వీడియోలా కనిపించే ఎక్స్‌–రే! | Explanation of Dynamic Digital Radiography | Sakshi
Sakshi News home page

వీడియోలా కనిపించే ఎక్స్‌–రే!

Aug 2 2026 1:43 AM | Updated on Aug 2 2026 1:43 AM

Explanation of Dynamic Digital Radiography

ఇప్పటివరకు మనకు ఎక్స్‌–రే తెలుసు. ఎముకలు విరిగినవాళ్లు ఎక్స్‌–రే తీయించుకోవడంతో పాటు దేహంలోని ఏవైనా భాగాలను చూడాలనుకున్నప్పుడు డాక్టర్లు కొన్ని ఎక్స్‌–రేలు సూచించడమూ మనకు తెలుసు. అయితే ఈ ఎక్స్‌–రేలన్నీ ఒక స్టిల్‌ ఫొటోలా ఒకే చిత్రం (సింగిల్‌ ఇమేజ్‌)లా ఉంటాయి. ఒకవేళ ఎక్స్‌రే కూడా వీడియోలా తీస్తే ఎలా ఉంటుంది? ఇలా చూపించేదే ‘డైనమిక్‌ డిజిటల్‌ రేడియోగ్రఫీ’ (డీడీఆర్‌). అసలీ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఏయే ప్రయోజనాలకు పనికి వస్తుంది, దాని పరిమితులేమిటి వంటి అనేక అంశాలను చూద్దాం...

బాగా లేటెస్ట్‌గా వస్తున్న అతి పాత టెక్నాలజీకి సరికొత్త రూపమిది. అందువల్ల డైనమిక్‌ డిజిటల్‌ రేడియోగ్రఫీ (డీడీఆర్‌) అనేది సాధారణ డిజిటల్‌ ఎక్స్‌–రేకు కొంత అధునాతన రూపమని చెప్పవచ్చు. కాకపోతే ఇందులో ఒక మార్పు చేశారు. అదేమిటంటే... సాధారణ ఎక్స్‌–రేలో అది సింగిల్‌ ఇమేజ్‌లాగా వస్తుంది. కానీ డైనమిక్‌ డిజిటల్‌ రేడియోగ్రఫీలో చాలా తక్కువ వ్యవధిలో వరుసగా / చకచకా అనేక ఎక్స్‌–రే స్టిల్స్‌ తీస్తారు. అంటే ఇందులో ఒకే స్టాటిక్‌ ఎక్స్‌–రే చిత్రం తీసే బదులుగా... తక్కువ వ్యవధిలో వరుసగా అనేక ఎక్స్‌–రే చిత్రాలను తీసి... అటు తర్వాత ఓ వీడియోలాగా (డైనమిక్‌ సీక్వెన్స్‌లాగా) రూపొందిస్తారు. 

దీని వల్ల శరీరంలోని అవయవాల కదలికలను వరుస చిత్రాల రూపంలో పరిశీలించవచ్చు. సాధారణంగా సెకండ్‌కు అనేక (సాధారణంగా 7 – 15) చిత్రాల చొప్పున వరుసగా ఎక్స్‌–రే చిత్రాలు తీసి, వాటిని వేగంగా కదపడం వల్ల వీడియో ఎఫెక్ట్‌ వస్తుంది. దాంతో ఎక్స్‌–రే చిత్రాలనే ఒక చిన్న వీడియోలా చూడటం సాధ్యపడుతుంది. అంటే... ఎక్స్‌–రే చిత్రాలనే కదిలే వీడియో ఫుటేజ్‌లా చూడటం జరుగుతుందన్నమాట. అలా... కొన్ని నిర్దిష్టమైన వైద్య పరీక్షల్లో ఫ్లోరోస్కోపీ లేదా సీటీ స్కాన్‌తో పోలిస్తే కాస్త తక్కువ రేడియేషన్‌తో అవసరమైన సమాచారం అందించే అవకాశాలెక్కువ.

ఏయే సందర్భాల్లో ఇది పనికివస్తుందంటే... 
డైనమిక డిజిటల్‌ రేడియోగ్రఫీ (డీడీఆర్‌) అనే ఈ సాంకేతికతను ప్రధానంగా కొన్ని అవయవాల కదలికల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణకు... 
→ ఊపిరితిత్తుల (లంగ్స్‌) పనితీరు (అంటే శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం సమయంలో ఊపిరితిత్తుల కదలిక ఉంటున్నందున ఆ కదలికల్లో ఏమైనా తేడాలున్నాయా తెలుసుకోవడం కోసం) 
→ డయాఫ్రం కదలిక (శ్వాస తీసుకుంటున్న సమయంలో ఛాతీ, కడుపులోని అంతర్గత భాగాలను వేరు చేసే కీలకమైన డయాఫ్రం అనే కండరం.. శ్వాస తీసుకుంటున్నప్పుడు కిందివైపునకూ, వదిలినప్పుడు పైకి కదులుతుంటుంది) 
→ ఛాతీ గోడ కదలికలు (శ్వాసలో కదులుతుండేవి) 
→ కొన్ని సందర్భాల్లో కీళ్ల కదలికలు, అలాగే కదిలడానికి అవకాశమున్న ఇతర అవయవాల పనితీరును అంచనా వేయడానికి.

ప్రయోజనాలు...
→ సాధారణ ఎక్స్‌–రే కేవలం స్టిల్‌ ఫొటోగ్రఫీ (స్థిర చిత్రం)కాగా దానితో పోలిస్తే అవయవాల కదలికలను చూడగలగడం సాధ్యం 
→ చాలా సందర్భాల్లో ఫ్లోరోస్కోపీ లేదా సీటీ స్కాన్‌ కంటే తక్కువ రేడియేషన్ తోనే మంచి కీలకమైన సమాచారం పొందే అవకాశం 
→ చాలా త్వరితంగా పూర్తయ్యే పరీక్ష 
→ నొప్పిలేని, శస్త్రచికిత్స అవసరం లేని పరీక్ష

పరిమితులు...
→ అన్ని ఆసుపత్రుల్లో ఈ సాంకేతికత అందుబాటులో లేకపోవడం 
→ ప్రతి వ్యాధికీ డీడీఆర్‌ సరిపోకపోవచ్చు. అవసరాన్ని బట్టి డాక్టర్లు సీటీ స్కాన్, ఎమ్మారై లేదా ఇతర పరీక్షలను సూచించడానికి అవకాశం లేకపోలేదు. 

చివరగా... ఇది సాధారణ ఎక్స్‌–రేకి ప్రత్యామ్నాయం కాదు, అలాగే సీటీ స్కాన్‌ లేదా ఎమ్మారైకి కూడా ప్రత్యామ్నాయం కాదు. దీనిపై ఇంకా పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. ఉదాహరణకు ఊపిరితిత్తుల్లో గాలి, అలాగే రక్తప్రవాహానికి సంబంధించిన కొన్ని మార్పులను ఈ సాంకేతికత ద్వారా అంచనా వేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఈ టెక్నాలజీ కొన్ని కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో దీని ఉపయోగాలు మరింత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఇప్పటికి మాత్రం దీనిని ఎంపిక చేసిన కొద్దిమంది పేషెంట్లలోనే అవసరాన్ని బట్టి ఉపయోగిస్తున్నారు.

డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌


నిర్వహణ: యాసీన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement