పోక్సో కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
అల్లిపురం: పోక్సో కేసులో 12 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని టూటౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలరాంపూర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ శాల్మన్ ఖాన్‌ను 2014లో పోక్సో కేసులో అరెస్ట్ చేయగా, అప్పట్లో కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చినప్పటి నుంచి అతను కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో, నిందితుడిపై ఎన్‌బీడబ్ల్యూ , ప్రొక్లమేషన్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడి ఆచూకీని ఉత్తరప్రదేశ్‌లో కనుగొంది. అక్కడికి వెళ్లిన స్పెషల్ టీమ్ నిందితుడిని అదుపులోకి తీసుకుని, ట్రాన్సిట్ వారెంట్‌పై విశాఖకు తీసుకురాగా..కోర్టు రిమాండ్ విధించింది. సుదీర్ఘ కాలంగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్‌ఐ ఏవీ సాయిరామ్, కానిస్టేబుల్ వి. రవికిరణ్, పర్యవేక్షించిన అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు.


