సింహగిరిపై రంగుల కేళి | - | Sakshi
Sakshi News home page

సింహగిరిపై రంగుల కేళి

Apr 3 2026 7:08 AM | Updated on Apr 3 2026 7:08 AM

● వైభవంగా వసంతోత్సవం, చక్రస్నానం ● శాస్త్రోక్తంగా చూర్ణోత్సవం ● భక్తిశ్రద్ధలతో చక్రస్నానం

సింహాచలం: సింహగిరి గురువారం రంగులమయమైంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా 6వ రోజైన గురువారం ఉదయం చూర్ణోత్సవం, వసంతోత్సవం, చక్రస్నానం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులైన గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలతో పాటు చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం నిర్వహించి, పసుపు కొమ్ములను దంచుతూ కొట్నాల సేవను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. వసంతాలను ఉత్సవమూర్తుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆ వసంతాలతో అర్చకులు వేదమంత్రోచ్చారణలు, నాదస్వర వాయిద్యాల మధ్య ఆలయ బేడ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలోని స్వామివారి మూలవిరాట్టుకు, ఆలయంలో కొలువుదీరిన ఇతర దేవతా మూర్తులకు వసంతాలను సమర్పించారు.అనంతరం ఆ వసంతాలను అర్చకులు భక్తులపై చల్లగా.. సిబ్బంది, భక్తులు ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను ఒక పల్లకీ లో, చక్రపెరుమాళ్లు, ఆళ్వారులను మరొక పల్లకీలో ఉంచి గంగధార వద్దకు తిరువీధిగా తీసుకెళ్లారు. అక్కడ గంగధార జలాలు, పంచామృతాలతో పంచ కలశ స్నపనాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం చక్రస్నాన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. చక్రపెరుమాళ్లను గంగధార నీటి ప్రవాహం వద్ద ఉంచి, ఆ జలాలు భక్తులపై పడేలా చేశారు. ఈ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయంలోకి తీసుకెళ్లారు. అంతకుముందు యాగశాలలో పూర్ణా హుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈవో జె.వెంకటరావు దంపతులు ఉత్సవంలో పాల్గొనగా, ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అప్పన్న ఉంగరం చోరీ: గురువారం రాత్రి మృగయోత్సవం(దొంగలదోపు) వేడుకను వైభవంగా నిర్వహించారు. పురాణ గాథ ప్రకారం.. భాగవతోత్తములకు తదియారాధన చేయడం కోసం దొంగగా మారిన నీలుడు(తిరుమంగై ఆళ్వార్‌), అటవీ మార్గంలో విహారయాత్రకు వెళ్తున్న స్వామి వారిని, అమ్మవార్లను అడ్డగించి దోచుకునే ఘట్టాన్ని అర్చకులు రక్తికట్టించారు. అనంతరం నీలుడి భక్తికి మెచ్చిన స్వామి వారు, అతనికి ఆళ్వారుగా మోక్షం ప్రసాదించారు. ఈ ఉత్సవంలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని అశ్వవాహనంపై, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పల్లకీలో ఉంచి మాడ వీధుల్లో తిరువీధి నిర్వహించారు. ఈ దారి దోపిడీ క్రమంలో స్వామి ఉంగరం పోవడంతో, ఆగ్రహించిన అమ్మవారు ఆయనను ఆలయంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. పోయిన ఉంగరాన్ని వెతుక్కునే వినోదోత్సవం వేడుకను ఏడో రోజైన శుక్రవారం ఉదయం ఆసక్తికరంగా నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement