ఆరిలోవ: ప్రముఖ పర్యాటక కేంద్రమైన కై లాసగిరిని సందర్శించే పర్యాటకులకు వీఎంఆర్డీఏ ఊహించని షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండానే పర్యాటకులపై చంద్రబాబు ప్రభుత్వం అదనపు టికెట్ల భారాన్ని మోపింది. గురువారం నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి రావడంతో సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఇప్పటివరకు కై లాసగిరి టోల్ ప్లాజా వద్ద కేవలం వాహనాలకు మాత్రమే నిర్ణీత రుసుం వసూలు చేసేవారు. నడిచి వెళ్లే వారికి మాత్రమే రూ.10 టికెట్ ఉండేది. కానీ, గురువారం నుంచి వాహనాల టికెట్‌తో పాటు అందులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తలా రూ.10 అదనంగా చెల్లించాలని సిబ్బంది పట్టుబట్టారు. ఈ మార్పు తెలియని పర్యాటకులు పాత పద్ధతిలోనే వాహనం టికెట్ తీసి వెళ్లబోగా, లోపల ఉన్న ప్రయాణికులకు కూడా విడివిడిగా టికెట్లు తీసుకోవాలని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద పర్యాటకులు, సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, గందరగోళం నెలకొంది.
అదనపు భారం ఇలా.. : నిన్నటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ద్విచక్ర వాహనాలకు రూ.20, నాలుగు సీట్ల కార్లకు రూ.50, ఏడు సీట్ల కార్లకు రూ.70 చొప్పున టోల్ రుసుం ఉండేది. అలాగే టాటా మ్యాజిక్ వాహనాలకు రూ.70, మినీ బస్సులకు రూ.150, పెద్ద బస్సులకు రూ.300 వసూలు చేసేవారు. అయితే కొత్త విధానం ప్రకారం ఈ వాహన ధరలతో సంబంధం లేకుండా, అందులో ఎంతమంది ప్రయాణిస్తే అంతమందికీ తలా రూ.10 చొప్పున అదనంగా టికెట్ తీసుకోవాల్సిందే. ఉదాహరణకు, బైక్‌పై ఇద్దరు వెళ్తే బైక్ టికెట్ రూ.20తో పాటు మరో రూ.20 అదనంగా చెల్లించాలి. అలాగే 40 మంది ప్రయాణికులతో వచ్చే బస్సు గతంలో రూ.300 చెల్లిస్తే సరిపోయేది, కానీ ఇప్పుడు బస్సు టికెట్‌తో పాటు మరో రూ.400 కలిపి మొత్తం రూ.700 చెల్లించాల్సి వస్తోంది. ముందస్తు ప్రకటనలు లేకుండా ఇలా అదనపు వసూళ్లకు దిగడం దారుణమని, వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని పర్యాటకులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు వాహనదారులు ఆగ్రహంతో సిబ్బందిని తోసుకుంటూ పైకి వెళ్లిపోగా, మరికొందరు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. వీఎంఆర్డీఏ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.


