ప్రెటోరియా: మానవ పరిణామ చరిత్రను తిరగరాసే ఒక అద్భుతమైన ఆవిష్కరణ వెలుగుచూసింది. ఆది మానవుడు ఇప్పటివరకు మనం భావించిన దానికంటే దాదాపు 80,000 సంవత్సరాల ముందే నిప్పుపై నియంత్రణ సాధించాడని శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌత్ ఆఫ్రికాలోని ప్రసిద్ధ ‘వండర్‌వర్క్ గుహ’లో జరిపిన తాజా పరిశోధనల్లో 1.79 మిలియన్ల (దాదాపు 18 లక్షల) సంవత్సరాల క్రితం నాటి కాలిపోయిన క్షీరదాల ఎముకలు లభ్యమయ్యాయి. ‘ప్లోస్ వన్’ (PLOS One) జర్నల్‌లో ప్రచురితమైన ఈ అంతర్జాతీయ పరిశోధన, హోమో ఎరెక్టస్ (Homo erectus) జీవన విధానంపై పలు వివరాలను తెలియజేసింది.
గుహ లోపల దొరికిన కీలక ఆధారాలు
అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుహలో లభించిన 161 చిన్న క్షీరదాల శిలాజపు ఎముకలను క్షుణ్ణంగా విశ్లేషించింది. ఇవన్నీ గుడ్లగూబలు అవశేషాలు కావడం విశేషం. ఈ ఎముకలు తీవ్రమైన వేడికి గురైనట్లు స్పష్టమైన సంకేతాలు కనిపించాయి. గుహ లోపలికి దాదాపు 100 అడుగుల లోతులో ఇవి లభించాయి. అంత లోపలికి సహజసిద్ధమైన అడవి మంటలు వ్యాపించడం అసాధ్యం కాబట్టి, ఆది మానవులే ఉద్దేశపూర్వకంగా ఈ ఎముకలను నిప్పుపై ఉంచారని పరిశోధకులు నిర్ధారించారు.
నిప్పును రాజేయడం కాదు.. దాచుకోవడం
అయితే ఆ కాలంలో హోమో ఎరెక్టస్‌లకు సొంతంగా నిప్పును సృష్టించడం (కనుగొనడం) తెలియదని పరిశోధనలు చెబుతున్నాయి. పిడుగుపాట్లు లేదా అడవి మంటల వల్ల సహజంగా ఏర్పడిన నిప్పును వారు సేకరించి గుహల్లోకి తెచ్చేవారు. ఆ మంటలు ఆరిపోకుండా ఉండేందుకు గుడ్లగూబల అవశేషాలను ఇంధనంగా వాడేవారు. ఒక చిన్న నిప్పుకణికను వీటిపై వేసి, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, ఒకే చోట సుదీర్ఘకాలం పాటు ఉండేలా చూడటంలో వారు విజయం సాధించారు.
ఆధునిక సాంకేతికతతో వీడిన రహస్యం
ఖనిజాల వల్ల ఈ ఎముకలు నల్లగా మారాయనే అనుమానాలను శాస్త్రవేత్తలు పూర్తిగా తిరస్కరించారు. దీనికోసం వారు సరికొత్త ‘నాన్-డిస్ట్రక్టివ్ లూమినిసెన్స్’ సాంకేతికతను ఉపయోగించారు. ఆప్టికల్ ఫిల్టర్ల ద్వారా ప్రత్యేకమైన నీలిరంగు కాంతిని ఈ ఎముకలపై ప్రసరింపజేసినప్పుడు, అవి ఒక రకమైన ఎరుపు రంగు కాంతిని వెదజల్లాయి. కాలిన ఎముకలు మాత్రమే ఇలాంటి కాంతిని ఇస్తాయని, సాధారణ ఎముకలు ఇవ్వవని శాస్త్రవేత్తలు నిరూపించారు. మానవ సంస్కృతి, ప్రకృతి మధ్య బంధాన్ని మార్చిన మైలురాయిగా ఈ పరిశోధన నిలిచిందనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ‘సుశాంత్ సింగ్ లాగే నా చెల్లిని బలితీసుకున్నారు’


