కాలం చెరపలేని బంధం నేస్తనిధి | Sakshi Funday Special Story: Friendship Day is celebrated on August 2 | Sakshi
Sakshi News home page

కాలం చెరపలేని బంధం నేస్తనిధి

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

Sakshi Funday Special Story: Friendship Day is celebrated on August 2

నేడు ఫ్రెండ్‌షిప్‌ డే

హాట్‌స్పాట్‌ అడగకుండానే ఆన్  చేసేవాడు... ఓటీటీ పాస్‌వర్డ్‌ లాంగ్‌ టైమ్‌ షేర్‌ చేసేవాడు... బిర్యానీ ఆర్డర్‌ చేస్తే బిల్‌ కట్టేవాడు...  బ్రేకప్‌ స్టోరీని వందోసారి చెప్పినా ఓపిగ్గా వినేవాడు... అర్ధరాత్రి ఫోన్‌ చే సినా సొల్యూషన్ తో రెడీగా ఉండేవాడు.. మెంటల్‌ పీస్‌ పోయిన ప్రతిసారీ మందులా పని చేసేవాడు... జీవితంలో లోబ్యాటరీ అనిపించిన ప్రతిసారీ పవర్‌బ్యాంక్‌లా నిలిచేవాడు... ఇంట్లో వాళ్లకు తెలియని మన మరో వెర్షన్  మొత్తం తెలిసిన ఏకైక వ్యక్తి... వాడే... మన బెస్ట్‌ ఫ్రెండ్‌! జీవితంలో నవ్వులను పెంచి... బాధలను పంచుకుని... ప్రతి జ్ఞాపకాన్ని మరింత అందంగా మార్చిన ప్రతి నేస్తానికి... హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే!

జీవితంలో కొన్ని బంధాలు పుట్టుకతో వస్తాయి... 
కొన్ని పెళ్లితో వస్తాయి... కానీ మనమే ఎంచుకునే ఏకైక బంధం – స్నేహం! అయితే, ప్రతి స్నేహానికి ఒక సినిమా ఉంటుంది. మొదటి పరిచయం... మొదటి గొడవ... మొదటి బంక్‌... మొదటి బర్త్‌డే సర్‌ప్రైజ్‌... మొదటి బ్రేకప్‌కి ఇచ్చిన ఓదార్పు... మొదటి జాబ్‌ సెలబ్రేషన్ ... ఏళ్ల తర్వాత కలిసినా... ‘ఇంకా బతికే ఉన్నావా?’ అని ఆటపట్టించడంతోనే మొదలవుతుంది ఈ బంధం. 

వీరికి మన పుట్టినరోజు అంతగా గుర్తుండదు... కానీ పదేళ్ల క్రితం జరిగిన మన పరువు తీసిన సంఘటన మాత్రం బాగా గుర్తుంటుంది. అది పట్టుకుని మన జీవితాంతం ఆటపట్టిస్తూనే ఉంటాడు. మాటలతో అల్లరి చేయడం, కలిసిన ప్రతిసారి నవ్వుకోవడం... అవసరం వచ్చినప్పుడల్లా అడగకుండానే అండగా నిలవడం... ఇవన్నీ కలిస్తేనే నిజమైన స్నేహం. అందుకే, ఈ ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా... ప్రతి స్నేహితుడిలో దాగి ఉండే ఈ సరదా, ఈ భావోద్వేగం, ఈ ప్రత్యేకత గురించి తెలుసుకునేలా ఈ ప్రత్యేక కథనం...  

ఫ్రెండ్‌ కోసం... క్యాలెండర్‌లో ఒక రోజు పుట్టింది!
ఆగస్టు మొదటి ఆదివారం అంటే చేతికి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టుకోవడం, పాత ఫొటోలు స్టేటస్‌లో పెట్టడం, ‘హ్యాపీ ఫ్రెండ్‌షిప్‌ డే!’ అని ఒకే మెసేజ్‌ను పది గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేయడం మాత్రమే చాలామందికి తెలుసు. కాని, ఈ రోజు వెనుక ఒక పెద్ద ఆలోచన దాగి ఉందని కొంతమందికే తెలుసు. ఈ కథ మొదలైంది 1930లో. ప్రముఖ హాల్‌మార్క్‌ కార్డ్స్‌ వ్యవస్థాపకుడు జాయిస్‌ హాల్‌ ఒక చిన్న ప్రశ్న వేశారు... ‘జీవితంలో మనల్ని ఎక్కువగా భరించే ఫ్రెండ్స్‌ కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఎందుకు ఉండకూడదు?’ అని. ఆ ఆలోచన అలా గాల్లో కలిసిపోలేదు.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత, 1958లో పరాగ్వేకు చెందిన డాక్టర్‌ రామోన్  ఆర్టెమియో బ్రాచో దాన్ని ‘వరల్డ్‌ ఫ్రెండ్‌షిప్‌ క్రూసేడ్‌’ ఉద్యమంగా మార్చారు. అలా ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డేగా ప్రజాదరణ పొందింది. ఆ సంప్రదాయాన్ని భారత్, అమెరికా, బంగ్లాదేశ్, మలేషియా వంటి దేశాలు కూడా కొనసాగించాయి. ముఖ్యంగా ఆదివారం కావడంతో స్కూల్, కాలేజీ, ఉద్యోగాల ఇబ్బంది లేకుండా స్నేహితులు కలుసుకునేందుకు ఇది అనువుగా మారింది. తర్వాత 2011లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ శాంతి, స్నేహాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో జూలై 30వ తేదీని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించినా... అప్పటికే ప్రజల జీవితాల్లో ఆగస్టు మొదటి ఆదివారం ఒక సంప్రదాయంగా స్థిరపడిపోవడంతో, భారత్‌ సహా అనేక దేశాలు ఇప్పటికీ అదే రోజున ఫ్రెండ్‌షిప్‌ డే జరుపుకుంటున్నాయి.

దేశానికో తీరు సెలబ్రేషన్స్‌!
భారత్‌లో అయితే చేతికి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టకపోతే ఆ రోజు పూర్తయినట్టే కాదు! అమెరికాలో చిన్న కార్డు, కాఫీ ట్రీట్‌తో స్నేహాన్ని సెలబ్రేట్‌ చేస్తే... పరాగ్వేలో ‘సీక్రెట్‌ ఫ్రెండ్‌’ ఆటతో ఎవరికీ తెలియకుండా గిఫ్ట్‌లు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేస్తారు. అర్జెంటీనాలో మాత్రం ఆ రోజు మొబైల్‌ నెట్‌వర్క్‌లకే ఊపిరాడనంతగా ఫోన్  కాల్స్, మెసేజ్‌లతో విష్‌ చేసుకుంటారు. ఇక ఫిన్ లాండ్, ఎస్టోనియా లాంటి దేశాల్లో స్నేహితులతో కలిసి భోజనం చేయడం, సమయం గడపడానికే పెద్ద ప్రాధాన్యం ఇస్తారు. అయితే, ఇప్పుడు దాదాపు ప్రపంవ్యాప్తంగా ఫార్వర్డ్‌ మెసేజ్‌లు, పాత ఫొటో స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్, వీడియో కాల్స్, ఆన్ లైన్  గేమింగ్‌ సెషన్ లతో స్నేహాన్ని సెలబ్రేట్‌ చేస్తున్నారు.

గ్యాంగ్‌లోని అరుదైన పాత్రలు!
ప్రపంచంలో వింత జీవులు చాలా ఉంటాయి... కానీ వాటిలో అత్యంత అరుదైన జాతి మాత్రం ఫ్రెండ్స్‌! వీళ్ల పనులకు లాజిక్‌ ఉండదు... మాటలకు హద్దులు ఉండవు... టైమింగ్‌కు గడియారం పనిచేయదు. ఇక అల్లరికైతే బ్రేకులు ఉండవు. అయినా వీళ్లు లేకపోతే జీవితం చాలా బోరింగ్‌ అయిపోతుంది. మరి... మీ ఫ్రెండ్‌ ఏ కేటగిరీకి చెందుతాడో ఈ సరదా జాబితాలో చూసేయండి!

టిఫిన్  టెర్రరిస్ట్‌!
స్కూల్‌లో లంచ్‌ బెల్‌ కొట్టగానే మీ పక్కనే ప్రత్యక్షమయ్యే మొదటి వ్యక్తి ఇతనే! ‘మీ అమ్మ చేసిన ఆలుగడ్డ కూర సూపర్‌ రా!’ అంటూ తన టిఫిన్  తెరవకముందే మీదే ఖాళీ చేసేవాడు. ఇప్పుడు టిఫిన్  బాక్స్‌ స్థానంలో స్విగ్గీ, జొమాటో వచ్చినా సరే, ఇతని స్వభావం ఏమాత్రం మారి ఉండదు. ‘నేను ఏమీ తినను!’  అంటూనే మీరు ఆర్డర్‌ చేసిన బిర్యానీలో సగం తన ప్లేట్‌లోకి షిప్ట్‌ చేసుంటాడు. బిల్‌ గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించడు. మీరు ఆకలిగా ఉన్నా లేకున్నా మీ ఆత్మారాముడితో పాటు తన ఆత్మారాముడిని కూడా సంతోషంగా ఉంచడమే ఈ ఫ్రెండ్‌ లక్ష్యం!

రేపటి రాజు
స్కూల్‌లో ఐదు రూపాయలు... కాలేజీలో యాభై... ఇప్పుడు రెండు వేలైనా, పదివేలైనా ‘రేపు పంపిస్తా’ అనేది వీళ్ల ట్రేడ్‌మార్క్‌ డైలాగ్‌. గూగుల్‌ పే, ఫోన్ పే, యూపీఐ అన్నీ వాడతాడు... కానీ మీ డబ్బు తిరిగి పంపడానికి మాత్రం నెట్‌వర్క్‌ పనిచేయదు! ఆశ్చర్యమేంటంటే... కొత్త ఫోన్ , కొత్త బైక్, వీకెండ్‌ ట్రిప్‌ల స్టేటస్‌లు మాత్రం రెగ్యులర్‌గా అప్‌డేట్‌ అవుతూనే ఉంటాయి. అయితే, ఈ రాజులందరూ ఒకేలా ఉండరు. మీ పది రూపాయలు తిరిగి ఇవ్వడానికి నెలలు పట్టొచ్చు. కానీ మీకు కష్టం వచ్చిందని తెలిసిన పది నిమిషాల్లో మీ ముందు నిలబడతారు. అందుకే కొన్నిసార్లు, వీళ్ల బాకీ డబ్బు కంటే, వీళ్ల తోడు విలువ ఎక్కువ!

నడిచే గూగుల్‌
ఈ ఫ్రెండ్‌కు ప్రపంచం మొత్తం తెలుసు... ఒక్క తన వస్తువులు తప్ప! షేర్‌ మార్కెట్‌ నుంచి స్పేస్‌ టెక్నాలజీ నుంచి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్ ్స వరకు... ఏ విషయం అడిగినా ఐదు నిమిషాల్లో క్లాస్‌ చెప్తాడు. మీ కెరీర్, మీ డైట్, ఏ మొబైల్‌ కొనాలి, ఏ వెబ్‌సిరీస్‌ చూడాలి... అన్నింటికీ రెడీగా సలహాలు ఇస్తాడు. కానీ తన జీవితంలోని చిన్న నుంచి పెద్ద పెద్ద నిర్ణయాలన్నింటికీ మీతోనే చర్చిస్తాడు. ఎందుకంటే... వాటి గురించి ఆలోచించడానికి ఒక ఫ్రెండ్‌ ఉన్నాడని వీళ్ల పూర్తి నమ్మకం! ఆ దురదృష్టవంతుడు మీరే అయితే బాధపడకండి.

రీల్స్‌ రాక్షసుడు
మీరు ఇన్‌స్టంట్‌గా నవ్వాలంటే ఇతనొక్కడే చాలు! ఎందుకంటే, ఈ ఫ్రెండ్‌ రోజుకు ఇరవై రీల్స్, ముప్పై మీమ్స్, నలభై వీడియోలు ఫార్వర్డ్‌ చేస్తాడు. కానీ ‘పని ఉంది. రారా!’ అని మెసేజ్‌ పెడితే మాత్రం రెండు రోజుల తర్వాత ‘సారీ రా... ఇప్పుడే చూశా!’ అని చెప్తాడు. ఆశ్చర్యంగా మీరు పెట్టిన స్టేటస్‌కు మాత్రం నిమిషానికే కామెంట్‌ చేస్తాడు. ఒకవేళ ఈ ఫ్రెండ్‌ ఒక గంట పాటు ఒక్క రీల్‌ కూడా షేర్‌ చేయలేదంటే... వెంటనే కాల్‌ చేయండి! బ్యాటరీ అయిపోయిందో... ఫోన్  పోయిందో... లేక నిజంగానే ఏదైనా సమస్య వచ్చిందో చెక్‌ చేయాల్సిన బాధ్యత ఇక్కడ మీదే!

క్యాండిడ్‌ కలెక్టర్‌!
ఒక్క ఫొటో కోసం వంద పోజులు! ఈ ఫ్రెండ్‌తో బయటకు వెళ్లడం అంటే ట్రిప్‌ కాదు, ఫొటోషూట్‌! తినే ముందు ఫొటో.. తాగేముందు ఫొటో.. నవ్వేముందు ఫొటో.. ఆఖరికి మీరు తుమ్మినా... ‘మరోసారి తుమ్ము... వీడియో తీయాలి!’ అంటాడు. అలా టీ చల్లారిపోవచ్చు... ఐస్‌క్రీమ్‌ కరిగిపోవచ్చు... కానీ ఫొటో పర్ఫెక్ట్‌గా రావాలి. యాభై క్లిక్స్‌ తీసి, నలభై తొమ్మిది డిలీట్‌ చేసి, చివరికి మీరు కళ్లు మూసుకున్న ఫొటోనే ‘క్యాండిడ్‌!’ అంటూ పోస్ట్‌ చేస్తాడు. ఈ ఫ్రెండ్‌తో చాలా జాగ్రత్త! మీ బాగున్న ఫొటోలు కంటే, బాగాలేని, అన్‌లిమిటెడ్‌ ఎంబరాసింగ్‌ ఫొటో కలెక్షన్‌ మొత్తం సేఫ్‌గా ఈ ఫ్రెండ్‌ దగ్గరే ఉంటుంది.

బద్ధకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌! 
ఈ ఫ్రెండ్‌ గడియారం మిగతా ప్రపంచంతో పని చేయదు. అంతా రెడీ అయ్యి, మీరు టీ తాగి, బజ్జీలు తిని, మరోసారి టీ ఆర్డర్‌ చేసి కాల్‌ చేసినా, ఇంకా ‘దగ్గర్లోనే ఉన్నా!’ అనే అంటాడు. అయితే, ఇదే ఫ్రెండ్‌కు మీరు ‘చాలా అర్జెంట్‌!’ అంటే మాత్రం ఆశ్చర్యపరుస్తూ నిజంగానే మీ ముందు ప్రత్యక్షమవుతాడు. అందుకే... వీళ్ల టైమింగ్‌ కంటే, కష్టకాలంలో వీళ్ల తోడును మాత్రం కచ్చితంగా నమ్మొచ్చు!

కష్టకాల కింగ్‌!
ఈ ఫ్రెండ్‌ రోజూ ఫోన్  చేయకపోవచ్చు. మెసేజ్‌లు పెట్టకపోవచ్చు. పుట్టినరోజుకు ఆలస్యంగా విషెస్‌ చెప్పొచ్చు. కానీ మీకు ఏ సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం వీళ్లదే! ఉద్యోగం పోయినా... ప్రేమ విఫలమైనా... ఇంట్లో గొడవైనా... డబ్బు అవసరమైనా... ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా... అర్ధరాత్రి ఒక కాల్‌ చేసినా కూడా, మీ సమస్యకు ఏ తీర్పులు చెప్పడు... తప్పులు వెతకడు... ముందుగా మీ పక్కన నిలబడతాడు. జీవితంలో ఇలాంటి ఫ్రెండ్‌ ఒక్కరైనా ఉంటే, మీరు ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతులని అర్థం.

మ్యారేజ్‌తో మిస్సింగ్‌ ఫ్రెండ్‌!
పెళ్లికి ముందు రోజూ గ్రూప్‌లో హడావుడి చేసే ఇతను, పెళ్లయ్యాక మొత్తం మెసేజ్‌లు తగ్గిపోతాయి. కలవడం కొన్నిసార్లు సంవత్సరాలకూ చేరుతుంది. అయితే, ఇక్కడ స్నేహం తగ్గిందని అనుకోవద్దు... జీవితానికి కొత్త బాధ్యతలు చేరాయని మాత్రమే అర్థం. ఇక్కడ మారేది ఫ్రెండ్‌ కాదు, టైమ్‌టేబుల్‌ మాత్రమే! ఎందుకంటే, ఈ ఫ్రెండ్‌ ఫోన్‌లో ఐదు నిమిషాలు మాట్లాడుతూనే, ‘ఒక్క నిమిషం రా... బాబు ఏడుస్తున్నాడు!’ అంటూ మల్టీటాస్కింగ్‌ చేస్తూనే మీతో నవ్వుతుంటాడు. ఇదే అసలు అడల్ట్‌ ఫ్రెండ్‌షిప్‌... కాల్స్‌ తగ్గినా, కనెక్షన్  మాత్రం ఫుల్‌ సిగ్నల్‌లోనే ఉంటుంది!

ట్రిప్‌ ప్లానర్స్‌!
ఫ్రెండ్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో అడుగు పెట్టాడంటే చాలు... ‘ఈసారి గోవా పక్కా!’, ‘తర్వాత బాలి!’ అంటూ ప్రపంచ పర్యటన మొదలైపోతుంది. గూగుల్‌ షీట్స్, బడ్జెట్, హోటళ్లు, చూడాల్సిన ప్రదేశాలు... అన్నీ ఫుల్‌ డీటెయిల్స్‌తో రెడీ! కానీ బయలుదేరే రోజు వచ్చేసరికి ‘లీవ్‌ రాలేదు రా!’, ‘ఈ నెల కాస్త టైట్‌!’ అంటూ మొదట క్యాన్సిల్‌ చేసేది కూడా వీళ్లే. చివరికి గోవా ట్రిప్‌ ప్లాన్  చేసి... దగ్గర్లోని టీ బండి దగ్గరే గ్రూప్‌ ఫొటో తీసుకుని స్టేటస్‌ పెడతారు. నిజం చెప్పాలంటే... వీళ్లతో ట్రిప్‌ కంటే ట్రిప్‌ ప్లానింగ్‌లోనే ఎక్కువ ఎంజాయ్‌ చేస్తాం.

వైఫై పెరిగితే... వైబ్‌ తగ్గిందా? 
ఒకప్పుడు ఫ్రెండ్‌ను పిలవాలంటే ఇంటి ముందు నిలబడి ‘ఒరేయ్‌... బయటికి రా!’ అని అరిస్తే చాలు. లేదంటే ఓ విజిల్‌ వేస్తే ఐదు నిమిషాల్లో గుమ్మం దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు. ఇప్పుడు మాత్రం పరిస్థితి రివర్స్‌! మూడు కాల్స్‌... ఆరు వాట్సాప్‌ మెసేజ్‌లు... రెండు ఇన్ స్టాగ్రామ్‌ రీల్స్‌ షేర్‌ చేసిన తర్వాత కూడా మూడు గంటలకు  ‘ఏమైంది రా?’ అనే ఒక రిప్లై పడుతుంది. అయితే, సోషల్‌ మీడియాను పూర్తిగా తప్పుపట్టలేం.

ఏళ్లుగా కనిపించని స్కూల్‌ ఫ్రెండ్‌ను మళ్లీ కలిపింది కూడా అదే. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్నేహితుడిని ఒక్క వీడియో కాల్‌తో పక్కనే కూర్చున్నట్టు మాట్లాడే అవకాశం ఇచ్చింది. పుట్టినరోజులు గుర్తు చేస్తోంది... ఒక మీమ్‌తో నవ్వులు పంచుతోంది... ఒక స్టేటస్‌తో పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేస్తోంది. అందుకే టెక్నాలజీ స్నేహాన్ని మార్చలేదు, స్నేహం చేసే విధానాన్ని మాత్రమే అప్‌డేట్‌ చేసింది! ఒకప్పుడు ‘రా... గ్రౌండ్‌కి!’ అనే ఆహ్వానం... ఇప్పుడు ‘రా... వీడియో కాల్‌లోకి!’ అనేదిగా మారింది. కానీ నిజమైన స్నేహం ఇప్పటికీ వైఫై కంటే స్ట్రాంగ్‌ కనెక్షనే!

ప్రపంచాన్ని కదిలించిన నిజమైన ఫ్రెండ్‌షిప్‌ కథలు
ఫ్రెండ్‌ కోసం మనం ట్రీట్‌ ఇస్తాం... బిల్‌ కడతాం... అవసరమైతే అసైన్ మెంట్‌ కూడా రాసిపెడతాం! కానీ ప్రపంచంలో కొంతమంది స్నేహితులు మాత్రం తమ స్నేహం కోసం ప్రాణాలనే పణంగా పెట్టారు. ఇవి సినిమా కథలు కాదు... నిజంగా జరిగిన సంఘటనలు.

భుజాలపై మోసింది... స్నేహాన్నే!
చైనాకు చెందిన చిన్నారి ‘టాంగ్‌ యుయాన్ ’ తన కండరాల వ్యాధితో వీల్‌చైర్‌కే పరిమితమైన సహ విద్యార్థి ‘హి షియాంగ్‌హాంగ్‌’కు మూడేళ్ల పాటు ప్రతిరోజూ తోడుగా నిలిచాడు. మెట్లు ఎక్కించడం నుంచి భోజనం చేయించడం వరకు ప్రతి పనిలో భుజం అందించాడు. అతను నిరూపించిన విషయం ఒక్కటే... స్నేహానికి బలం చేతుల్లో కాదు, మనసులో ఉంటుంది.

ఎవరెస్ట్‌ కంటే... ప్రాణమే ఎత్తు!
2023లో ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకునే సమయంలో నేపాల్‌కు చెందిన షెర్పా ‘గెల్జే’ మంచులో అపస్మారక స్థితిలో ఉన్న పర్వతారోహకుడిని చూసి తన కలను పక్కన పెట్టాడు. శిఖరాన్ని వదిలేసి అతడిని భుజాన మోసుకుంటూ సురక్షితంగా కిందికి తీసుకొచ్చాడు. రికార్డుల కంటే ప్రాణం విలువైనదని ప్రపంచానికి చాటి చెప్పాడు.

ఒక కిడ్నీ... రెండు జీవితాలు!
అమెరికాకు చెందిన ‘జేజే’ తన ప్రాణ స్నేహితుడు ‘జే’కు కిడ్నీ దానం చేసి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ ఒకరి పెళ్లిలో మరొకరు బెస్ట్‌మెన్ గా నిలిచారు. కొంతమంది స్నేహితులు గిఫ్ట్‌లు ఇస్తారు... ఇంకొందరు జీవితాన్నే గిఫ్ట్‌గా ఇస్తారు.

యాభై ఏళ్ల తర్వాత... అదే స్నేహం!
అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మ చివరి కోరిక నెరవేర్చేందుకు మనవడు ‘అనీష్‌ భగత్‌’ ఆమె యాభై ఏళ్లుగా దూరమైన చిన్ననాటి స్నేహితురాలిని సోషల్‌ మీడియా సాయంతో వెతికి మళ్లీ కలిపాడు. ఒక కౌగిలితో యాభై ఏళ్ల దూరం కరిగిపోయింది. స్నేహానికి క్యాలెండర్‌ ఉండొచ్చు... ఎక్స్‌పైరీ డేట్‌ మాత్రం ఉండదు.

ఎనభై ఏళ్ల స్నేహం!
ఇంగ్లాండ్‌కు చెందిన కెన్ , ఆర్థర్‌లు వారి చిన్నప్పటి నుంచి మొదలైన స్నేహాన్ని ఎనభై ఏళ్ల తర్వాత కూడా అలాగే కొనసాగించారు. జీవిత భాగస్వాములను కోల్పోయిన తర్వాత ఒకే కేర్‌ హోమ్‌లో ఉంటూ ప్రతిరోజూ కలిసి సమయం గడిపారు. కొన్ని స్నేహాలు వయసుతో ముసలివి కావు... జ్ఞాపకాలతో మరింత అందంగా మారుతాయని నిరూపించారు.

స్నేహం వెనుక దాగిన సైంటిఫిక్‌ నిజాలు!
స్నేహితులు ఉంటే నవ్వులు మాత్రమే కాదు... ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచి స్నేహితులు ఉన్నవారిలో ఒత్తిడి, ఒంటరితనం తక్కువగా ఉండటమే కాదు; ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలా మంచి స్నేహితుడు కూడా ఒక హెల్త్‌ ఇన్సూరెన్ ్సలాంటివాడే! అయితే, అబ్బాయిలు– అమ్మాయిలు స్నేహాన్ని వ్యక్తపరచే తీరు మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది.

అబ్బాయిలు...
మాటల కంటే చేతలతోనే స్నేహాన్ని చూపిస్తారు. 
⇒ సమస్య వస్తే ముందుగా పరిష్కారం వెతుకుతారు.
⇒ ఆటపట్టించడం, అల్లరి చేయడాన్నే అనుబంధంగా భావిస్తారు.
⇒ ‘నేనున్నా!’ అని చెప్పడం కంటే... అవసరమైనప్పుడు పక్కన నిలబడటానికే ప్రాధాన్యం ఇస్తారు.

అమ్మాయిలు
⇒ సంభాషణలతో స్నేహాన్ని మరింత బలపరుస్తారు. సంతోషం, బాధ... రెండింటినీ ముందుగా స్నేహితులతో పంచుకుంటారు.
⇒ చిన్న జ్ఞాపకాలు, ప్రత్యేక రోజులను ఎక్కువకాలం గుర్తుంచుకుంటారు.
⇒ ‘తిన్నావా?’, ‘ఇంటికి చేరావా?’ వంటి చిన్న శ్రద్ధలతోనే ప్రేమను వ్యక్తం చేస్తారు.
చివరగా... స్నేహం అమ్మాయిదైనా... అబ్బాయిదైనా... తీరు మాత్రమే వేరు. స్నేహం మాత్రం ఒకటే. మీరు నవ్వినా... పడిపోయినా... నవ్వుతూ చేయి అందించేవాడే అసలైన స్నేహితుడు!

జీవితంలో జీతం పెరుగుతుంది... ఇల్లు పెద్దదవుతుంది... కారు మారుతుంది... కానీ... చిన్నప్పటి స్నేహితుడు మాత్రం రీప్లేస్‌ అవడు. ఎందుకంటే... స్నేహితులు అంటేనే కాలం కూడా అంతం చేయలేని ఆనందాలు. 

∙కొండి దీపిక 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement