నూతన ఒప్పందాలతో సీ ఫుడ్ ఎగుమతులకు ప్రోత్సాహం
ఏయూ క్యాంపస్: అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)లతో భారత్ చేసుకున్న వాణిజ్య ఒప్పందాలు భారతీయ సముద్ర ఆహార(సీ ఫుడ్) ఎగుమతుల రంగంలో నూతన ఉత్తేజాన్ని నింపుతాయని సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఈఏఐ) అధ్యక్షుడు జి.పవన్‌కుమార్ అన్నారు. బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూరోపియన్ యూనియన్(ఈయూ)తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) విజయవంతంగా ముగియడం, అమెరికాతో జరిగిన తాజా వాణిజ్య అవగాహన వల్ల భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల దిగుమతి సుంకాల్లో భారీ తగ్గింపు లభిస్తుందన్నారు. 2024–25లో సుమారు 2.78 బిలియన్ డాలర్ల ఎగుమతులతో భారత్ సీఫుడ్స్‌కు అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగిన అమెరికా ఆగస్టు 2025 నుంచి విధించిన 50 శాతం టారిఫ్‌లతో ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. అమెరికాతో కుదిరిన తాజా ఒప్పందం వల్ల టారిఫ్‌లు 18 శాతానికి తగ్గాయన్నారు. ఈయూతో ఎఫ్‌టీఏ వల్ల ప్రపంచవ్యాప్త పోటీదారులతో సమానంగా భారతీయ ఎగుమతిదారులకు సమాన అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఆక్వాకల్చర్ మరియు సీఫుడ్ ఎగుమతులకు ఒక ప్రధాన కేంద్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. ఈ రంగం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మద్దతుగా నిలిచిన ప్రధాని మోదీ, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ఏపీ అధ్యక్షుడు ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ ఈ నిర్ణయాలు ఏపీలో ఆక్వా రైతులకు చాలా మేలు చేస్తాయన్నారు. ధరలు స్థిరంగా ఉంటూ, ఎగుమతులు పెరిగేందుకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి దిలీప్ తదితరులు పాల్గొని మాట్లాడారు.


