విశాఖ ఏఆర్‌సీలో 68 జంతువులు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో 2000లో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు జాతీయ రహదారి పక్కన సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని నిర్మించారు. 2001లో ఇది ప్రారంభమైంది. ఇక్కడకు తీసుకొచ్చిన 34 పెద్ద పులులు, 34 సింహాల కోసం ప్రత్యేకంగా ఇనుప కేజ్‌లు, నైట్ క్రాల్స్, అవి స్వేచ్ఛగా తిరగడానికి విశాలమైన ఎన్‌క్లోజర్లు నిర్మించారు. వాటికి సకాలంలో ఆహారం, వైద్యం అందించడానికి వెటర్నరీ ఆసుపత్రి, ఒక వైద్యుడు, సహాయకులు, జంతు సంరక్షకులను నియమించారు. అవి యుక్త వయసులో ఉన్నప్పుడు వాటి గాండ్రింపులు, గర్జనలతో ఏఆర్‌సీ ప్రాంతం హోరెత్తేది. జాతీయ రహదారిపై వెళ్లే వారికి సైతం ఆ గర్జనలు వినిపించేవి. ఇప్పుడు అవన్నీ మరణించడంతో అక్కడ నిశబ్దం ఆవహించింది. సహజంగా అడవుల్లో పులులు, సింహాల సగటు జీవిత కాలం 15 నుంచి 16 ఏళ్లు కాగా, ఇక్కడ సంరక్షణలో అవి 20 నుంచి 25 ఏళ్లకు పైగా జీవించడం విశేషం. అర్జున్ (26), కొనాల్ (26) అనే మగ సింహాలు, మాధురి (25), సుధ (23), రాణి (23) అనే ఆడ సింహాలు ఎక్కువ కాలం జీవించాయి. వీటితో పాటు సీత (24) అనే ఆడ పులి, వినయ్ (21) అనే మగ పులి కూడా ఇక్కడ సుదీర్ఘ కాలం జీవించాయి. వృద్ధాప్యం కారణంగా అవయవాలు పనిచేయకపోవడం, పక్షవాతం వంటి వ్యాధులతో ఇవి మృతి చెందాయి. మంచి పోషకాహారం, వైద్యం అందించడం వల్లే అవి ఎక్కువ కాలం జీవించాయని అధికారులు తెలిపారు.


