ఎంఎస్‌ఎంఈలు, మౌలిక వసతులపై దృష్టి రాష్ట్రానికి అనుకూలం
బీచ్‌రోడ్డు: కేంద్ర బడ్జెట్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. నగరంలోని ఓ హోటల్లో మీడియాతో సోమవారం మాట్లాడిన ప్యాప్సీ మాజీ అధ్యక్షుడు కంకటాల మల్లికార్జునరావు మాట్లాడారు. బడ్జెట్‌లో ఆత్మనిర్భర్ ఇండియా ఫండ్‌కు ప్రతిపాదించిన రూ.4,000 కోట్లు చిన్న వ్యాపారాల మూలధన ప్రాప్తిని మెరుగుపరుస్తుందన్నారు. ఈ బడ్జెట్‌లో ఎలాంటి ఉచితాలు లేవని, ఇందుకు కేంద్రం వద్ద బడ్జెట్ సరిపడా లేకపోవడం కారణం కావొచ్చన్నారు. వీసీసీఐ అధ్యక్షుడు ఎం.సుదర్శన్ స్వామి మాట్లాడుతూ లాజిస్టిక్స్, పోర్టులు, తీర రవాణా, ఫ్రైట్ కారిడార్లపై దృష్టి రాష్ట్ర సముద్ర ఆధారిత సామర్థ్యాలకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పి.శోభన్ ప్రకాష్ మాట్లాడుతూ మూలధన వ్యయాన్ని రూ.12.22 లక్షల కోట్లకు పెంచడం ఉపాధి, పోటీతత్వాన్ని పెంచుతుందన్నారు. భారత డేటా సెంటర్లను వినియోగించే ఏఐ, క్లౌడ్ సంస్థలకు 2047 వరకు పన్ను రాయితీలు ఇవ్వడం విశాఖను డిజిటల్ మౌలిక వసతుల ప్రధాన కేంద్రంగా నిలబెడుతుందని అభిప్రాయపడ్డారు.


