మరమ్మతుల బిల్లులు! | - | Sakshi
Sakshi News home page

మరమ్మతుల బిల్లులు!

Feb 7 2026 3:06 PM | Updated on Feb 7 2026 3:06 PM

మరమ్మతుల బిల్లులు!

మరమ్మతుల బిల్లులు!

నామినేషన్‌ పద్ధతిలో అప్పగింత జీవీఎంసీ అధికారుల అవినీతి లీలలు సమావేశంలో ఆమోదం పొందకున్నా బిల్లుల చెల్లింపులా? చక్రం తిప్పుతున్న ఓ అధికారి, అనధికారిక పీఏ ఇద్దరిపై ఇప్పటికే ఏసీబీ ఆరా

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

మొబైల్‌ టాయిలెట్లు, బండరాళ్ల తొలగింపుతో పాటు ఆర్‌కే బీచ్‌ సాక్షిగా జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారుల అవినీతికి ఇది మరో సజీవ ఉదాహరణగా నిలుస్తోంది. వాస్తవానికి ఈ ఎకో బజార్‌ను ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వినియోగంలో లేకుండా మూసివేశారు. అయినప్పటికీ యోగా డే సందర్భంగా హఠాత్తుగా మరమ్మతుల పేరిట రూ.3.5 లక్షలు వెచ్చించారు. అంతేకాదు, ఈ పనులను నామినేషన్‌ పద్ధతిలో చేపట్టామని పేర్కొంటూ ఆమోదం కోసం స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించారు. దీనికి స్టాండింగ్‌ కమిటీ కూడా ఆమోదముద్ర వేసింది. మూసివేసిన షాప్‌నకు మరమ్మతులు చేశామంటూ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు సమర్పించడం, స్టాండింగ్‌ కమిటీ కళ్లు మూసుకుని ఆమోదించడం జరిగిపోయాయి.

ఇదిలా ఉండగా, యోగా డే సందర్భంగా కొత్తవాటిని కొనుగోలు చేసే ధరతో సమానంగా, కేవలం ఒకరోజు ఉపయోగానికి రూ.16,200 అద్దె చెల్లించి మొబైల్‌ టాయిలెట్ల ఏర్పాటును నామినేషన్‌ పద్ధతిలో అప్పగించిన వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే యోగా డే సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీలో పెద్ద పెద్ద బండరాళ్ల తొలగింపు పేరిట నామినేషన్‌ పద్ధతిలో పనులు అప్పగించి భారీ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజాగా అసలు ఎప్పుడూ తెరవని షాప్‌నకు మరోసారి రూ.3 లక్షలకు పైగా వ్యయంతో మరమ్మతులు చేపట్టినట్లు కొద్దిరోజుల క్రితం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ప్రతిపాదనలు సమర్పించి ఆమోదింపచేసుకున్న విషయం గమనార్హం.

వసూళ్ల వ్యవహారమే..!

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాల తీరుపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. నామినేషన్‌ పద్ధతిలో చేపట్టిన పనులకు ఏకంగా 15 శాతం కమీషన్‌ జీవీఎంసీలోని ముఖ్య నేతలతో పాటు అనధికారిక పీఏకు అందితేనే ఆమోదం లభిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమావేశానికి ముందే వాటా అందకపోతే, సమావేశంలో ఆమోదించనట్టుగా చెప్పి, సమావేశం అనంతరం కాంట్రాక్టర్లు ముఖ్య నేతలు, అనధికారిక పీఏలను కలిసి ‘అమ్యామ్యాలు’ అందజేసిన తర్వాత రికార్డుల్లో మాత్రం ఆమోదించినట్లుగా నమోదు చేస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. దీనికి డిసెంబర్‌ 6న జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశమే నిదర్శనమని వాదనలు వినిపిస్తున్నాయి. ఆ రోజు ఏకంగా 257 భారీ ప్రతిపాదనలతో సమావేశం జరిగింది. ఇందులో 2025 జూన్‌ 21న విశాఖలో ప్రధాని హాజరైన యోగా డే సందర్భంగా చేపట్టిన నామినేషన్‌ పనుల ఆమోదానికి ప్రతిపాదనలు తెచ్చారు. అంటే దాదాపు ఆరు నెలల తర్వాత, అదీ నామినేషన్‌ పద్ధతిలో అప్పగించిన పనులకు ఆమోదం కోరినట్టుగా తెలుస్తోంది.

వీటిలో మొబైల్‌ టాయిలెట్ల అద్దె పేరిట రూ.1.6 కోట్ల చెల్లింపుల అంశం, ఆంధ్రా యూనివర్సిటీలో భారీ బండరాళ్ల తొలగింపునకు రూ.30 లక్షలకు పైగా వ్యయం చేసిన అంశాలు ఉన్నాయి. మొబైల్‌ టాయిలెట్ల అద్దె అసాధారణంగా ఎక్కువగా ఉండటంతో చెల్లింపులు చేయవద్దని స్టాండింగ్‌ కమిటీ నిర్ణయించింది. అలాగే ఏయూ గ్రౌండ్‌లో తరచూ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు జరుగుతుంటే భారీ బండరాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్న తలెత్తడంతో విచారణకు ఆదేశించింది. అయితే, విచిత్రంగా ఒక సంస్థకు మినహా మిగతా కొన్ని కంపెనీలకు మొబైల్‌ టాయిలెట్ల అద్దె చెల్లింపుల కోసం రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సమావేశంలో లేని బండరాళ్లు తర్వాత ‘నడుచుకుంటూ వచ్చి’ బండరాళ్ల తొలగింపు చేశామంటూ బిల్లుల చెల్లింపులకు ఆమోదం లభించిందన్న సమాచారం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో జీవీఎంసీలోని ఓ ముఖ్య నేత, ఒక అధికారి, అలాగే ఆ ముఖ్యనేత అనధికారిక పీఏ కీలకంగా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారి, అనధికారిక పీఏలపై ఏసీబీ ఆరా!

స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఏ అంశాలు చర్చకు రావాలి? సీరియస్‌ అంశాలు వస్తే సదరు అధికారులు లేకుండా ఎలా చూసుకోవాలి? అనే విషయంలో జీవీఎంసీలోని ఓ అధికారి కీలకంగా చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలున్నాయి. తన ఆమోదం లేకుండా అజెండాలో ఏ అంశం చేరదంటూ, అజెండాలో చేర్చాలంటే సదరు అనధికారిక పీఏను కలవాలంటూ కాంట్రాక్టర్లను ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది. అజెండాలో చేర్చే అంశాలపై నిర్ణయం తీసుకునే ఈ అధికారి వద్ద ముందుగానే ‘దర్శనం’ చేసుకుంటే తప్ప కాంట్రాక్టర్ల ప్రతిపాదనలు అజెండాలో చేరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యనేత, ఆయన అనధికారిక పీఏతో చేతులు కలిపిన సదరు అధికారిం ఆమోదం పొందని అంశాలను కూడా ఆమోదించినట్లుగా రికార్డుల్లో నమోదు చేస్తున్నారన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు ఏసీబీ అధికారులకు అందినట్టు సమాచారం. సదరు అధికారి, అనధికారిక పీఏ వ్యవహారాలపై ఏసీబీ అధికారులు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలోని మూసివేసిన జీవీఎంసీ ఎకో బజార్‌ను చూశారా?

గత ప్రభుత్వ హయాంలో ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా

పర్యావరణహిత బ్యాగులను ప్రోత్సహించేందుకు 2022 జూన్‌ 5న జీవీఎంసీ ఏర్పాటు చేసిన ఎకో బజార్‌ షాప్‌ ఇది. ఆర్‌కే బీచ్‌కు వెళ్లిన ప్రతీసారి ఈ షాప్‌ మూసివుండటం గమనించ

వచ్చు. అయితే, ఈ మూసివున్న షాప్‌ మరమ్మతుల పేరిట జీవీఎంసీ అధికారులు ఏకంగా

రూ.3.5 లక్షలు ఖర్చు చేశారు. అదీ యోగా డే సందర్భంగా! యోగా డేకు ఈ షాప్‌కు సంబంధం ఏమిటని మాత్రం జీవీఎంసీ అధికారులను అడగవద్దు. మూసివేసిన షాప్‌నకు

మరమ్మతులేమిటని ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement