పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలి
సీతంపేట: పెన్షనర్ల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిన ‘పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ – 2025’ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక చైర్మన్ ఎ. అజా శర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో ‘ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్’ ఆధ్వర్యంలో పెన్షనర్ల సమస్యలపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అజా శర్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో 8వ వేతన సంఘం చైర్మన్, సభ్యులను నియమించి, నివేదికకు 18 నెలల గడువు ఇచ్చిందని తెలిపారు. అయితే ఈ సంఘం ‘టెర్‌మ్స్ ఆఫ్ రిఫరెన్స్’లో నేషనల్ కౌన్సిల్ జేసీఎం ఇచ్చిన కీలక సూచనలను పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. ఉద్యోగుల వాటా లేని పెన్షన్ విధానం వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని నివేదికలో పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. కొత్తగా వచ్చిన పెన్షన్ వాలిడేషన్ చట్టం ద్వారా పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా పాత, కొత్త అని విభజించడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి. వరప్రసాద్ మాట్లాడుతూ.. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్‌ను 2017 నుంచి అమలు చేయాలని, అలాగే 8వ వేతన సంఘం టెర్‌మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో వీరి అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం న్యాయపోరాటంతో పాటు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సదస్సు హెచ్చరించింది. సమావేశంలో ఎన్. రామారావు, ఎన్. నాగేశ్వరరావు, ఎఫ్‌సీపీఏ చైర్మన్ కొణతాల రామాంజ నేయులు, కన్వీనర్ ఎం. చంద్రశేఖరరావు, కోశాధికారి పి. బాపూజీతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పెన్షన్ వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలి


