సాక్షి, చైన్నె: తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రజల తీర్పును గౌరవించి డీఎంకే ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలే గానీ, కూటమి పార్టీలపై నిందలు వేస్తూ విమర్శలు కొనసాగిస్తే ఆ పార్టీ ఇక ఎన్నటికీ తమిళానాడులో అధికారంలోకి రాలేదని కాంగ్రెస్ మంత్రులు రాజేష్ కుమార్, విశ్వనాథన్‌లు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సంయుక్తంగా డీఎంకేకు హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు. దీంతో తమిళనాట కాంగ్రెస్ వర్సెస్ డీఎంకే అనే విధంగా పొలిటికల్ హీట్ పెరిగింది.
విజయ్ నాయకత్వానికే ప్రజల మొగ్గు
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పెట్టిన 27 నెలల్లోనే 108 స్థానాలు గెలుచుకుని తమిళగ వెట్రి కళగం(టీవీకే) చరిత్ర సృష్టించిందని మంత్రులు పేర్కొన్నారు. జోసెఫ్ విజయ్ సీఎం కావాలన్నదే తమిళనాడు ప్రజల తీర్పు అని వారు స్పష్టం చేశారు. టీవీకేకు మెజారిటీకి 10 సీట్లు తక్కువైనప్పటికీ, అన్నాడీఎంకే మద్దతుతో సులభంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా, లౌకిక విలువల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వంటి పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారని కొనియాడారు. అధికారంలో వాటా.. ఇదే నిజమైన కూటమి ధర్మం అని వ్యాఖ్యలు చేశారు. కేవలం 5 సీట్లున్న కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు విజయ్ ఇచ్చారని, అలాగే వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో గతంలో డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి గొప్ప మనసు చాటుకోలేదని విమర్శించారు.
బీజేపీ కుట్రను అడ్డుకున్నాం..
ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా బీజేపీ పన్నిన కుట్రకు డీఎంకే కూడా సహకరించిందని, అయితే లౌకిక శక్తులు బలంగా నిలబడటం వల్ల ఆ ప్రయత్నం విఫలమైందన్నారు. అయితే, డీఎంకే అధికారిక పత్రిక ’మురసోలి’లో కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీని కించపరుస్తూ రాస్తున్న వ్యాసాలపై మండిపడ్డారు. తమకు కూడా తిట్టడం తెలుసనని, అయితే, తమ నాయకులు తమకు రాజకీయం నేర్పారన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, ఒకవేళ తాము హద్దులు దాటితే డీఎంకే తట్టుకోలేదని హెచ్చరించారు. మైనారిటీలు, దళితులు డీఎంకేకు ఎందుకు ఓటు వేయలేదో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. అది వదిలేసి మిత్రపక్షాలపై పడి ఏడిస్తే, వచ్చే ఎన్నికల్లో తమరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, ప్రజలు ఇచ్చే శిక్ష నుండి తప్పించుకోలేరని పేర్కొన్నారు.
పుదుచ్చేరిలోనూ పొత్తే..
ఇదిలా ఉండగా.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమిళగ వెట్రి కళగంతోనే కాంగ్రెస్ పొత్తు అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ వైద్యలింగం స్పష్టం చేశారు. తట్టాంచావడి ఉప ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తే, కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైద్యలింగం విలేకరులతో మాట్లాడుతూ.. పుదుచ్చేరి సీఎం రంగస్వామి నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గం, శాసనసభ అవసరం లేదంటూ ఆయన ఒక్కరే పరిపాలనను నడుపుకుంటారా..? అని ప్రశ్నించారు. పుదుచ్చేరిలో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు అని ప్రకటించిన ఆయన తట్టాంచావడి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.
ఉప ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీకి అవకాశం లేదున్నారు. విజయ్ పార్టీ అయిన టీవీకేను డీఎంకే తక్కువ అంచనా వేయడమే ఓటమికి కారణంగా పేర్కొన్నారు. తాము స్నేహపూర్వకంగా పోటీ చేసిన స్థానాల్లో డీఎంకే విజయం సాధించిందని పేర్కొంటూ, తట్టాంచావడి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో కూటమికి డీఎంకే నాయకత్వం వహించింది, ఈ దృష్ట్యా, ఓటమికి కూడా డీఎంకేనే బాధ్యత వహించాలని హితవు పలికారు. కూటమిలోని పార్టీలతో డీఎంకే ఏకపక్షంగా చర్చలు జరిపిందని మండి పడ్డారు. తట్టాంచావడిలో టీవీకే పోటీ చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఇది సీఎం నియోజకవర్గం అని ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేశారని, అయితే, ఉప ఎన్నికలలొఓ ఆ పరిస్థితి ఉండదన్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని , ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌మద్దతు కీలకంగా మారిందన్నారు.


