
టీఎన్‌జీవో భవన్‌లో జరిగిన సమావేశం అనంతరం మాట్లాడుతున్న నేతలు జగదీశ్వర్, శ్రీనివాసరావు, హుసేన్
ఉద్యోగులు అడిగేవన్నీ న్యాయబద్ధమైన డిమాండ్లే
15 నుంచి తలపెట్టిన నిరసనలు తాత్కాలికంగా వాయిదా... టీజీఈజేఏసీ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేయొద్దని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చిన్నారెడ్డి అధ్యక్షతన కమిటీ, ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం, తాజాగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు.
ఇలా కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల కాలయాపన తప్ప.. 16 నెలలుగా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని విమర్శించారు. మంగళవారం టీఎన్జీఓ భవన్‌లో టీజీఈజేఏసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించి ఐదు అంశాలపై తీర్మానాలు చేశారు. అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఉద్యోగులను దోషులుగా చూపుతున్న సర్కారు ప్రకటనలు
జేఏసీ అడుగుతున్నవన్నీ న్యాయబద్ధమైన డిమాండ్లేనని, తామెన్నడూ ఏదీ అదనంగా కోరలేదని జగదీశ్వర్ చెప్పారు. కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉద్యోగులను దోషులుగా చూపుతున్నట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉందని, ఇంకో నెలరోజులు గడిస్తే ఆరో డీఏ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం త్రిసభ్య కమిటీకి వినతులు సమర్పించామని, ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉందని వివరించారు. ఈనెల 15వ తేదీ నుంచి జిల్లాల వారీగా నిరసనలు చేపట్టాలని టీజీఈజేఏసీ పిలుపు ఇచ్చిందని, ప్రస్తుతం త్రిసభ్య కమిటీకి పరిస్థితిని వివరించినందున నిరసన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక సమర్పణ, రాష్ట్ర ప్రభుత్వ స్పందన తర్వాత జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుందని స్పష్టం చేశారు. ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అధికారుల కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఆర్థికేతర అంశాలతో కూడిన డిమాండ్లను వేగవంతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సాధారణ బదిలీలు–2025 మే నెలలోనే చేపట్టాలని, గత ఎన్నికల సమయంలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారికి తిరిగి సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరారు.