వీరి వీరి గుమ్మడిపండు... రిలీజ్‌ ఎప్పుడు? | Upcoming telugu movies release dates postponed in tollywood | Sakshi
Sakshi News home page

వీరి వీరి గుమ్మడిపండు... రిలీజ్‌ ఎప్పుడు?

Aug 2 2026 12:42 AM | Updated on Aug 2 2026 12:42 AM

Upcoming telugu movies release dates postponed in tollywood

టాలీవుడ్‌లో వాయిదాల పర్వం

టాలీవుడ్‌లో రిలీజ్‌ డేట్‌లు తారుమారు అవుతున్న తీరు కొత్తేం కాదు. కానీ ఇటీవలి కాలంలో చాలా సినిమాల రిలీజ్‌లు వాయిదాలు పడుతున్నాయి. ‘పెద్ది, లెనిన్, మా ఇంటి బంగారం’... ఇలా పలు చిత్రాలు తమ తొలి రిలీజ్‌ డేట్‌ను మార్చుకుని, ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలే. ఈ కోవలో మరికొన్ని సినిమాల రిలీజ్‌ డేట్స్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సినిమా రిలీజ్‌ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. కొన్ని సినిమాల రిలీజ్‌లకు ఓటీటీ డీల్స్‌ అడ్డంకిగా మారితే, మరికొన్ని సినిమాలు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌కి ఎక్కువ టైమ్‌ తీసుకోవడం వల్ల వాయిదా పడుతున్నాయి. మరి... ఏ సినిమాల రిలీజ్‌లు గ్రాఫిక్స్‌ వల్ల ఆలస్యం అవుతున్నాయి? ఏ సినిమాల రిలీజ్‌ డేట్‌లు ఇంకా కన్ఫార్మ్‌ కావాల్సి ఉంది? అన్న విషయాలపై ఓ లుక్‌ వేయండి.

సత్య లోకానికి దారేది?
చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ యాక్షన్‌ డ్రామా ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథన్‌ హీరోయిన్స్‌గా నటించగా, కునాల్‌ కపూర్‌ విలన్‌ రోల్‌లో చేశారని తెలిసింది. బాలీవుడ్‌ కథనాయిక మౌని రాయ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా గత ఏడాది సంక్రాంతి సందర్భంగానే రిలీజ్‌ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ ఏడాది వేసవికి ‘విశ్వంభర’ సినిమా విడుదలవుతుందని ఓ సందర్భంలో యూనిట్‌ పేర్కొంది. కానీ ఇది సాధ్యం కాలేదు. దీంతో ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది.

‘విశ్వంభర’ సినిమా టీజర్‌ విడుదలైనప్పుడు ఈ సినిమా గురించిన విజువల్స్, గ్రాఫిక్స్‌ వర్క్స్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో మళ్లీ ఈ తరహా విమర్శలు పునరావృతం కాకూడదని చిత్రయూనిట్‌ పోస్ట్‌ ప్రోడక్షన్, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ను చాలా జాగ్రత్తగా చేస్తోందట. ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అన్నీ ప్లాన్‌ చేసినట్లుగా సాగితే ఈ సినిమాను అక్టోబరు 16న రిలీజ్‌ చేయాలన్నది టీమ్‌ ప్రస్తుత ప్లాన్‌ అని తెలిసింది.

ఇక ఈ చిత్రంలో దొరబాబు అనే  పాత్రలో చిరంజీవి, అవని అనే  పాత్రలో త్రిష నటించారని తెలిసింది. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ ఈ సినిమాను నిర్మించారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఇక పద్నాలుగు లోకాలు దాటి సత్య లోకానికి వెళ్లి అక్కడ్నుంచి హీరోయిన్‌ను హీరో ఎలా తిరిగి తీసుకు వస్తాడనే అంశం ఆధారంగా ‘విశ్వంభర’ కథనం సాగుతుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ ప్రయాణంలో విశ్వంభర అనే పుస్తకం కథలో కీలకంగా ఉంటుందని తెలిసింది.

డిసెంబరులో ఫౌజి 
దసరాకు విడుదల కావాల్సిన ‘ఫౌజి’ సినిమా డిసెంబరులో రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ అండ్‌ లవ్‌స్టోరీ సినిమా ‘ఫౌజి’. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘సీతారామం’ ఫేమ్‌ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఇమాన్వీ ఇస్మాయిల్‌ ఈ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతుండగా మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్, జయప్రద, భానుచందర్‌ ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారు. టీ సిరీస్, గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ల సమర్పణలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సైనికుడి  పాత్రలో ప్రభాస్‌ కనిపిస్తారని తెలిసింది. ప్రధాన కథాంశం రజాకార్ల నేపథ్యంలో సాగుతుందని సమాచారం. స్వాతంత్య్ర సమర యోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ కార్యకలా పాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ దేశభక్తి చిత్రంలో హను రాఘవపూడి ప్రస్తావించనున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే హీరో ప్రభాస్‌ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని సమాచారం. ఇక ‘ఫౌజి’ సినిమాను తొలుత ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

కానీ ఈ సినిమా షూటింగ్‌ పనులు ఇంకా పూర్తి కాక పోవడం,పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌పై టీమ్‌ మరింత ఫోకస్‌ పెట్టాలనుకోవడం వంటి కారణాల చేత  ఈ సినిమా రిలీజ్‌ దసరాకు సాధ్యపడలేదట. ఇటీవల ‘ఫౌజి’ చిత్రాన్ని 2026 డిసెంబరు 3న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలా దసరాకు విడుదల కావాల్సిన ‘ఫౌజి’ సినిమా డిసెంబరులో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం లేక పోలేదనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తుండటం మరో విశేషం. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

రాకా రాక ఎప్పుడు? 
‘పుష్ప: ది రైజ్‌’, ‘పుష్ప: ది రూల్‌’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తుండగా, జాన్వీ కపూర్, రష్మిక మందన్నా, మృణాల్‌ ఠాకూర్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముంబైలోని ప్రముఖ స్టూడియోస్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.

మేకర్స్‌ అయితే షూటింగ్‌ను ఈ ఏడాదే ముగించే పనిలో ఉన్నారని తెలిసింది. కానీ ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే అట్లీ సృష్టించారని, దీంతో వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుందనే టాక్‌ తెరపైకి వచ్చింది. అందుకే ‘రాకా’ సినిమా చిత్రీకరణ ఈ ఏడాదే ముగిసినా రిలీజ్‌ మాత్రం వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు... ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్‌ కానుందన్న ప్రచారం కూడా వినిపిస్తోంది. ఈ సినిమాకు సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తున్నారు. 

జడల్‌ జమానా 
‘దసరా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో రానున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ది ప్యారడైజ్‌’. ఈ సినిమా ప్రధాన కథాంశం 1980 కాలం నాటి సికింద్రాబాద్‌ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో సికింద్రాబాద్‌ కుర్రాడు జడల్‌  పాత్రలో నాని, సుబ్బుగా కయాదు లోహర్, శిఖంజా మాలిక్‌గా మోహన్‌బాబు, విక్రమ్‌ మాలిక్‌గా రాఘవ్‌ జుయల్‌ (బాలీవుడ్‌ ‘కిల్‌’ సినిమా ఫేమ్‌..), బిర్యానిగా సంపూర్ణేష్‌ బాబు నటిస్తున్నారు. బాబుమోహన్, ఈశ్వరీరావు, తనికెళ్ల భరణి ఇతర కీలక  పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ప్రముఖ కథనాయిక కీర్తీ సురేష్‌  పాల్గొంటుండగా, ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ను యూనిట్‌ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ‘ది ప్యారడైజ్‌’ సినిమాను తొలుత ఈ ఏడాది మార్చి 26నే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ క్వాలిటీ, కంటెంట్‌ విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదని నాని, శ్రీకాంత్‌ డిసైడ్‌ కావడంతో ఈ సినిమా రిలీజ్‌ను ఆగస్టు 21కి వాయిదా వేశారు.

ఈ నెల 21న కూడా విడుదల కావడం లేదని, కాంప్రమైజ్‌ లేకుండాపోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ పూర్తి చేసేందుకు యూనిట్‌కు మరికొంత సమయం కావాల్సి వచి్చందని, దీంతో ఈ సినిమాను సెప్టెంబరు 25న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఈ నెల 6న ‘ది ప్యారడైజ్‌’ సినిమా టీజర్‌ విడుదల కానుంది. ఈ టీజర్‌లో ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.          ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

నిధి అన్వేషణ 
‘తండేల్‌’ వంటి సూపర్‌ హిట్‌ సినిమా తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘వృషకర్మ’. ‘విరూ పాక్ష’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత దర్శకుడు కార్తీక్‌ వర్మ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మిథికల్‌ థ్రిల్లర్‌ సినిమాలో అర్జున్‌  పాత్రలో నాగచైతన్య, ఆర్కియాలజిస్ట్‌ దక్షగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. స్పర్శ్‌ శ్రీవాస్తవ, జయరామ్, సత్య ఇతర కీలక  పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాను తొలుత ఈ ఏడాది వేసవిలో రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ ఈ వేసవిలో ఈ చిత్రం విడుదల కాలేదు.

అయితే ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. ఈ సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్‌ పూర్తి కావొచ్చింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమా ప్రధాన కథాంశం ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో సాగుతుందని, కొన్ని మైథాలజీ, హారర్‌ ఎలిమెంట్స్‌ కూడా ఈ చిత్రంలో ఉన్నాయని తెలిసింది. బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ .బి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇషాన్‌ సక్సేనా సహ–నిర్మాతగా వ్యవహరిస్తుండగా ‘కాంతార’ ఫేమ్‌ అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందిస్తున్నారు.

రణబాలి 
‘గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి కలిసి జంటగా నటిస్తున్న సినిమా ‘రణబాలి’. విజయ్‌ దేవరకొండకు ‘టాక్సీవాలా’ వంటి హిట్‌ సినిమాను అందించిన రాహుల్‌ సాంకృత్యాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854–1878 మధ్య కాలంలో జరిగిన చారిత్రక వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రణబాలిగా విజయ్‌ దేవరకొండ నటిస్తుండగా, జయమ్మ  పాత్రలో రష్మిక మందన్నా నటిస్తున్నారు.

హాలీవుడ్‌ నటుడు ‘ది మమ్మీ’ ఫేమ్‌ ఆర్నాల్డ్‌ వోస్లూ ఈ మూవీలో విలన్‌ సార్‌ థియోడర్‌ హెక్టార్‌ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే వంద రోజులకు పైగా చిత్రీకరణ జరుపుకుంది. షూటింగ్‌ 90 శాతం పూర్తయింది. కాగా, ఈ సినిమాను ఈ ఏడాది సెపె్టంబరు 11న రిలీజ్‌ చేయనున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రకటించారు. కానీ సెప్టెంబరు 11న ‘రణబాలి’ సినిమా విడుదల కాక పోవచ్చని తెలిసింది. తాజాగా హీరోయిన్‌ రష్మికమందన్నా గాయపడ్డారు. ఆమెకు ఆరు వారాలు వైద్యులు విశ్రాంతి సూచించారు. ఈ ప్రభావం కూడా ‘రణబాలి’ చిత్రంపై పడుతుందని తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది దీ పావళి సందర్భంగా నవంబరు 6న ‘రణబాలి’ సినిమాను విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట మేకర్స్‌.

అయితే ఈ కొత్త విడుదల తేదీపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. టీ సిరీస్‌ ఫిల్మ్, గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు అజయ్‌–అతుల్‌ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే... విజయ్‌ దేవరకొండ హీరోగా రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’ అనే ఓ పీరియాడికల్‌ సినిమా తెరకెక్కుతోంది. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేకర్స్‌ డిసెంబరులో రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించారు. మరి... దీ పావళికి ‘రణబాలి’ విడుదలై, ఆ  వెంటనే డిసెంబరులో ‘రౌడీ జనార్ధన’ సినిమా కూడా విడుదలైతే విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఇంతకు మించిన గుడ్‌ న్యూస్‌ ఏముంటుంది? మరి.. ఇలానే జరుగుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.  

సెంగోల్‌ రక్షణ 
నిఖిల్‌ హీరోగా నటించిన పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘స్వయంభూ’. ఈ చిత్రంలో సంయుక్త, నభా నటేష్‌ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఫైనల్‌గా ఈ ఏడాది ఫిబ్రవరి 13న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఓ విడుదల తేదీని ప్రకటించారు. కానీ, ఈ సినిమా ఆ తేదీకి కూడా రిలీజ్‌ కాలేదు. వేసవిలో రిలీజ్‌ అనే ప్రచారం జరిగినప్పటికీ అదీ జరగలేదు. అంతేకాదు... ఈ చిత్రం రిలీజ్‌పై ఇప్పటికీ సరైన స్పష్టత రాలేదు. మేకర్స్‌ అయితే ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

కానీ భారీ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్,పోస్ట్‌ ప్రోడక్షన్స్‌ పూర్తి స్థాయిలో కంప్లీట్‌ అయిన తర్వాతే విడుదల తేదీని ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సినిమాలో ఓ వారియర్‌  పాత్రలో నిఖిల్‌ కనిపిస్తారు. సెంగోల్‌ అనే ఓ రాజచిహ్నం రక్షణ అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం అని సమాచారం. ఈ సినిమాలో హీరో  పాత్రకు తోడుగా ఓ గుర్రం ఉంటుందని తెలిసింది.

భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్, శ్రీకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో సునీల్‌ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశారని, సుబ్బరాజు మరో కీలక  పాత్రపోషించారని తెలిసింది. ఇంకా ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందనే ప్రచారం కూడా ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రవి బస్రూర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

డిసెంబరులో ఏటిగట్టు సంబరాలు 
సాయిదుర్గా తేజ్‌ హీరోగా నటిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘సంబరాల ఏటిగట్టు’. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు రోహిత్‌ కె.పి దర్శకత్వం వహిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి, జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర ప్రధాన  పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఓ మెయిన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను గత ఏడాదే రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. కానీ వీలుపడలేదు. తాజాగా ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్‌ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించారు. కానీ రిలీజ్‌ డేట్‌పై స్పష్టత రాలేదు. బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇలా రిలీజ్‌ డేట్‌లు ప్రకటించి, ఇంకా విడుదల మార్చుకున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అలాగే షూటింగ్‌ స్టార్ట్‌ చేసి ఏడాది పైనా అవుతున్నా రిలీజ్‌ డేట్‌లు ఇంకా ఖరారు చేసుకోని సినిమాలు మరికొన్ని ఉన్నాయి.

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement