విశాఖ ఉక్కు రికార్డుల మోత
ఉత్పత్తిలో 52 శాతం వృద్ధి
అమ్మకాల్లో 27 శాతం పెరుగుదల
వార్షిక టర్నోవర్ రూ.22,311 కోట్లు
వార్షిక వృద్ధి 22 శాతం
● పడిలేచిన కెరటంలా..
విశాఖ సిటీ : సవాళ్లు ఎదురైనప్పుడే అసలైన సత్తా బయటపడుతుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఒకవైపు ప్రైవేటీకరణ నీడలు, మరోవైపు నిధుల కొరత, ఇంకోవైపు ఉద్యోగులపై వీఆర్‌ఎస్ ఒత్తిళ్లు.. ఇన్ని ప్రతికూలతల మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్ ‘పడిలేచిన కెరటం’లా విస్మయకర రీతిలో పుంజుకుంది. నష్టాల సాకుతో పరిశ్రమను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్న వేళ, తన సామర్థ్యాన్ని గణాంకాలతో సహా నిరూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి నుంచి విక్రయాల వరకు ఉహకందని వృద్ధిని నమోదు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను సంస్థ ఆదాయం, ఉత్పత్తి గణాంకాలు సరికొత్త మైలురాళ్లను అధిగమించాయి.
కష్టాలు చుట్టుముట్టినా..
గత కొన్నేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నిధుల కొరత వల్ల ముడిసరుకు సేకరణ భారంగా మారింది. దీనికి తోడు ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఉద్యోగుల్లో మానసిక ఆందోళన కలిగించింది. నష్టాల పేరుతో ప్లాంట్ సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరిగినా, అక్కడి కార్మికులు మాత్రం తమ సంకల్పాన్ని వదలలేదు. తక్కువ వనరులతోనే ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తూ సత్తా చాటుకుంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని అమ్మకాల్లో దూసుకుపోయారు.
ఉత్పత్తిలో అజేయమైన వృద్ధి
విశాఖ స్టీల్ ప్లాంట్ మునుపెన్నడూ లేని విధంగా ఉత్పత్తిలో గణనీయమైన వృద్దిని నమోదు చేసింది. ఒకవైపు వనరుల లేమితో సతమవుతున్నప్పటికీ.. 52 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది హాట్ మెటల్ ఉత్పత్తి 3.91 మిలియన్ టన్నుల నుంచి 5.95 మిలియన్ టన్నులకు పెరిగింది. అలాగే లిక్విడ్ స్టీల్ ఉత్పత్తిలో కూడా భారీ పురోగతి కనిపిస్తోంది. గత ఏడాది 3.75 మిలియన్ టన్నుల ఉత్పత్తి కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అది 5.69 మిలియన్ టన్నులకు చేరుకుంది. క్రూడ్ స్టీల్ ఉత్పత్తి కూడా 51 శాతం వృద్ధిని నమోదు చేయడం ప్లాంట్ పనితీరుకు నిదర్శనం.
ఆదాయ ప్రవాహం.. పెరిగిన అమ్మకాలు
గత ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ టర్నోవర్ రూ.22,311 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది రూ.18,288 కోట్లుగా ఉంది. అంటే కేవలం ఏడాది కాలంలోనే ఆదాయం 22 శాతం మేర పెరగడం విశేషం. కేవలం ఆదాయం మాత్రమే కాకుండా, అమ్మకాల పరిమాణంలో కూడా 27 శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాది 3.49 మిలియన్ టన్నుల అమ్మకాలు జరగ్గా.. ఈసారి అది 4.42 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇది సంస్థ మార్కెట్ విస్తరణను స్పష్టం చేస్తోంది.
ప్రైవేటీకరణ వాదనకు ఇదే సమాధానం
విశాఖ స్టీల్ తన ఉత్పత్తుల నాణ్యతను పెంచడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పన పెరగడం వల్ల ఉక్కుకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని విశాఖ స్టీల్ అందిపుచ్చుకుని సరఫరాను వేగవంతం చేసింది. దీనివల్ల సంస్థ లాభదాయకత కూడా మెరుగుపడింది. ఈ రికార్డు వెనుక ప్లాంట్ వ్యూహాత్మక నిర్వహణ కీలక పాత్ర పోషించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని ఆర్‌ఐఎన్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత రికార్డులు స్టీల్‌ప్లాంట్ ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పాయి. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ నిర్ణయం తప్పని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిస్తే.. ఇది దేశంలోనే అత్యంత లాభదాయకమైన సంస్థగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ నమోదు చేసిన వృద్ధి వివరాలు
విభాగం గత ఏడాది ప్రస్తుత ఏడాది వృద్ధి శాతం
వార్షిక టర్నోవర్ రూ.18,288 కోట్లు రూ.22,311 కోట్లు 22 శాతం
హాట్‌మెటల్ ఉత్పత్తి 3.91 మి.ట 5.95 మి.ట 52 శాతం
లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి 3.75 మి.ట 5.69 మి.ట 51.7 శాతం
అమ్మకాల పరిమాణం 3.49 మి.ట 4.42 మి.ట 27 శాతం


