పోర్ట్‌లో రూ.1500 కోట్ల అభివృద్ధి పనులు
సీతంపేట: పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియంలో నిర్వహించారు. చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు జాతీయ జెండాను ఆవిష్కరించి, సీఐఎస్‌ఎఫ్ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సముద్ర వాణిజ్య రంగంలో విశాఖ పోర్ట్ అగ్రగామిగా ఎదుగుతోందని, ముఖ్యంగా పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్టులు, హరిత శక్తి వినియోగం వంటి అంశాల్లో వినూత్న కార్యక్రమాలతో తన ప్రత్యేకతను చాటుకుంటోందని ప్రశంసించారు. సరుకు రవాణా కార్యకలాపాల్లో కొంత భాగాన్ని శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని, దుగ్గరాజపట్నంలో నౌకా నిర్మాణ కార్యక్రమంలో కూడా పోర్ట్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో 82 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించామని, ప్రస్తుత సంవత్సరంలో 90 ఎంఎంటీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, రానున్న ఏడాదిలో 100 ఎంఎంటీ మైలురాయిని చేరుకుంటామని దీమా వ్యక్తం చేశారు. 2025–26 సంవత్సరానికి గాను సుమారు రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, విశేష ఫలితాలు సాధించిన స్టేక్‌హోల్డర్లకు చైర్‌పర్సన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, అవార్డులను అందజేశారు.
గౌరవ వందనం స్వీకరిస్తున్న
పోర్ట్ చైర్మన్ అంగముత్తు


