4,500 ఏళ్ల నాటి మొహంజోదారో నాట్యకారిణి..! ఇప్పటికీ అంత క్రేజ్‌ ఎందుకంటే.. | Dancing Girl Of Mohenjo-Daro: Still Fascinates The World | Sakshi
Sakshi News home page

4,500 ఏళ్ల నాటి మొహంజోదారో నాట్యకారిణి..! ఇప్పటికీ అంత క్రేజ్‌ ఎందుకంటే..

Jun 17 2026 12:20 PM | Updated on Jun 17 2026 12:58 PM

Dancing Girl Of Mohenjo-Daro: Still Fascinates The World

పాఠ్యపుస్తకాల్లో ఆ విగ్రహం మార్పుతో మరోసారి 4,500 ఏళ్ల నాటి మోహంజోదారో డ్యాన్సింగ్‌ ‍క్వీన్‌ విగ్రహం తెరపైకి వచ్చింది. ఎన్సీఆర్టీ తొమ్మిదో తరగతి ఎడ్యుకేషన్‌ పాఠపుస్తకం 'మధురిమ'లో, మోహెంజో-దారోకు చెందిన ప్రసిద్ధ 'నాట్యకారిణి' విగ్రహం మార్పు చేయడంతోనే వివాదం చెలరేగింది. ఈ పాఠ్యపుస్తకంలో కంచు విగ్రహం మొండెంపై నీడను వేసి, ఆ విగ్రహం దుస్తులు ధరించినట్లుగా కనిపించేలా చేశారు. ఈ మార్పుపై చరిత్రకారులు, విద్యావేత్తల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత సుపరిచితమైన కళాఖండాలలో ఒకటైన ఈ విగ్రహాన్ని ఎందుకు మార్చారంటూ ప్రశ్నించారు. దీంతో పాత చిత్రాన్నే యథాతథంగా ముద్రిస్తామని ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్‌ సక్లానీ తెలిపారు. అసలు చరిత్రకారులు, కళా ప్రేమికులు అంతలా ఆరాధించే ఆ నాట్యాకారిని విగ్రహం ఎవరిది..ఎందుకు ఇంత క్రేజ్‌ అంటే..

ఈ నాట్యకారిణి" విగ్రహం, క్రీ.పూ. 2500 ప్రాంతంలో  ప్రపంచంలోని తొలి పట్టణ సంస్కృతులలో ఒకటైన సింధు లోయ నాగరికత అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటి. ఈ కంచు విగ్రహాన్ని 1926లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మెకే, మొహెంజో-దారో (ప్రస్తుత పాకిస్తాన్) నుంచి తవ్వకాలలో వెలికితీశారు. ఆ ప్రాచీన నగరంలోని 'తొమ్మిదవ సందు'గా పిలిచే మార్గంలో ఒక సాదాసీదా ఇంటి శిథిలాలలో పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. కేవలం 10.5 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఈ విగ్రహం ఆశ్చర్యకరంగా చాలా చిన్నది. అయినప్పటికీ, దాని ప్రభావం మాత్రం అసాధారణమైనది.

అత్యంత ఆధునిక పద్ధతిలో..
హరప్పా స్థలాల నుంచి లభించిన వేలాది టెర్రకోట విగ్రహాల వలె కాకుండా, 'నాట్యకారిణి' విగ్రహాన్ని అత్యంత అధునాతనమైన 'లాస్ట్-వ్యాక్స్ కాస్టింగ్' పద్ధతిని ఉపయోగించి కంచుతో తయారుచేశారు. ఈ పద్ధతి ఎంత ఆధునికమైనదంటే, అది నేటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ విగ్రహం తయారీలో భాగంగా, మైనంతో ఒక నమూనాను చెక్కి, దానికి బంకమట్టి పూత పూసి, ఆ మైనాన్ని కరిగించివేసి, ఆ తర్వాత ఏర్పడిన ఖాళీలో కరిగిన లోహాన్ని పోస్తారు.

కట్టిపడేసే రూపకల్పన..
ఇంత సున్నితంగా చెక్కబడిన కంచు వస్తువు ఉనికి, నాలుగు వేల సంవత్సరాల క్రితమే సింధు లోయ ప్రజలకు లోహశాస్త్రం, పోత, కళాత్మక రూపకల్పనలో అత్యంత అభివృద్ధి చెందిన జ్ఞానం ఉండేదని నిరూపిస్తుంది. ఇప్పటికీ ఆధునికంగా అనిపించే ఆ భంగిమ. ఆ డ్యాన్సింగ్‌ క్వీన్‌ విగ్రహంలో ప్రధాన ఆకర్షణ అంతా ఆ భంగిమలోనే ఉంది.

ఆమె ఒక హారం, అనేక గాజులు ధరించి ఉంది; ఒక చేతికి 24 లేదా 25 గాజులు, మరో చేతికి కేవలం నాలుగు గాజులు ఉన్నాయి. ఆమె జుట్టును ఒక పెద్ద కొప్పులా ముడివేసి, అది ఆమె భుజంపై ఆనించి ఉంది.

ఈ విగ్రహాన్ని అధ్యయనం చేసిన బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త సర్ జాన్ మార్షల్ ఇలా పేర్కొన్నారు. "ఒక యువతి, నడుముపై చేయి పెట్టి, కొంటె భంగిమలో ఉంది" అని వర్ణించారు. అంతేగాదు ఆ క్షణానికి, తనపైనా,  ప్రపంచంపైనా సంపూర్ణ విశ్వాసంతో ఉన్న ఒక అమ్మాయిగా పేర్కొన్నారు.

ఆమె నిజంగా "నాట్యం" చేసిందా?
విచిత్రమేమిటంటే, ఆమె అసలు నర్తకి అవునా కాదా అనే విషయంపై చరిత్రకారులు ఏకీభవించలేకపోతున్నారు. ఈ సాంప్రదాయక వ్యాఖ్యానం చాలావరకు మార్షల్ వర్ణన నుంచి ఉద్భవించింది. ఆమె భంగిమ, వంగిన కాలు, నడుముపై చేయి పెట్టిన నిలకడ కదలిక వంటివి కనిపించడంతో చరిత్రకారులు దీన్ని "నాట్యకారిణి" గా పిలిచారు. 

అంతేగాదు ఆమె ఒక పూజారిణి లేదా పవిత్ర స్త్రీ అయి ఉండవచ్చని కొందరు వాదిస్తారు. మరికొందరు ఆమె ఒక రాణి లేదా సమాజంలోని ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తికి, సంతాన దేవతకు లేదా ఒక యోధురాలికి ప్రతీకగా నమ్ముతారు. ఆమె మెడలోని గాజులు అసాధారణంగా అసమానంగా అమరి ఉండటం, అలాగే ఆ గంభీరమైన భంగిమ తదితరాల్ని ఔను అని అంగీకరించేలా ఉండటం విశేషం. కానీ నిజంగానే ఆమె నర్తకీనేనా అనేది మిస్టరీనే..ఎందుకంటే అందుకు సంబంధించిన ఆధారాలు, నిర్థారణలు కానరాలేదు. పైగా సింధు లిపీ కూడా ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పష్టతను ఇవ్వలేకపోయింది. 

దీని కథ తవ్వకంతో ముగిసిపోలేదు..
ఆ విగ్రహాన్ని గుర్తించిన తర్వాత లాహోరల్‌లో ఉంచారు. ఆ తర్వాత బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాలలో న్యూఢిల్లీలోని సంస్థలకు తరలించారు. 1947లో భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు, ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ప్రదేశాల నుంచి తవ్వకాలలో లభించిన కళాఖండాల యాజమాన్యంపై వివాదాలు తలెత్తాయి. 

చివరికి, ప్రసిద్ధ పూజారి-రాజు శిల్పం పాకిస్తాన్‌ వద్దే ఉండిపోగా, నాట్యకారిణి విగ్రహం భారతదేశం వద్దే ఉండిపోయింది. ప్రస్తుతం ఈ విగ్రహం న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో భద్రంగా ఉంది. 

 

(చదవండి: పసుపు కొమ్ము గణపతి రహస్యం..! గురుగ్రహం దోషాలకు పరిష్కారంగా..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement