పుష్ప శోభ
నేటి నుంచి సెంట్రల్ పార్క్‌లో ఫ్లవర్ షో
మహారాణిపేట: విశాఖ ఉత్సవ్‌లో భాగంగా నగర వాసులకు కనువిందు చేసేందుకు పుష్ప ప్రదర్శన–2026 సిద్ధమైంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రదర్శనను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వీఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్. తేజ్‌భరత్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని సెంట్రల్ పార్క్ వేదికగా ఈ పుష్ప ప్రదర్శన జరగనుండగా, అటు అనకాపల్లి ఉత్సవ్‌లో భాగంగా అనకాపల్లి బెల్లం మార్కెట్ వద్ద కూడా ప్రత్యేకంగా ఫ్లవర్ షోను ఏర్పాటు చేశారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనలో స్థానిక రకాలతో పాటు దేశ, విదేశీ జాతుల పూలను ఉంచనున్నారు. దీని కోసం బెంగళూరు, కోల్‌కతా, కడియం నర్సరీల నుంచి వివిధ రకాల హైబ్రిడ్ పూలను రప్పించారు. డచ్ రోజ్, కార్నేషన్, ఏషియాటిక్ లిల్లీ, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, జెర్బరా, ఆస్ట్రోమెరియా, ఆంథోరియమ్స్, గ్లాడియోలా, ట్యూబ్ రోజ్, జిప్సీ వంటి పూలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. కేవలం పూల ప్రదర్శనే కాకుండా, సందర్శకులకు సరికొత్త అనుభూతిని పంచేలా నిర్వాహకులు పలు ఆకర్షణలను జోడించారు.
పుష్ప శోభ


