తీరాన వెండి వెన్నెల సోయగం.. అలలపై సీతాకోకచిలుకల నృత్యం | - | Sakshi
Sakshi News home page

తీరాన వెండి వెన్నెల సోయగం.. అలలపై సీతాకోకచిలుకల నృత్యం

Feb 9 2026 8:19 AM | Updated on Feb 9 2026 8:19 AM

తీరాన

తీరాన వెండి వెన్నెల సోయగం.. అలలపై సీతాకోకచిలుకల నృత్యం

విశాలమైన నీలి సాగరం, నింగిలోని జాబిలిని ప్రేమగా హత్తుకున్న వేళ.. విశాఖ ఆర్కే బీచ్‌ ఒక అద్భుత వర్ణచిత్రంగా ఆవిష్కృతమైంది. వెండి వెన్నెల కెరటాలపై కురిసి, అలలన్నీ కాంతిపుంజాలై మెరిసిపోతుంటే ప్రకృతి ప్రేమికులు పరవశించిపోయారు. సముద్రంలో వేట సాగిస్తున్న మత్స్యకారుల తెప్పలు, ఆ వెన్నెల వెలుగుల్లో కెరటాలపై లయబద్ధంగా ఊగుతుంటే.. నీటిపై రంగురంగుల సీతాకోకచిలుకలు విహరిస్తున్నాయా అన్నట్లుగా భ్రమను కల్పించాయి. గాలి తరగలకు అనుగుణంగా, అలల ఊయలలో తేలియాడుతున్న ఆ నావల సోయగం సందర్శకుల మనసులను దోచుకుంది. ఆదివారం సాగరతీరంలో అలలపై సాగిన యాటింగ్‌ బోట్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ చిరు నావలను జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌ల సాధన కోసం ఉపయోగిస్తున్నట్లు సెయిలర్స్‌ తెలిపారు. అటు ప్రకృతి సౌందర్యం, ఇటు సాహస విన్యాసాల కలయికతో విశాఖ తీరం ఒక అపురూప కావ్యంలా మెరిసిపోయింది. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

సరదా కోసం చేసే పనులు ప్రాణాల మీదకు వస్తాయని తెలిసినా, యువతలో మార్పు రావడం లేదు. ఆదివారం సాగర తీరంలో ట్రాఫిక్‌ నిబంధనలు బేఖాతరు చేస్తూ సాగిన ఈ ప్రయాణం పర్యాటకులను విస్మయానికి గురిచేసింది. మూడు ద్విచక్ర వాహనాలపై యువతీ యువకులు ‘ట్రిపుల్‌ రైడింగ్‌’ చేస్తూ అత్యంత వేగంతో దూసుకుపోయారు. ఒక్కో బైకుపై ముగ్గురేసి చొప్పున కూర్చుని, మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ బీచ్‌ రోడ్డులో హల్‌చల్‌ చేశారు. చిత్రమేమిటంటే ఈ మూడు వాహనాలపై వెనుక కూర్చున్న వారు యువతులే కావడం గమనార్హం. హెల్మెట్‌ లేకపోగా, ముగ్గురు కూర్చుని అతి వేగంగా వెళ్లడం వల్ల ఏ మాత్రం అదుపు తప్పినా ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. ఇటువంటి విన్యాసాలపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సందర్శకులు కోరుతున్నారు. – ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్‌, విశాఖపట్నం

రయ్‌.. రయ్‌.. రిస్క్‌ రోయ్‌..!

తీరాన వెండి వెన్నెల సోయగం.. అలలపై సీతాకోకచిలుకల నృత్యం1
1/1

తీరాన వెండి వెన్నెల సోయగం.. అలలపై సీతాకోకచిలుకల నృత్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement