ప్రియమైన కస్టమర్, అధిక/పదేపదే రీఫిల్ బుకింగ్ కాల్స్ కారణంగా స్పందించడంలో తాత్కాలిక ఆలస్యం జరగవచ్చు. వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. భయపడవద్దు. దశాబ్దాలుగా కస్టమర్లకు సేవలందిస్తున్న ఆయిల్ కంపెనీని నమ్మండి. హోమ్ డెలివరీ చేస్తాం. ఏజెన్సీల వద్దకు పరుగు తీయవద్దు. ఇంధనాన్ని ఆదా చేయండి.
–వినియోగదారుల ఫోన్‌కు ఐవోసీ పంపుతున్న సందేశం.
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధంతో గ్యాస్ సిలిండర్ కొరత వస్తుందనే భయం నగర వాసిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సరఫరాపై ఆంక్షలు విధించి.. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. వినియోగదారులు ఒక్కసారిగా బుకింగ్‌లకు ఎగబడడంతో ‘డొమెస్టిక్ గ్యాస్’ సంక్షోభం తారస్థాయికి చేరింది. కమర్షియల్ గ్యాస్ వాడకంపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని ‘ముంచుకొస్తున్న ముప్పు’నకు సంకేతంగా సామాన్యులు భావిస్తున్నారు. అందుకే సిలిండర్ అయిపోకముందే అడ్వాన్స్ బుకింగ్‌లకు పోటీ పడుతున్నారు. లక్షలాది బుకింగ్‌లతో ఆయిల్ కంపెనీల టెక్నికల్ సర్వర్లు జామ్ అవుతూ యాప్‌లు, వెబ్‌సైట్లు మొరాయిస్తున్నాయి.
వారం దాటినా...
నగరంలో హోమ్ డెలివరీ వెయిటింగ్ పిరియడ్ పెరగడం ఆందోళకు గురిచేస్తోంది. సాధారణంగా 24 నుంచి 48 గంటల్లో వచ్చే సిలిండర్, ప్రస్తుతం వారం దాటినా చేరడం లేదు. ఫోన్లలో బుక్ కాకపోవడం, డెలివరీలో జాప్యంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. పౌర సరఫరాల శాఖ, ఆయిల్ కంపెనీల లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో బఫర్ స్టాక్ కనీసం 15 నుంచి 20 రోజులకు సరిపడా ఉంది. అయితే, కేంద్రం ఆంక్షలు విధించడంతో 30 శాతం వరకు అదనపు గ్యాస్ గృహ అవసరాలకు మళ్లుతోంది. ఈ నేపథ్యంలో ఆందోళనకర సందేశాలు, వదంతులు నమ్మొద్దని చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. సరఫరా గొలుసు నిరంతరాయంగా కొనసాగుతోంది. ‘‘హోం డెలివరీలో స్వల్ప జాప్యం వాస్తవమే. అది బుకింగ్‌ల రద్దీ వల్ల మాత్రమే. ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదు’’ అని చమురు సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు.
కార్గో కంగారు
సికింద్రాబాద్‌కు చెందిన వెంకటయ్య కుమారుడు దినేష్ భార్య పిల్లలతో ఖతర్‌లో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 17న కుమారుడి బర్త్‌డే పారీ్టకి అవసరమైన వస్తువులను నగరం నుంచి తెప్పించాలని భావించి తండ్రికి లిస్టు పంపించాడు. అయితే పశ్చిమాసియా యుద్ధంతో చాలా కార్గో కంపెనీలు పార్సిళ్లు పంపలేమన్నాయని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ఒకటి, అరా ముందుకు వచ్చిన చార్జీలను మాత్రం 3–4 రెట్లు ఎక్కువగా పెంచడంతో పార్సిల్ పంపడం మానుకున్నారు.
టౌలిచౌకీకి చెందిన ఓ కుటుంబం సౌదీ అరేబియాలో ఉంటోంది. ఏటా రంజాన్ పండుగకు నగరం నుంచే సామగ్రితోపాటు ఈద్ నమాజ్ కోసం దుస్తులను తెప్పించుకుంటుంది. యుద్ధ ప్రభావంతో కార్గో సర్వీస్ సక్రమంగా లేక ఈసారి అలా కుదరడం లేదు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. పండుగలు, జన్మదినం, మ్యారేజ్ డే.. ఇలా ఏ ఫంక్షన్ ఉన్నా నగరంలోని తమ వారి ద్వారా వస్తువులు, దుస్తులు, పిండి వంటలు, పూజ సామగ్రిని కార్గో సరీ్వసుల ద్వారా తెప్పించుకునేవారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల కార్గో సరీ్వస్‌లు పూర్తి స్థాయిలో కొనసాగకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వేళ ఇక్కడి నుంచి ఎవరైనా పార్సిల్స్ పంపించాలన్నా చార్జీలు విపరీతంగా పెరిగాయి. ఇదివరకు ప్రతిరోజూ వేల సంఖ్యలో నగరం నుంచి అక్కడికి పార్సిల్స్ వెళ్లేవి.
ఇతర దేశాలకు ఓకే..
అమెరికా, లండన్, యూరప్, ఆ్రస్టేలియా, ఇతర దేశాలకు నగరం నుంచి కార్గో సరీ్వసులు నిరాంటకంగా కొనసాగుతున్నా చార్జీలు మాత్రం పెరిగాయి. డెలివరీ టైమ్ కూడా ఎక్కువ పడుతోంది. గతంలో ఉన్న రేట్ల కంటే ప్రతి కేజీపై రూ 200–250 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అమెరికాకు 5 రోజుల్లో వెళ్లే పార్సిల్ ప్రస్తుతం 10–12 రోజులు పడుతోంది. యూకేకు కూడా ఇదే పరిస్థితి. ఆస్ట్రేలియా పార్సిల్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు.
పౌర సరఫరాల శాఖ కన్నెర్ర
పౌర సరఫరాల శాఖ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి తనిఖీ బృందాలను రంగంలోకి దించింది. గ్యాస్ ఏజెన్సీలు కావాలని ‘నో స్టాక్’ బోర్డులు పెడితే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు. బుక్ అయిన 48 గంటల్లో డెలివరీ అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.


