మళ్లీ బాదుడే బాదుడు
ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు
విశాఖ సిటీ: సంపద సృష్టి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచేందుకు సిద్ధమవుతోంది. మరోసారి భారీగా రిజిస్ట్రేషన్ చార్జీల వడ్డనకు పూనుకుంది. దీంతో భూముల క్రయ విక్రయదారులకు గట్టి షాక్ తగలనుంది. ఇప్పటికే సామాన్యుడికి సొంతింటి కల భారంగా మారింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో రిజిస్ట్రేషన్ అధికారులు భూముల మార్కెట్ విలువల సవరణపై కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏడాది తిరగకుండానే మరో వాత
ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు విశాఖనే ఆదాయ వనరుగా ఎంచుకుంది. దీంతో ఏటా జిల్లావాసులపై అధిక భారాన్ని మోపుతూ భూముల విలువలను అమాంతం పెంచేస్తోంది. గతేడాది ఇదే సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భూముల విలువలను సవరించింది. ఆనందపురంలో కొన్ని గ్రామాల్లో అశాసీ్త్రయంగా 131 శాతం మేర పెంచింది. ఆ భారం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే, తాజాగా మరోసారి 25 నుంచి 50 శాతం మేర విలువల సవరణకు సిద్ధమవ్వడం ప్రభుత్వ ధనదాహానికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ లాంటి నగరాల్లో గజం భూమి ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకోగా, ఇప్పుడు ప్రభుత్వ మార్కెట్ విలువల పెంపుతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తడిసి మోపెడు కానున్నాయి. గతేడాదే గరిష్ట స్థాయిలో భూముల విలువలను పెంచేశారు. తాజాగా అర్బన్ పరిధిలోనే విలువ సవరణ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. విశాఖ జిల్లాలో మూడు మండలాలు మినహా మిగిలిన ప్రాంతం అంతా జీవీఎంసీ పరిధిలోనే ఉంది. దీని ప్రకారం పెందుర్తి నుంచి భీమిలి వరకు భూముల విలువ గణనీయంగా పెరగనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫిబ్రవరి 1 నుంచి ధరల పెరుగుదల
రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని, ఆదాయం పెంపు నెపంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికాారంలోకి వచ్చిన రెండేళ్లలో రెండోసారి పెంచడానికి సిద్ధమైపోయింది. చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య కూడా ఇదే తరహాలో ప్రజలను బాదేసింది. ఆ సమయంలో నాలుగు సార్లు భూముల విలువ సవరణ చేసింది. ఆ తర్వాత 2019–2024 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో కేవలం రెండు సార్లు మాత్రమే ధరలు పెంచారు. కోవిడ్ కష్టకాలంలో రాష్ట్ర ఖజానాకు రూపాయి ఆదాయం రాని సమయంలో కూడా రిజిస్ట్రేషన్ ధరలు పెంచలేదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆదాయం కోసం రెండోసారి ప్రజల నడ్డి విరవాలని చూస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఒక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలే కాకుండా, భూమి కొనుగోలు వ్యయం భారీగా పెరగనుంది. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు స్థలాలను, ఇళ్లు, ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసే శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో స్థిరాస్తి రంగం
ప్రతీ ఏటా భూముల విలువ సవరణ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడుతోంది. ఇప్పటికే జిల్లాలో స్థిరాస్తి రంగం అంపశయ్యపై ఉంది. భూములు, ఇళ్లు, ఫ్లాట్ల క్రయ, విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి భూముల విలువ పెంచడమంటే సామాన్యుడికి సొంతింటి కలను దూరం చేయడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు భూమి మార్కెట్ విలువ పెరగడం, మరోవైపు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో వినియోగదారుడిపై రెట్టింపు భారం పడుతుంది. ఇది అంతిమంగా రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనానికి దారితీస్తుందని స్థిరాస్తి వ్యాపారులు వాపోతున్నారు.


