
బెంగళూరు: కర్ణాటకలోని గోకర్ణ గుహలో పిల్లలతో పాటు ఉంటున్న రష్యన్ మహిళ ఉదంతం సంచలనంగా మారింది. ఈ వార్త వెల్లడి కాగానే ఆమె ఎందుకు అక్కడ ఉంటోంది? పిల్లలను అలా ఎందుకు సాకుతోంది? చనిపోయేందుకే పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చిందా? అనే సందేహాలు పలువురిలో కలుగుతున్నాయి. వాటికి ఆమె స్వయంగా సమాధానం చెప్పింది.
గోకర్ణ గుహలో తలదాచుకుటున్న రష్యన్ మహిళ నీనా కుటినా.. తాను, తన పిల్లలు ఉంటున్న గోకర్ణ గుహ గ్రామానికి చాలా దగ్గరగా ఉందని, అది ప్రమాదకరం కాదని మీడియాకు తెలిపింది. రామతీర్థ కొండలలోని ఈ గుహలో తన ఇద్దరు కుమార్తెలతో పాటు ఉండటాన్ని ఆమె సమర్థించుకుంది. తమ కుటుంబం ప్రకృతిని ప్రేమిస్తుందని, తాము కొన్నేళ్లుగా 20 దేశాల అడవులలో నివసించామని చెప్పుకొచ్చింది. గుహలో తనకు, తన పిల్లలకు ఎటువంటి హానిలేదని నీనా కుటినా తెలిపింది. ప్రకృతిలో ఉండటం తమకు గొప్ప అనుభూతినిస్తుందని, ఇక్కడికి మేము చనిపోయేందుకు రాలేదని, తన పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఆమె మీడియాకు తెలిపింది.
#WATCH | Bengaluru | Russian national Nina Kutina, who was found living with her two daughters in a remote cave near Gokarna in Karnataka, says, "We have a lot of experience staying in nature and we were not dying. I did not bring my children to die in the jungle...We used to… pic.twitter.com/iY0Bi8I6xb
— ANI (@ANI) July 14, 2025
నినా కుటినా తన పిల్లలతో గుహలో ఉండటాన్ని చూసి పలువురు ఆశ్యర్యపోయారు. అయితే ఆ గుహ జనావాసాలకు దూరంగా అడవిలో లేదని, గ్రామానికి చాలా దగ్గరలోనే ఉందని ఆమె తెలిపింది. తాము ఇక్కడి జలపాతంలో ఆనందంగా ఈత కొట్టామని పేర్కొంది. తాను 2016లో బిజినెస్ వీసాపై భారతదేశానికి వచ్చానని, ఆ వీసా గడువు 2017తో ముగిసిపోయిందని, ఇప్పుడు తమ దగ్గర చెల్లుబాటు అయ్యే వీసా లేదని ఆమె వివరించింది. 2017 తర్వాత తాము నాలుగు దేశాలలో తిరిగామని, ఇప్పుడు భారత్ వచ్చామని ఆమె తెలిపింది. ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన తర్వాత సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో అధికారులకు ఆమెతో పాటు పిల్లలు గోకర్ణ గుహలో కనిపించారు. రామతీర్థ కొండలోని గుహ వెలుపల చీర, ఇతర దుస్తులను వేలాడదీసి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తరువాత నినా కుటినాను, ఆమె ఇద్దరు పిల్లలను గమనించారని ఉత్తర కన్నడ పోలీసు సూపరింటెండెంట్ ఎం నారాయణ తెలిపారు.