నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం

Apr 4 2026 7:19 AM | Updated on Apr 4 2026 7:19 AM

● జీవీఎంసీ ఆదాయ పరిపుష్టిపై ప్రత్యేక దృష్టి ● జీవీఎంసీ ప్రత్యేక అధికారి అభిషిక్త్‌ కిషోర్‌

అల్లిపురం: విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్‌, జీవీఎంసీ ప్రత్యేక అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ అన్నారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మొదటిసారి జీవీఎంసీ ప్రత్యేక అధికారి హోదాలో విచ్చేసిన ఆయనకు కమిషనర్‌, అదనపు కమిషనర్లు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తు తం అంతర్జాతీయ స్థాయిలో విశాఖ నగరంపై చర్చ జరుగుతోందని, అందరి దృష్టి ఈ నగరంపైనే కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం ప్రణాళికలతో పనిచేయాలని సూచించారు. రోడ్లు, కాలువలు, భూగర్భ మురుగునీటి వ్యవ స్థ, పార్కులు, గ్రీన్‌ బెల్టులు, అన్న క్యాంటీన్ల నిర్వహణ వంటి అంశాలను అధికారులు వివరించారు.

వార్డు సిబ్బంది తీరుపై హెచ్చరిక

జీవీఎంసీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా సిబ్బంది పనితీరు ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. వార్డు సెక్రటేరియట్‌ సిబ్బందిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, బాధ్యతారాహిత్యంగా ఉండేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నగరాభివృద్ధికి అవసరమైన ఆదాయ పరిపుష్టిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అనంతరం కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌.. జీవీఎంసీలోని వివిధ విభాగాల ఉన్నతాధికారులను, వారి విధులను ప్రత్యేక అధికారికి పరిచయం చేశారు.

కలెక్టర్‌ అందించిన కీలక సూచనలు

● స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నగరాన్ని మొదటి ర్యాంకుకు, 7–స్టార్‌ రేటింగ్‌కు తీసుకెళ్లేలా కృషి చేయాలి. ● జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్‌ చేసి, ప్రజల ఇంటి వద్దకే సేవలు అందేలా చూడాలి. ● వేసవి దృష్ట్యా సీఎస్‌ఆర్‌ నిధులతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, తాగునీటితో పాటు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ అందించాలి. ● భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి సంబంధిత రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. భూ సమస్యలు ఉంటే జేసీతో చర్చించి పరిష్కరించుకోవాలి. ● నగరంలో మురుగు నిల్వ లేకుండా చూడాలి. క్లాప్‌ వాహనాల నిర్వహణ, కాపులుప్పాడ డంపింగ్‌ యార్డ్‌లో కంపోస్ట్‌ తయారీ, ’స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలపై శ్రద్ధ వహించాలి. సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్‌.ఎస్‌.వర్మ, పి.నల్లనయ్య, జాయింట్‌ డైరెక్టర్‌ అమృత్‌ విజయభారతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement