ప్రైవేటుకే!
ఇక రోడ్లూ
చంద్రబాబు ప్రభుత్వంలో పీక్స్‌కు చేరిన ‘పీపీపీ’ పిచ్చి
నగరంలో 88.35 కి.మీ రోడ్లను పీపీపీలో అప్పగింతకు నిర్ణయం
బిడ్డర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.306.95 కోట్లు జీవీఎంసీ వాటా 40 శాతం.. ప్రైవేటు వాటా 60 శాతం ప్రైవేటు వాటా ఖర్చును వడ్డీతో కలిపి పదేళ్లలో జీవీఎంసీ చెల్లించేలా టెండర్లు రోడ్లు పూర్తయిన తర్వాత పదేళ్లపాటు నిర్వహణ ఈ రోడ్లపై వచ్చే ప్రకటనల ఆదాయం కూడా ప్రైవేటుకే..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ‘పీపీపీ’ పిచ్చి ముదురుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకున్న బాబు సర్కారు.. ఇపుడు విశాఖ రహదారులను సైతం ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. ‘నగర రోడ్ల అభివృద్ధి కార్యక్రమం’ పేరుతో కావాల్సిన వారికి జీవీఎంసీ ఖజానాను దోచి పెట్టాలని నిర్ణయించింది. విశాఖ వాసులపై ‘హైబ్రిడ్’ భారం మోపుతూ.. నగరంలోని 88.35 కిలోమీటర్ల మేర 53 రహదారులను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) కింద ప్రైవేటుకు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. పైలట్ ప్రాజెక్టు కింద చేపడుతున్న దీని అంచనా వ్యయం అక్షరాలా రూ.306.95 కోట్లు. ఇందుకు సంబంధించి జీవీఎంసీ గతేడాది డిసెంబర్ 31న బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది. బిడ్ దాఖలు గడువు ఈనెల 12వ తేదీతో ముగుస్తుంది.


