ఏయూలో దోపిడే | - | Sakshi
Sakshi News home page

ఏయూలో దోపిడే

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

డిపార్ట్‌మెంట్‌ డే పేరుతో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో వసూళ్ల పర్వం విద్యార్థికి రూ.1600 వరకు టారిఫ్‌ ఖరారు డబ్బులు కట్టకపోతే ’ఇంటర్నల్స్‌’లో ఫెయిల్‌ చేస్తామని బెదిరింపులు నెల కిందే ఎథ్నిక్‌ డే పేరిట రూ. 9.5 లక్షలు స్వాహా? పరిశోధక విద్యార్థుల నుంచి రూ. 10 వేల వరకు వసూలు

మా బిడ్డల భ విష్యత్‌ ?

విశాఖ సిటీ : ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం నిలువు దోపిడీకి నిలయంగా మారుతోంది. చదువుల తల్లి ఒడిలో క్రమశిక్షణ నేర్పాల్సిన గురువులే.. వసూళ్ల బాట పట్టారు. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం వేదికగా సాగుతున్న ఈ ‘వసూళ్ల పర్వం’ ఇప్పుడు యూనివర్సిటీ ప్రతిష్టను బజారున పడేస్తోంది. ‘డిపార్ట్‌మెంట్‌ డే’ పేరుతో విద్యార్థుల జేబులకు చిల్లు పెడుతున్న వైనం అటు అకాడమిక్‌ వర్గాల్లో, ఇటు తల్లిదండ్రుల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

‘డిపార్ట్‌మెంట్‌ డే’ పేరుతో వడ్డన!

ఈ నెల 4వ తేదీన డిపార్ట్‌మెంట్‌ డే నిర్వహించాలని ఏయూ సైన్స్‌ విభాగం ప్రొఫెసర్లు నిర్ణయించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.1600, రెండో సంవత్సరం విద్యార్థులకు రూ.1400, మూడో సంవత్సరం చదువుతున్న వారికి రూ.1300 చొప్పున టారిఫ్‌ ఖరారు చేసినట్లు సమాచారం. సుమారు 2800 మంది విద్యార్థులు ఉన్న ఈ విభాగంలో ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే రూ.20 లక్షలకు పైగా సేకరించినట్లు తెలుస్తోంది.

నెల రోజుల కిందే రూ.9.5 లక్షలు వసూలు

నిజానికి ఇలాంటి వసూళ్లు ఈ విభాగానికి కొత్తేమీ కాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితమే ‘ఎథ్నిక్‌ డే’ పేరుతో ప్రతి విద్యార్థి నుంచి రూ.1000 చొప్పున వసూలు చేశారు. అలా సేకరించిన సుమారు రూ.9.5 లక్షల మొత్తానికి ఇప్పటివరకు సరైన లెక్కలు చూపలేదని సమాచారం. విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం ఎలాంటి వసూళ్లు చేసినా అధికారిక రసీదులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అవేవీ లేకుండానే రూ.లక్షలు చేతులు మారుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

బెదిరింపులతో బలవంతపు వసూళ్లు

డబ్బులు చెల్లించలేమని మొరపెట్టుకుంటున్న పేద విద్యార్థులపై కొందరు అధ్యాపకులు కర్కశంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘డబ్బులు కట్టకపోతే ఇంటర్నల్‌ మార్కుల్లో ఫెయిల్‌ చేస్తాం’ అంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. గత ఐదు రోజులుగా క్లాసుల వద్ద నిలబడి, డబ్బులు కట్టని వారి జాబితాలు పట్టుకుని ఒత్తిడి తెస్తున్నారనే అంశం యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రొఫెసర్‌ స్థాయి వారు ఇలా వసూళ్లకు దిగడం ఇంజనీరింగ్‌ కళాశాల చరిత్రలో ఇదే తొలిసారి అని చర్చించుకుంటున్నారు.

తల్లిదండ్రుల ఆందోళన

ఈ పరిణామాలు విద్యా ప్రమాణాలపై ప్రభావం చూపుతాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగలు తరగతులు సక్రమంగా జరగడం లేదని, రాత్రివేళల్లో ఈవెంట్ల పేరుతో ఆలస్యంగా విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల భద్రతతో పాటు క్రమశిక్షణ కూడా దెబ్బతింటోందని వాపోతున్నారు. చదువుకోవాల్సిన సమయంలో విద్యార్థులను ఇలాంటి ఈవెంట్ల నిర్వహణకు, వసూళ్లకు వాడుకోవడం విచారకరమని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

వీసీ గారూ.. చర్యలేవి?

ర్సిటీ గౌరవాన్ని గంగలో కలుపుతున్న ఇలాంటి చర్యలపై వీసీ తక్షణమే దృష్టి సారించాలి. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వి.వల్లికుమారి ఈ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉన్నత స్థాయి విచారణ జరిపించి, విద్యార్థుల నుంచి వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇప్పించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో ఈ సంస్కృతి ఇతర విభాగాలకు కూడా పాకే ప్రమాదం ఉంది.

కొండా రాజీవ్‌గాంధీ,

రాష్ట్ర అధికార ప్రతినిధి, వైఎస్సార్‌సీపీ

పరిశోధకులపైనా పంజా

కేవలం యూజీ, పీజీ విద్యార్థులే కాకుండా, పీహెచ్‌డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులు కూడా ఈ వసూళ్ల బాధితులుగా మారారు. ప్రీ–టాక్‌ పరీక్షల సమయంలో ‘స్నాక్స్‌ ఏర్పాట్లు’ చేయాలంటూ ఒక్కో పరిశోధకుని నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పీహెచ్‌డీ వైవా వోస్‌ పరీక్షల్లోనూ ఇదే పద్ధతిని అనుసరించినట్లు సమాచారం. గైడ్ల ఒత్తిడికి తలొగ్గి, తమ డిగ్రీల కోసం అప్పులు చేసి మరీ ఈ మొత్తాలను ముట్టజెబుతున్నామని పరిశోధకులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement