వెట్టిచాకిరి రహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దాలి
సీతంపేట: వెట్టిచాకిరి రహిత జిల్లాగా విశాఖను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమని కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ ఎం.రామారావు పిలుపునిచ్చారు. ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో నేచర్, వెట్టిచాకిరి విమోచన కమిటీతో కలిసి కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎం.రామారావు మాట్లాడుతూ వెట్టిచాకిరి రహిత సమాజ నిర్మాణానికి ఈ చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉప కమిషనర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ త్వరలోనే జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ కమిటీలను క్రియాశీలం చేసి సంపూర్ణ చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ లైన్ డిపార్ట్‌మెంట్లు, మహిళా , శిశు సంక్షేమ శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


