సాగులో లక్ష్మీకటాక్షం
పద్మనాభం: రసాయన ఎరువుల వాడకం పెరిగిపోతున్న ఈ రోజుల్లో, పద్మనాభం మండలం కోరాడ గ్రామానికి చెందిన మజ్జి లక్ష్మి అనే మహిళా రైతు ప్రకృతి సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె, తనకున్న అరెకరంతో పాటు మరో అరెకరం కౌలుకు తీసుకుని మొత్తం ఎకరం విస్తీర్ణంలో 2015 నుంచి పూర్తిస్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఏటీఎం పద్ధతితో నిరంతర ఆదాయం లక్ష్మి ‘ఎనీ టైం మనీ’ సాగు పద్ధతిని పాటిస్తున్నారు. 20 సెంట్ల విస్తీర్ణంలో సుమారు 20 రకాల కూరగాయలను పండిస్తున్నారు. ఇందులో ముల్లంగి వంటి దుంప జాతులు, బీర, ఆనప వంటి తీగ జాతులు, తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలతో పాటు మిరప, టమాటాలను సాగు చేస్తున్నారు. మరో మూడు ‘ఏ’ గ్రేడ్ మోడల్స్‌లో అరటి, బొప్పాయి, క్యాబేజీ వంటి ప్రధాన పంటలతో పాటు 20 రకాల అంతర పంటలను పండిస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతున్నారు.
రసాయనాలకు స్వస్తి
సాగులో రసాయనాలకు స్వస్తి పలికి ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగపిండితో తయారు చేసిన ఘన, ద్రవ జీవామృతాలను మాత్రమే ఆమె వాడుతున్నారు. ఈ పద్ధతి వల్ల ఖర్చులు తగ్గి, ఏడాదికి రూ. 2 లక్షల వరకు నికర ఆదాయం లభిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టులో పని చేస్తున్న ఆమె భర్త అప్పలనాయుడు ప్రోత్సాహం ఆమెకు తోడైంది. మొలకల నుంచే మార్కెటింగ్ ఆమె పండించిన పంటలకు విశేషమైన ఆదరణ ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఆర్గానిక్ మేళాలో కేవలం ఐదు రోజుల్లోనే రూ. 55 వేల విలువైన కూరగాయలు విక్రయించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వినియోగదారులు నేరుగా ఆమె పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎండాడ, విజయనగరంలోని కనపాకలో ఆమె క్రమం తప్పకుండా విక్రయాలు సాగిస్తున్నారు.
విజయాలు – అవార్డులు
ప్రకృతి వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఆమె తన ఇద్దరు కుమార్తెలను బీఎస్సీ చదివించి, వివాహాలు కూడా జరిపించారు. ఆమె కృషిని గుర్తిస్తూ 2019లో విశాఖలో డీఆర్‌డీఏ అవార్డు, 2025 సెప్టెంబర్‌లో గుంటూరులో ఏరువాక ఫౌండేషన్ వారు పురస్కారాలను అందజేశారు. నేటితరం రైతులకు మజ్జి లక్ష్మి ఆదర్శంగా నిలుస్తున్నారు.
సాగులో లక్ష్మీకటాక్షం


