ప్రగతి పథంలో వాల్తేర్ డివిజన్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ పరిధిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రైల్వే ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్రీయ సలామీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్తేర్ డివిజన్ 13 శాతం వృద్ధితో 66.7 మిలియన్ టన్నుల సరకు రవాణా చేసి, రూ. 8212 కోట్ల ఆదాయాన్ని సాధించిందని తెలిపారు. 21 కి.మీ. డబ్లింగ్, 36 కి.మీ. మూడవ లైన్ పనులు పూర్తి చేశామని, 175 లోకోలకు ‘కవచ్’ సిస్టమ్ అమర్చినట్లు వెల్లడించారు. విశాఖ స్టేషన్‌కు ‘ప్లాటినం గ్రీన్ సర్టిఫికేట్’ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయంలో జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను వివరించారు. ఈ వేడుకల్లో రైల్వే అధికారులు, సిబ్బంది, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


