రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్ | UK Seizes Russian Oil Tanker In English Channel, Arrests Indian National In Major Sanctions Crackdown | Sakshi
Sakshi News home page

రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్

Jun 17 2026 9:31 AM | Updated on Jun 17 2026 11:40 AM

UK Seizes Russian Shadow Fleet Tanker in Historic Operation Indian National Arrested

లండన్‌: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అంతర్జాతీయంగా  సంచలనం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆంక్షలను ఉల్లంఘించి రష్యా ముడి చమురును రవాణా చేస్తోందనే అనుమానంతో, బ్రిటన్ సైనిక బలగాలు ఇంగ్లీష్ ఛానల్‌లో ఒక రష్యన్ చమురు ట్యాంకర్‌ను  స్వాధీనం చేసుకున్నాయి. బ్రిటన్ చరిత్రలోనే రష్యాకు చెందిన ‘షాడో ఫ్లీట్’ (రహస్య నౌకాదళం) నెట్‌వర్క్‌పై జరిగిన మొట్టమొదటి భారీ దాడి ఇది. ఈ ఆపరేషన్ అనంతరం బ్రిటన్ జాతీయ నేర విభాగం (ఎన్‌సీఏ) అధికారులు ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై ఒక భారతీయ పౌరుడిని అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

మిడ్నైట్ రైడ్.. బ్రిటన్ ప్రధాని హెచ్చరిక
ఆదివారం (జూన్ 15) రాత్రి ఇంగ్లీష్ ఛానల్‌ గుండా వెళ్తున్న ‘స్మిర్టోస్’ అనే ట్యాంకర్‌ను బ్రిటీష్ దళాలు చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించడానికి రష్యాకు అందుతున్న నిధుల వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ స్పందిస్తూ.. ఇది రష్యాకు గట్టి ఎదురుదెబ్బ అని అభివర్ణించారు. పుతిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ లాభపడుతున్న వారు ఎవరూ ఇకపై తప్పించుకోలేరని, వారిని దాక్కోనివ్వబోమని సోషల్ మీడియా వేదికగా ఆయన హెచ్చరించారు.

7 లక్షల బ్యారెళ్ల చమురు.. దొరికిన కీలక ఆధారాలు
మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, హాంగ్ కాంగ్ ఆధారిత ‘జావో యావో షిప్పింగ్ లిమిటెడ్’ సంస్థకు చెందిన ఈ ట్యాంకర్, కామెరూన్ జెండాతో ప్రయాణిస్తోంది. జూన్ 5న రష్యాలోని ఉస్త్-లుగా పోర్ట్ నుండి బయలుదేరిన ఈ నౌకలో దాదాపు 7 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నౌకను డోర్సెట్ తీరంలో నిలిపి ఉంచారు. ఇందులో ఉన్న 24 మంది జార్జియా, భారతీయ సిబ్బంది ప్రస్తుతం నౌకలోనే ఉన్నట్లు ఎన్‌సీఏ తెలిపింది. బ్రిటన్ తీసుకున్న ఈ సాహసోపేత చర్యను ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్స్కీ అభినందించగా, రష్యా మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.

షాడో ఫ్లీట్ అంటే ఏమిటి? 
అంతర్జాతీయ ఆంక్షల నుండి తప్పించుకుని రష్యా చమురును ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి వాడుతున్న వందలాది రహస్య నౌకల నెట్‌వర్క్‌ను ‘షాడో ఫ్లీట్’ అని పిలుస్తారు. యుద్ధ నిధుల కోసం రష్యా ప్రధానంగా ఈ చమురు విక్రయాలపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ సహా పాశ్చాత్య దేశాలు ఈ నౌకలపై నిషేధం విధించాయి. ప్రస్తుత ట్యాంకర్ సీజ్ వల్ల రష్యా చమురు ఎగుమతులు పూర్తిగా ఆగిపోకపోయినప్పటికీ, రష్యాకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని, అలాగే పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి నౌకలు సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నాలుగు ఏఐ మోడల్స్ ఫెయిల్.. 10/10 స్కోర్‌ చేసిన మానవ మేథ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement