
గత రెండు వారాలుగా ఓ రష్యన్ మహిళ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రమాదకరమైన గుహలో నివసిస్తున్న ఘటన కర్ణాటకలో సంచలనం రేపింది. ఉత్తర కన్నడ జిల్లా కుమ్టా తాలూకాలోని రామతీర్థ కొండల్లోని మారుమూల గుహ నుంచి నినా కుటినా అలియాస్ మోహి (40), ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు రక్షించారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో గోకర్ణ పోలీసులు పర్యాటకుల భద్రత కోసం గోకర్ణ అడవి ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. గుహ వద్ద వారి కదలికలు కనిపించాయి. ఆ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి గుహలో నివసిస్తున్నట్లు కనుగొన్న పోలీసులు.. వారిని కాపాడారు.
కొన్నేళ్ల క్రితం బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చిన మోహి.. గోవా నుంచి ఆధ్యాత్మిక తీర ప్రాంతమైన గోకర్ణకు చేరుకుంది. ఆమె వీసా గడువు కూడా ముగిసింది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ఆకర్షితురాలైన ఆమె తన ఇద్దరు పిల్లలు ప్రయా (6), అమా (4)లతో కలిసి రెండు వారాల క్రితం గోకర్ణలోని దట్టమైన అటవీప్రాంతంలోకి వెళ్లింది. అక్కడ ఒక గుహలో తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసించడం ప్రారంభించింది.
ఆ గుహను ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చేసిన ఆ మహిళ.. రుద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటు పూజలు నిర్వహించేంది. నిత్యం ధ్యానం చేస్తూ రోజులు గడిపింది. అయితే ఆ మహిళ, ఆమె పిల్లలు అడవిలో ఉన్న సమయంలో ఆహారాన్ని ఎలా సంపాదించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2024 జూలైలో గుహ ఉన్న రామతీర్థ కొండ ప్రాంతం నుంచి పెద్ద పెద్ద కొండచరియలు విరిగిపపడ్డాయి. విష పూరిత పాములు సహా ప్రమాదకరమైన వన్య ప్రాణులకు నిలయమైన ఆ ప్రాంతం. చాలా ప్రమాదకరమైన ప్రదేశంగా పోలీసులు తెలిపారు.
ఆ రష్యన్ మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసుల బృందం.. కొండ కిందకు తీసుకెళ్లింది. ఆమె అభ్యర్థన మేరకు కుంటా తాలూకాలోని బంకికోడ్ల గ్రామంలో 80 ఏళ్ల మహిళా సన్యాసిని యోగరత్న సరస్వతి నిర్వహిస్తున్న ఆశ్రమానికి తరలించారు. మోహి వీసా గడువు 2017లోనే ముగిసిందని అధికారులు తెలిపారు. ఆమె భారత్‌లో ఎంత కాలం నుంచి ఉంటుందో తెలుసుకునే పనిలో అధికారులు పడ్డారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ సాయంతో రష్యా రాయబార కార్యాలయాన్ని అధికారులు సంప్రదించారు.