గోల్డ్ ఫైనాన్స్ సంస్థ మోసం
తగరపువలస: ఇంటి అవసరాల కోసం మూడున్నరేళ్ల క్రితం ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్‌లో బంగారం కుదవపెట్టిన ఒక ఖాతాదారునికి సదరు సంస్థ చుక్కలు చూపిస్తున్న వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. జీవీఎంసీ భీమిలి జోన్ పరిధిలోని సంగివలసకు చెందిన కె.ఎం.ఎం. రెడ్డి, తన బంధువు విజయ్ వద్ద నుంచి తీసుకున్న 149 గ్రాముల బంగారు చైన్‌ను 2022 జూన్‌లో ఐఐఎఫ్‌ఎల్‌లో కుదవపెట్టి రూ. 5 లక్షల రుణం తీసుకున్నారు. అయితే సదరు సంస్థలో పనిచేసే సిబ్బంది సుమారు 20 మంది ఖాతాదారుల బంగారాన్ని తస్కరించి, మరో ప్రైవేట్ బ్యాంకులో రీ–ప్లెడ్జ్ చేసిన ఉదంతం గతేడాది బయటపడింది. ఆ సమయంలో ఆందోళన చేసిన పలువురు ఖాతాదారులకు ఆభరణాలు రికవరీ చేసినప్పటికీ, రెడ్డికి సంబంధించిన చైన్ మాత్రం దొరకలేదు. వారసత్వంగా వచ్చిన ఆ ఆభరణం కోసం బాధితుడు గత ఏడాది కాలంగా సంస్థ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. నెల రోజుల క్రితం బాధితులు సంస్థను నిలదీయగా, పోగొట్టుకున్న ఆభరణానికి సమానమైన బంగారు బిస్కెట్ ఇస్తామని సిబ్బంది నమ్మబలికారు. తీరా శుక్రవారం గడువు ముగిసిన తర్వాత కార్యాలయానికి వెళ్లిన బాధితులకు సంస్థ సిబ్బంది పొంతన లేని సమాధానం ఇచ్చి నిర్ఘాంతపరిచారు. ప్రస్తుతం ఉన్న బంగారం ధరకు కాకుండా, మూడున్నరేళ్ల క్రితం కుదవపెట్టిన నాటి ధర ప్రకారమే నగదు చెల్లిస్తామని చెప్పడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటితో పోలిస్తే బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగిందని, తమకు సొమ్ము కాదు ఆభరణం..లేదా అంతే విలువైన బంగారం ఇవ్వాలని వారు భీష్మించుక కూర్చున్నారు. విషయం తెలుసుకున్న భీమిలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా, సంస్థ ప్రతినిధులు బాధితులతో మాట్లాడి పంపించి వేశారు. సాధారణంగా ఏడాదిలోపు నగలు విడిపించుకోకపోతే వేలం వేసే సంస్థలు, తమ నగలు పోగొట్టి మూడేళ్లుగా వేధింపులకు గురిచేయడంపై బాధితులు వాపోతున్నారు. తక్షణమే తమ ఆభరణం రికవరీ చేయకపోతే సంస్థ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.
149 గ్రాముల బంగారు చైన్ మాయం
గోల్డ్ ఫైనాన్స్ సంస్థ మోసం


