‘ఓపీ’క నశిస్తోంది | - | Sakshi
Sakshi News home page

‘ఓపీ’క నశిస్తోంది

Jan 29 2026 6:02 AM | Updated on Jan 29 2026 6:02 AM

‘ఓపీ’క నశిస్తోంది

‘ఓపీ’క నశిస్తోంది

● కేజీహెచ్‌లో రోగులకు సర్వర్‌ కష్టాలు ● గంటల తరబడి క్యూల్లో ఇబ్బందులు

మహారాణిపేట: కేజీహెచ్‌ అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) విభాగంలో బుధవారం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌(అభా) యాప్‌ సర్వర్‌ మొరాయించడంతో ఓపీ టికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయి, రోగులకు చుక్కలు కనిపించాయి. సాధారణంగా కేజీహెచ్‌లో రోజుకు 1,200 నుంచి 1,300 వరకు ఓపీ టికెట్లు జారీ అవుతుంటాయి. అయితే సంక్రాంతి పండగ సెలవుల అనంతరం బుధవారం ఆసుపత్రికి రోగుల తాకిడి విపరీతంగా పెరిగింది. ఒక్కరోజే సుమారు 2,700 మంది ఓపీ సేవలకు రాగా, 120 మందికి ఇన్‌–పేషెంట్‌(కేస్‌ షీట్లు) జారీ చేశారు. రద్దీకి తగ్గట్టుగా సర్వర్లు సహకరించకపోవడం, తరచూ ‘అభా’ యాప్‌ డౌన్‌ కావడంతో టికెట్ల జారీలో తీవ్ర జాప్యం జరిగింది. కంప్యూటర్ల ద్వారా టికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. సర్వర్‌ పనిచేయకపోవడంతో సిబ్బంది కూడా ఏమీ చేయలేక ఖాళీగా కూర్చోవాల్సి వచ్చింది. దీంతో గంటల తరబడి క్యూల్లో నిలబడలేక రోగులు, వారి బంధువులు అవస్థలు పడ్డారు. ఆరు కౌంటర్ల వద్ద రద్దీ పోటెత్తడంతో వారిని నియంత్రించడం సెక్యూరిటీ సిబ్బందికి కూడా కష్టతరంగా మారింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇదే పరిస్థితి కొనసాగింది.

‘అభా’ యాప్‌తో అవస్థలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కేజీహెచ్‌లో అభా యాప్‌ ద్వారానే ఓపీ టికెట్లు జారీ చేస్తున్నారు. ఇందులో రోగి పేరు, వయసు, చిరునామా, వెళ్లే విభాగం వంటి వివరాలు నమోదవుతాయి. అయితే, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగుల వద్ద స్మార్ట్‌ ఫోన్లు లేకపోవడం, ఉన్న వారికి యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిబ్బంది సహాయం చేసినప్పటికీ సర్వర్‌ సమస్యల వల్ల ఒక్కో టికెట్‌ జారీకి ఎక్కువ సమయం పడుతోంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరితగతిన వైద్య సేవలు అందేలా చూడాలని రోగులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement