నేడు ఎన్‌ఐవో కార్యాలయం ప్రారంభం
50 ఏళ్ల తర్వాత విశాఖలో సొంత భవనంలోకి..
ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి జితేంద్రసింగ్
సాక్షి, విశాఖపట్నం: జాతీయ సముద్ర అధ్యయన సంస్థ(ఎన్‌ఐవో).. దాదాపు 50 సంవత్సరాల తర్వాత సొంత భవనంలో అడుగు పెడుతోంది. విశాఖలో ఉన్న ఎన్‌ఐవో ప్రాంతీయ కార్యాలయ భవనం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డా.జితేంద్రసింగ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రుషికొండ బే పార్క్ సమీపంలో 3.25 ఎకరాల్లో సుమారు రూ.30 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. తూర్పు తీరంలో సముద్ర తీరంలో ఉన్న ఏకై క అధ్యయన సంస్థ ఇదే కావడం విశేషం. విశాఖలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్‌ఐవో) ప్రాంతీయ కార్యాలయం 1976లో ప్రారంభమైనా.. 50 సంవత్సరాలుగా అద్దె భవనంలోనే కొనసాగింది. రుషికొండలో నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రితో పాటు శాసీ్త్రయ, పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్‌ఐఆర్) డైరెక్టర్ జనరల్ డా. కలైసెల్వి హాజరవుతున్నారని విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయ సైంటిస్ట్ ఇన్‌చార్జి డా.వీవీఎస్‌ఎస్ శర్మ తెలిపారు. ఇక్కడి నుంచే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల సముద్ర, తీరప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా ఎన్‌ఐవో కృషి చేస్తుందన్నారు. సముద్ర నీటిమట్టం పెరుగుదల, కాలుష్యం హెచ్చుతగ్గులు, అంతర్భాగంలో జరిగే మార్పులు అన్నీ ఇక్కడ నుంచే అధ్యయనం చేస్తామనీ.. మరో నెలరోజుల్లో కార్యాలయాన్ని రుషికొండకు తరలించనున్నట్లు తెలిపారు.


