12న జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె
అల్లిపురం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జీవీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ) అధ్యక్షుడు పడాల రమణ పిలుపునిచ్చారు. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు నల్లనయ్య, సత్యవతిలకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, మున్సిపల్ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను వీడాలని డిమాండ్ చేశారు. సమ్మెలో జీవీఎంసీ రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ , కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె. సత్యనారాయణ, వాసు, శివ, ప్రసాద్, కోటి తదితరులు పాల్గొన్నారు.


