సమష్టి సహకారంతో విశాఖ ఉత్సవ్ విజయం
ఏయూక్యాంపస్: అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి సహకారంతో ఎనిమిది రోజుల పాటు సాగిన విశాఖ ఉత్సవ్–2026 శనివారం సాయంత్రం ఆర్కే బీచ్‌లో ఘనంగా ముగిసింది. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా వివిధ వేదికల్లో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలు ప్రజలను విశేషంగా అలరించాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరిగాయని, భవిష్యత్తులో మరిన్ని మెరుగైన ఏర్పాట్లతో ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆర్కే బీచ్‌తో పాటు భీమిలిలోనూ పడవ పోటీలు, బీచ్ స్పోర్ట్స్, రంగోలి వంటి కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వివిధ పోటీల విజేతలకు, సహకరించిన అధికారులకు కలెక్టర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ నాట్యాచార్యులు బాల కొంటలరావు పర్యవేక్షణలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు, సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, గాయని మాళవికల సంగీత విభావరి సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమంలో సమాచార కమిషనర్ పి.ఎస్. నాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


