు కమిషనర్‌గా నియమించింది. ఆయనకు 8 నెలలుగా మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచే జీతాలు చెల్లిస్తున్నారు. కనీసం ఆయన వేతనానికి సరిపడా కూడా పన్నులు వసూలు కాకపోవడంతో రాయికల్ పట్టణాభివృద్ధికి కేటాయించిన రూ.104.91 కోట్ల నిధుల నుంచే ప్రతినెలా రూ.1.49లక్షల వేతనం చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో గ్రేడ్–1 కమిషనర్ అయిన జగదీశ్వర్‌గౌడ్‌ను అదేస్థాయిలో ఉన్న మున్సిపాలిటీకి పంపించాలని, రాయికల్‌కు మాత్రం ఇన్చార్జి కమిషనర్‌ను నియమించాలని కోరుతూ సీడీఎంకు తీర్మానం పంపినట్లు మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు తెలిపారు. చిన్న మున్సిపాలిటీ అయిన రాయికల్‌కు ఇన్చార్జి కమిషనర్.. లేదా ఎంపీడీవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తే కొంతైనా ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉందని ప్రజలు, పాలకవర్గ సభ్యులు అంటున్నారు. -
బాలల కథా రచయిత జగదీశ్వర్ ఆత్మహత్య
చిట్యాల/రామన్నపేట: నల్లగొండ జిల్లాకు చెందిన ప్రముఖ బాలల కథా రచయిత, కార్టూనిస్ట్, ప్రభుత్వ తెలుగు భాషోపాధ్యాయుడు పెండెం జగదీశ్వర్ (45) మంగళ వారం బలవన్మరణానికి పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా చిట్యాల శివా రులోని శ్రీ బాలనర్సింహస్వామి ఆలయం సమీపంలో పల్నాడు ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల తోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, జగదీశ్వర్ రచించిన పలు బాలల కథలు ‘సాక్షి’ దినపత్రిక ఆదివారం అనుబంధం ఫన్డే బుక్‌లో ప్రచురితమయ్యాయి. ఆయన రాసిన ‘చెట్టు కోసం’ అనే కథ మొదటగా సాక్షిలోనే ప్రచురితమైంది. ఆ కథను మహారాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది. -
తెలంగాణలో ఉబర్ క్యాబ్స్ పై నిషేధం
సాక్షి, హైదరాబాద్: వెబ్ ఆధారిత సేవలను అందజేసే ఉబర్ క్యాబ్స్పై రవాణాశాఖ నిషేధం విధించింది. తెలంగాణ రాష్ట్రమంతటా ఈ నిషేధం కొనసాగుతుందని రవాణా కమిషనర్ జగదీశ్వర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాహన యజమానులు, డ్రైవర్లు ఉబర్ సంస్థతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడానికి వీల్లేదన్నారు. ఢిల్లీలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ముంబై, ఢిల్లీల్లో ఉబర్ క్యాబ్‌లను నిషేధించారు. ప్రయాణికులు సైతం ఆ సంస్థకు చెందిన వాహనాలను బుక్ చేసుకోవద్దని, వాటిలో వెళ్లవద్దని కమిషనర్ సూచించారు. అక్రమంగా తిరిగే క్యాబ్‌లపై తనిఖీలను ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. -
పాఠశాలలకు 5 రోజులు సంక్రాంతి సెలవులు
బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలకు కలిపి15 రోజులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ, దసరా, బక్రీద్ పండుగలకు 15 రోజులు, సంక్రాంతి పండుగకు 5 రోజులు సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఈనెల 23 నుంచి వచ్చేనెల 5వ తేదీవరకు బతుకమ్మ, దసరా, బక్రీద్ సెలవులుండగా, ఇపుడు రెండురోజులు పెంచి, 7వ తేదీ వరకు సెలవులుగా పాటించాలన్నారు. అలాగే, వచ్చే ఏడాది జనవరి 10వ తేదీనుంచి 18వ తేదీవరకు ఉన్న సంక్రాంతి సెలవుల్ని మూడురోజులు తగ్గించి 15వ తేదీ వరకే పాటించాలని ఆర్సీ నంబరు జేడీఎస్/ప్లానింగ్/2014 ద్వారా ఉత్తర్వులు జారీ చే సినట్లు ఎస్టీయూటీఎస్, టీపీపీటీఏ సంఘాలు వెల్లడించాయి. ఈ సెలవు దినాలను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే పాఠశాల విద్యా క్యాలెండర్‌లోనూ ఇందుకనుగుణంగా మార్పులు చేయాలని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
మూఢనమ్మకాలను విశ్వసించొద్దు
మంచాల: మూఢ నమ్మకాలను విశ్వసించొద్దని మంచాల సీఐ జగదీశ్వర్ ప్రజలకు సూచించారు. సోమవారం ఆయన మండల పరిధిలోని చాంద్‌ఖాన్‌గూడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని ఓ మహిళ ఇటీవల చనిపోయి దెయ్యమై గ్రామస్తులపై దాడి చేస్తోందని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఇంటి ఎదుట కాముని బూడిద, చెప్పులు ఉంచుతున్న విషయం విధితమే. సోమవారం మంచాల సీఐ జగదీశ్వర్ సిబ్బందితో కలిసి చాంద్ఖాన్గూడను సందర్శించారు. ఇంటింటికి తిరిగి గ్రామస్తు లకు అవగాహన కల్పించారు. దెయ్యాలు, భూతాలు లేవని చెప్పారు. మూఢ విశ్వాసాలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా సీఐ జగదీశ్వర్ గ్రామ యువకులతో మాట్లాడారు. నేటి కంప్యూటర్ యుగంలో కూడా దెయ్యాలు ఉన్నాయని విశ్వసించడం మూర్ఖత్వమే అవుతుందని పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురవకుండా పుకార్లను నమ్మొద్దని సీఐ చెప్పారు. చదువుకున్న యువత నిరక్షరాస్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దెయ్యాలు ఉన్నాయని విశ్వసించి భూత వైద్యులను ఆశ్రయించి మోసపోవద్దని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ పేర్కొన్నారు. త్వరలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో మంచాల ఎస్సై రవికుమార్, సిబ్బంది ఉన్నారు.


