సముద్ర తీరాన సరికొత్త చరిత్ర | - | Sakshi
Sakshi News home page

సముద్ర తీరాన సరికొత్త చరిత్ర

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

విశాఖ పోర్టు సరికొత్త రికార్డ్‌

91.17 ఎంఎంటీ

సరుకు రవాణాతో ఘనత

గతం కంటే 10.35 శాతం

వృద్ధి నమోదు

విశాఖ సిటీ : విశాఖ పోర్టు అథారిటీ సరికొత్త రికార్డు లిఖించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణాలో చరిత్ర సృష్టించింది. 91.17 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఎంఎంటీ) సరుకును చేరవేసి, దేశంలోని ప్రధాన ఓడరేవుల్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. 2024–25లో 82.62 ఎంఎంటీ సరుకు రవాణా నమోదు కాగా.. ఈసారి ఏకంగా 10.35 శాతం వృద్ధిని సాధించడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా రవాణా రంగంలో సవాళ్లు ఎదురవుతున్నా.. విశాఖ పోర్టు తన పట్టును మరోసారి చాటుకుంది. ముఖ్యంగా చమురు, ఇనుప ఖనిజం, ఎరువుల రవాణాలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో 13 శాతం, ఇనుప ఖనిజంలో 15 శాతం వృద్ధిని సాధించింది. ఎరువుల దిగుమతులు ఏకంగా 42 శాతం పెరగడం ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణమైంది.

సమర్థతే విజయరహస్యం

ఈ ఘనత వెనుక పోర్టు యంత్రాంగం అనుసరించిన ఆధునిక పద్ధతులు ఉన్నాయి. నౌకలు ఓడరేవుకు వచ్చినప్పుడు అవి వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించారు. బెర్త్‌ల నిర్వహణలో వేగం పెరగడం వల్ల నౌకల కదలికలు సులభతరం అయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 24 నౌకల కదలికలను విజయవంతంగా నిర్వహించి పోర్టు తన ఆపరేషనల్‌ సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఒకే రోజులో 5,50,198 మెట్రిక్‌ టన్నుల సరుకును హ్యాండిల్‌ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. పోర్టులోని 32 బెర్త్‌లలో 28 బెర్త్‌లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం వల్ల ఆదాయం కూడా మెరుగుపడింది.

అత్యాధునిక మౌలిక వసతులు

విశాఖ పోర్టు కేవలం సముద్ర మార్గంలోనే కాకుండా, భూమార్గంలో కూడా పటిష్టమైన అనుసంధానాన్ని కలిగి ఉంది. 176 కిలోమీటర్ల మేర విస్తరించిన సొంత రైల్వే నెట్‌వర్క్‌, 40కి పైగా సైడింగ్‌లు సరుకును వేగంగా తరలించేందుకు దోహదపడుతున్నాయి. 2 లక్షల టన్నుల బరువున్న కేప్‌సైజ్‌ నౌకలు కూడా సులభంగా బెర్త్‌లకు వచ్చేలా 16 నుండి 21 మీటర్ల లోతును నిర్వహించడం విశాఖ పోర్టు ప్రత్యేకం. అడ్వాన్స్‌డ్‌ నావిగేషన్‌ వ్యవస్థలైన వీటీఎంఎస్‌, ఏఐఎస్‌ ద్వారా నౌకల భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మూలపేటపై వీపీఏ ఆసక్తి

మూలపేట పోర్టును నిర్వహించేందుకు విశాఖ పోర్ట్‌ అథారిటీ ఆసక్తిగా ఉంది. ముఖ్యంగా విశాఖ నగరంలో కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో, ధూళి వెలువడే బొగ్గు వంటి సరుకు రవాణాను భవిష్యత్తులో మూలపేట పోర్టుకు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి తోడు దుగ్గరాజపట్నం పోర్టు, షిప్‌బిల్డింగ్‌ యూనిట్‌ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ)ను ఏర్పాటు చేయడం ఒక కీలక పరిణామం. అత్యాధునిక ‘జెమినీ ఆపరేషన్స్‌’ ద్వారా భారీ యంత్రాలను సైతం సునాయాసంగా రవాణా చేసే వెసులుబాటు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఎస్పీఎం ద్వారా తొలిసారి క్రూడ్‌ ఆయిల్‌ లోడింగ్‌ చేపట్టడం పోర్ట్‌ సాంకేతిక ప్రగతికి అద్దం పడుతోంది.

100 ఎంఎంటీ భవిష్యత్‌ లక్ష్యం

పోర్టు చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు ఈ విజయాన్ని సిబ్బంది, స్టేక్‌హోల్డర్ల సమిష్టి కృషిగా అభివర్ణించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌ లక్ష్యం 100 ఎంఎంటీలను అధిగమించడమేనని స్పష్టం చేశారు. కేవలం పరిమాణం మాత్రమే కాకుండా, పర్యావరణ హితమైన రవాణాకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement