మేయర్‌కు విలువలే కాదు.. జ్ఞానం కూడా లేదు
విచ్చలవిడి అవినీతికి కేరాఫ్ మేయర్ పీలా
ఎంపీ శ్రీభరత్ కోసం మేయర్ తాపత్రయం.. ఇందులో పవన్ వాటా ఎంత?
ఎటువంటి చర్చ జరగకుండానే ఎలా ఆమోదిస్తారు?
15వ అంశం తొలగించాలని అన్నందుకు దౌర్జన్యానికి పాల్పడ్డారు
డిప్యూటీ మేయర్ కె.సతీష్, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాలశ్రీనివాసరావు
డాబాగార్డెన్స్: నగర ప్రథమ పౌరుడిగా హుందాగా ఉండాల్సిన మేయర్ పీలా శ్రీనివాసరావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆరోపించారు. విచ్చలవిడి అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన మేయర్‌కు సభా మర్యాదలు గానీ, కనీస జ్ఞానం గానీ లేవని వారు మండిపడ్డారు. శనివారం జీవీఎంసీలోని ఫ్లోర్ లీడర్ చాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు కార్పొరేటర్లతో కలిసి ఆయన మాట్లాడారు.
అక్రమంగా భూబదలాయింపు ప్రయత్నం
గీతం సంస్థ ఆక్రమించిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆ సంస్థ చైర్మన్, ఎంపీ శ్రీభరత్‌కు కట్టబెట్టేందుకే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని 15వ అంశాన్ని చేర్చారని వారు విమర్శించారు. నిరుపేదలకు సెంట్ భూమి ఇవ్వాలంటే వంద నిబంధనలు పెట్టే ప్రభుత్వం, వేల కోట్ల విలువైన ప్రజా ఆస్తిని బడాబాబులకు ఎలా అప్పగిస్తుందని ప్రశ్నించారు. ఈ అంశాన్ని అజెండా నుంచి తొలగించాలని ముందుగానే వినతిపత్రం ఇచ్చినా మేయర్ ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమన్నారు.
సభలో రౌడీయిజం
సమావేశం ప్రారంభానికి ముందే సీసీ కెమెరాలు ఆపేసి, మీడియాను అనుమతించకుండా గూండాల తరహాలో వ్యవహరించారని కట్టమూరి సతీష్, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు ఆరోపించారు. అక్రమ తీర్మానాన్ని వైఎస్సార్‌సీపీతో పాటు వామపక్ష కార్పొరేటర్లు అడ్డుకుంటే, కూటమి కార్పొరేటర్లు దౌర్జన్యంగా దాడులకు దిగారని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసులను సభలోకి రప్పించి కౌన్సిల్ గౌరవాన్ని మంటగలిపారని, విశాఖ చరిత్రలో ఇలాంటి దుస్థితి ఎప్పుడూ లేదని గుర్తుచేశారు. తమ హయాంలో మేయర్ హుందాగా ఉండేవారని, విభజన జరిగిన తీరులోనే నేడు కౌన్సిల్ నిర్వహించారని వారు ధ్వజమెత్తారు.
అందరికీ వాటాలు ఉన్నాయా?
ఎంపీ శ్రీభరత్ ప్రయోజనాల కోసం మేయర్‌తో పాటు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు తహతహలాడుతున్నారని, ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా వాటా ఉందేమో అందుకే ఆయన స్పందించడం లేదేమో అని సందేహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే ఆ భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచాలని హితవు పలికారు. ఈ భూ దోపిడీపై వైఎస్ జగన్ మొహన్ రెడ్డి సూచనలతో పెద్దల సహకారంతో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
బొత్సపై వ్యాఖ్యలు హాస్యాస్పదం
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సభకు వచ్చే అర్హత లేదనడం మేయర్ అజ్ఞానానికి నిదర్శనమని కట్టమూరి సతీష్, బాణాల శ్రీనివాసరావు విమర్శించారు. ఎమ్మెల్సీగా, ఇక్కడ ఓటు హక్కు ఉన్న వ్యక్తిగా ఆయనకు పూర్తి హక్కు ఉందని, కమిషనర్ ఆదేశాల మేరకే నేరుగా ఆయనకు అజెండా కాపీ పంపి ఆహ్వానించడం జరిగిందని గుర్తుచేశారు. బొత్స కాలిగోటికి కూడా సరిపోని మేయర్ ఆయనపై మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు చెన్నా జానకీరామ్, రెయ్యి వెంకటరమణ, బిపిన్ కుమార్ జైన్, కఠారి అనీల్ కుమార్, పీవీ సురేష్, గుండపు నాగేశ్వరరావు, కోరుకొండ స్వాతీదాస్, పల్లా అప్పలకొండ, సాడి పద్మారెడ్డి, అనూష, తోట పద్మావతి, కేవీఎన్ శశికళ, మొల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


