ఐఎఫ్‌ఆర్, మిలాన్‌కు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష(ఐఎఫ్‌ఆర్)–2026, మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ కార్యక్రమాల నిర్వహణకు అన్ని విభాగాలు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు నేవీ, పోలీస్, ఇతర విభాగాల అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో బుధవారం సమీక్ష జరిపారు. కోస్ట్ గార్డ్ డీఐజీ రాజేష్ మిట్టల్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు, ఆర్డీవోలు, ఇతర అధికారులతో కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులతోపాటు, 2 నుంచి 3 లక్షల వరకు ప్రజలు రానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతుల కల్పన, వైద్య సేవలు అత్యంత సమర్థవంతంగా ఉండాలని ఆదేశించారు.
17న రాష్ట్రపతి రాక
ఈ నెల 17న రాష్ట్రపతి రాకతో కార్యక్రమాలు మొదలవుతాయని, 18న నౌకాదళ ఫ్లీట్ రివ్యూ, 19న ఉదయం మిలాన్ ప్రారంభోత్సవం, సాయంత్రం ఆర్కే బీచ్ రోడ్డులో అంతర్జాతీయ సిటీ పరేడ్ ఉంటుందన్నారు. వెద్యం, అగ్నిమాపక, తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, పరిశుభ్రత చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. బస్సులను ఇటు జగదాంబ, అటు పార్క్ హోటల్ జంక్షన్ వరకు నడపాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీ కెమెరాలు, లైటింగ్ ఏర్పాటుచేయాలి: సీపీ
ప్రజా భద్రత దష్ట్యా సీసీ కెమెరాలు, నైట్ విజన్ పరికరాలు, కంట్రోల్ రూమ్ ద్వారా లైవ్ మానిటరింగ్‌కు చర్యలు తీసుకోవాల్సి ఉందని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. నో–డ్రోన్, నో కై ట్ జోన్ అమలు చేస్తామన్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో, ప్రముఖులు రాకపోకలు సాగించే ప్రధాన రహదారుల్లో లైటింగ్ సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో ఇండియన్ నేవీ అధికారులు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


