గీతం కబ్జాచేసిన భూముల క్రమబద్ధీకరణ అడ్డుకోండి..
మేయర్, ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లకు సీపీఎం విజ్ఞప్తి
డాబాగార్డెన్స్: గీతం యూనివర్సిటీ యాజమాన్యం, విశాఖ ఎంపీ శ్రీభరత్ కబ్జా చేసిన 54.79 ఎకరాల భూమిని జీవీఎంసీ కౌన్సిల్ ద్వారా క్రమబద్ధీకరించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలని మేయర్ పీలా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లను సీపీఎం విజ్ఞప్తి చేసింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జీవీఎంసీ సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు నాయకత్వంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌కేఎస్‌వీ కుమార్, వి.కృష్ణారావు ఇతర నాయకులతో కలిసి మేయర్, ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్‌లీడర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ ఎంపీ శ్రీభరత్ ప్రజల ఆస్తులు రక్షించాల్సింది పోయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాజేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనికి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకంగా 15వ అజెండాగా పెట్టి క్రమబద్ధీకరణకు ఆమోదం పొందేందుకు చంద్రబాబు సర్కార్ పన్నాగాలు పన్నడాన్ని విమర్శించారు. 30న జరిగే కౌన్సిల్ సమావేశంలో గీతం కబ్జా చేసిన భూములపై నిలదీస్తామని పేర్కొన్నారు.


