కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాద
బీచ్‌రోడ్డు: గత నెలలో కేజీహెచ్‌లో ప్రసవం కోసం చేరిన తనకు వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించి, వేధించిన ఇద్దరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను బాధితురాలు పట్నాల ఉమాదేవి కోరారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయనను శుక్రవారం కలిసిన ఆమె, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. గోపాలపట్నానికి చెందిన ఉమాదేవి తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. ప్రసవం కోసం కేజీహెచ్‌కు వెళ్లిన సమయంలో అక్కడి వైద్యులు, సిబ్బంది తనతో పాటు తన కుటుంబ సభ్యుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించారు. గర్భంతో ఉన్న సమయంలో ప్రతి నెల క్రమం తప్పకుండా స్కానింగ్‌లు, వైద్య పరీక్షలు చేయించుకున్నామని, అప్పటివరకు శిశువు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్యలు లేవని ఆమె పేర్కొన్నారు. అయితే ప్రసవం పూర్తయిన తర్వాత తన శిశువు మరణించినట్లు వైద్యులు చెప్పారని, ఇది ముమ్మాటికీ వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిప్యూటీ సీఎంను వేడుకున్నారు. బాధితురాలి ఆవేదనపై సానుకూలంగా స్పందించిన పవన్ కళ్యాణ్, ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


