క్షమాపణ కాదు... కనీసం ఒప్పుకున్నారా? | Ponguleti Srinivasa Reddy Comments On Harish Rao | Sakshi
Sakshi News home page

క్షమాపణ కాదు... కనీసం ఒప్పుకున్నారా?

Aug 19 2026 4:16 AM | Updated on Aug 19 2026 4:16 AM

Ponguleti Srinivasa Reddy Comments On Harish Rao

పదేళ్ల ధరణి తప్పిదాలను అంగీకరించే ధైర్యం హరీశ్‌రావుకు ఉందా?... కాళేశ్వరంలో జరిగిన తప్పుల గురించి ఏనాడైనా బాధ్యత తీసుకున్నారా? 

ఏలేటి తాటాకు చప్పుళ్లకు నేను భయపడను... 22ఏపై 15 రోజులపాటు రోజువారీగా ఫిర్యాదులను పరిష్కరిస్తాం: రెవెన్యూ మంత్రి పొంగులేటి

సాక్షి, హైదరాబాద్‌: నిషేధిత భూముల జాబితా విషయంలో జరిగిన తప్పును ఒప్పుకుని తాము సరిదిద్దుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ బీఆర్‌ఎస్‌ నేతలు క్షమాపణలు చెప్పడం కాదు కదా... కనీసం చేసిన తప్పులను ఎప్పుడైనా అంగీకరించారా అని ప్రశ్నించారు. పదేళ్ల ధరణి తప్పిదాలను అంగీకరించే ధైర్యం ఆ పార్టీ నేత హరీశ్‌రావుకు ఉందా అని నిలదీశారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హరీశ్‌రావు ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ‘విమర్శలు చేయడం చాలా సులువు. కానీ బాధ్యత తీసుకోవడం అంత సులువు కాదు. 22ఏ జాబితా విషయంలో పొరపాటు జరిగిందని మేం బహిరంగంగానే అంగీకరించాం. ఆ పొరపాటును సరిదిద్దే బాధ్యత కూడా తీసుకున్నాం. కానీ వాళ్లు అధికారంలో ఉన్న కాలంలో ధరణి మాటున జరిగిన అక్రమాలను, రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను ఏనాడైనా ఒప్పుకున్నారా? క్షమాపణలు చెప్పారా? కానీ ఇప్పుడు మాత్రం ఈ సమస్యను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

పేదవారి న్యాయబద్ధమైన భూమిలో ఒక్క అంగుళం కూడా అన్యాయం జరగనివ్వం. మేం తప్పును ఒప్పుకున్నాం. ఆ తప్పును సరిదిద్దుతున్నాం. కానీ మీకు ఆ ధైర్యం ఉందా? అబద్ధాలు, ఆరోపణలు, రాజకీయ ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేదు. తప్పును అధికారుల మీదకు నెట్టి చేతులు దులుపుకోవడం మా విధానం కాదు. పదేళ్లు అధికారంలో ఉన్న హరీశ్‌రావుకు ఇప్పటికీ 30 శాతం కమీషన్లు ఎందుకు గుర్తొస్తున్నాయో అర్థం కావడం లేదు. వారు ఏ పద్ధతిలో పాలించారో ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అసలు కాళేశ్వరం విషయంలో జరిగిన పరిణామాలకు హరీశ్‌రావు ఏనాడైనా బాధ్యత తీసుకున్నాడా? నేను మాత్రం తప్పు జరిగిందని చెప్పి బాధ్యత తీసుకున్నా. ఇదే నాకు, హరీశ్‌కు ఉన్న తేడా’అని పొంగులేటి అన్నారు. 

వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది 
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ... ‘తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. నాపై ఏవైనా ఆరోపణలు చేస్తే ఆధారాలతో మాట్లాడాలి. వ్యాపార రంగంలో అనేక సంస్థలతో లావాదేవీలు జరగడం సహజం. వాటిని రాజకీయ ఆరోపణలకు ఉపయోగించుకోవడం సరైంది కాదు. నేను రెండు దశాబ్దాలుగా వ్యాపార రంగంలో ఉన్నా. రాత్రికి రాత్రి వచ్చిన వాడిని కాను. ఒక్కరోజులోనే వేల కోట్లకు ఎదిగిన వ్యక్తిని కాను. అంచెలంచెలుగా ఎదిగాను. నా నేపథ్యం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు’అని పేర్కొన్నారు.  

ఆందోళన చెందాల్సిన పని లేదు 
నిషేధిత 22ఏ జాబితా భూములు, ఆస్తులతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పొంగులేటి స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, 24 గంటల్లోనే మేడ్చల్‌లో 30, రంగారెడ్డిలో 4 రిస్ట్రేషన్లు జరిగాయన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ రాబోయే 15 రోజులపాటు రోజువారీగా ఫిర్యాదులు, దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తుందన్నారు. న్యాయబద్ధంగా ఉన్న ప్రైవేటు ఆస్తులను తక్షణమే రిస్ట్రేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement