క్యాడ్‌బరీ యాడ్‌లో ఓ చిరునవ్వుతో మెరిసిన అమ్మాయే– నేడు కుర్రాళ్ల కొత్త క్రష్‌గా మారిన భాగ్యశ్రీ బోర్సే. కానీ ఈ అందాలభామ ప్రయాణమంతా రంగులే కాదు. నవ్వించే కథలూ ఉన్నాయి; కన్నీళ్లు పెట్టించే జ్ఞాపకాలూ ఉన్నాయి! ఆ స్ట్రగుల్స్, స్టార్‌డమ్, సరదా ముచ్చట్లు అన్నీ భాగ్యశ్రీ బోర్సే మాటల్లోనే!
అమ్మకు ఇచ్చిన మాట!
నేను పుట్టిన కొద్దిరోజులకే నాన్న ఉద్యోగం పోయింది. ‘నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఏదైనా పని ఇవ్వండి’ అని ఆయన ఉద్యోగాల కోసం తిరిగిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆ రోజు నుంచి ఒకటే నిర్ణయం తీసుకున్నా– బాగా డబ్బు సంపాదించాలి. మా నాన్న మళ్లీ ఎప్పుడూ తలవంచకూడదు.
రూ.300తో గడిచిన రోజులు!
మా ఇంట్లో ఒక చిన్న డైరీ ఉండేది. అందులో రూ.10 పచ్చిమిర్చి, రూ.10 పాలకూర... ఇలా ప్రతి ఖర్చూ రాసుకునేవాళ్లు. వారానికి కేవలం రూ.300తో ఇంటిని నడిపిన రోజులు చూశాను. అందుకే ఇప్పుడు వచ్చిన ప్రతి విజయానికి విలువ తెలుసు.
నైజీరియాలో బుల్లీయింగ్!
నా చిన్నతనంలో ఏడేళ్లు నైజీరియాలో గడిచాయి. అక్కడ నా యాస, భాష కారణంగా చాలాసార్లు బుల్లీయింగ్‌కు గురయ్యాను. అప్పట్లో నలుగురి ముందు మాట్లాడాలంటే భయపడేదాన్ని. అలాగే, ఎత్తంటే కూడా... అందుకే, దుబాయ్‌లో స్కైడైవింగ్ చేశా. అలా ఇప్పుడిప్పుడే నా భయాలన్నింటిని నెమ్మదిగా తగ్గించుకుంటున్నాను.
మోడల్‌గా మొదలైన ప్రయాణం!
సినిమాల కంటే ముందే యాడ్స్ నా జీవితంలోకి వచ్చాయి. ముఖ్యంగా క్యాడ్‌బరీ డెయిరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో చాలామంది నన్ను గుర్తుపట్టారు. అక్కడి నుంచే సినిమాల ప్రయాణం మొదలైంది.
నా డైలాగ్స్ నేనే చెబుతా!
తెలుగు నా మాతృభాష కాదు. కానీ ప్రేక్షకులకు నిజాయితీగా కనిపించాలంటే నా డైలాగ్స్ నేనే చెప్పాలని నిర్ణయించుకున్నా. అందుకే ‘మిస్టర్ బచ్చన్’ కోసం చాలా కష్టపడి తెలుగు నేర్చుకున్నాను.
పెళ్లి ప్రశ్నతో వైరల్!
ఒక కాలేజ్ ఈవెంట్‌లో ‘ఫ్రెండ్, డేట్, మ్యారీ’ గేమ్ ఆడుతూ... నా సినీ హీరోలందరూ అప్పటికే పెళ్లైన వారే, వారిని మళ్లీ ఎలా మ్యారీ చేస్తానని చెప్పా. ఆ తర్వాత వచ్చిన మీమ్స్ చూసి బాగా నవ్వుకున్నా! ఏదో సరదాగా చెప్పిన మాట అంత వైరల్ అవుతుందని అనుకోలేదు.
రాజమౌళి సర్‌తో సినిమా... నా డ్రీమ్!
ప్రతి నటికి ఒక డ్రీమ్ లిస్ట్ ఉంటుంది. నా లిస్ట్‌లో రాజమౌళి సర్, త్రివిక్రమ్ సర్‌లతో కలిసి పని చేయడం మొదటి స్థానంలో ఉంటుంది.
హైదరాబాద్... నా కర్మభూమి!
నేను ఎన్నిసార్లు కిందపడినా, మళ్లీ లేవడానికి బలం ఇచ్చింది ప్రేక్షకుల ప్రేమే! ముఖ్యంగా హైదరాబాద్ నాకు చాలా స్పెషల్. ఈ నగరాన్ని నేను నా ‘కర్మభూమి’గా భావిస్తాను.


