గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందే | - | Sakshi
Sakshi News home page

గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందే

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

గడువు

గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందే

లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవు

పద్మనాభం వ్యవసాయ అధికారికి నోటీసులు

పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ ఆదేశం

సాధారణ పీజీఆర్‌ఎస్‌కు 290, రెవెన్యూ క్లినిక్‌కు 154 వినతులు

బీచ్‌రోడ్డు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని అర్జీలు రీ–ఓపెన్‌ అయ్యే పరిస్థితి రావద్దని స్పష్టం చేశారు. రెవెన్యూ క్లినిక్‌లకు వచ్చే భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో జాప్యం సహించబోమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగేలా రెవెన్యూ క్లినిక్‌లను అర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వినతులకు సరైన సమాధానం ఇవ్వకుండా పదేపదే రీ–ఓపెన్‌కు కారణమవుతున్న పద్మనాభం వ్యవసాయ శాఖ ఏవోకు నోటీసు ఇచ్చి, 48 గంటల్లోగా వివరణ తీసుకుని తనకు నివేదించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, జీవీఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ సత్యవేణిలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు 444 వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూకి సంబంధించి 154, జీవీఎంసీకి చెందినవి 105, పోలీసు 10, ఇతర శాఖలకు సంబంధించినవి 175 వినతులు ఉన్నాయి.

ఐఎఫ్‌ఆర్‌ కు సన్నద్దంగా ఉండండి

ఇటీవల జరిగిన విశాఖ ఉత్సవ్‌ నిర్వహణలో అధికారులు సమన్వయంతో పనిచేసి, విజయవంతం చేశారని ప్రశంసించారు. ఇదే తీరున మరి కొన్ని రోజుల్లో జరగనున్న ఐఎఫ్‌ఆర్‌ను కూడా విజయవంతం చేయాలని సూచించారు.

‘స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు శాఖ’ పోస్టర్‌ ఆవిష్కరణ

స్వర్ణాంధ్ర మన సంకల్పం(విజన్‌–2047) లక్ష్యంతో ఇటీవల పేరు మార్చిన గ్రామ సచివాలయాలకు సంబంధించిన పోస్టర్‌ను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఆవిష్కరించారు. స్వర్ణ గ్రామం– స్వర్ణ వార్డు పేరిట రూపొందించిన ఈ పోస్టర్‌ను గ్రామవార్డు సచివాలయ కో–ఆర్డినేటర్‌ ఉషారాణి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌, జేసీ, ఇతర అధికారులు ఆవిష్కరించారు.

జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షలు

విశాఖ జిల్లాలోని వర్కింగ్‌ జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి(ఎన్‌ఏజే), ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర నాయకుడు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు కలెక్టర్‌ను పీజీఆర్‌ఎస్‌లో కలిసి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టుల బస్‌ పాస్‌ల గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త అక్రిడిటేషన్లు జారీ అయ్యే వరకు మరో నెల రోజుల పాటు పాసుల్ని రెన్యువల్‌ చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఫెడరేషన్‌ విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ. ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు బ్రాడ్‌కాస్ట్‌ కార్యదర్శి కింతాడ మదన్‌, స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చక్రి, సంజీవ్‌, రాజశేఖర్‌, జి.జగన్‌ తదితరులున్నారు

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 102 ఫిర్యాదులు

విశాఖ సిటీ: పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులపై దృష్టి పెట్టి చట్టపరంగా వాటిని పరిష్కరించాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం పోలీస్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 102 ఫిర్యాదులు వచ్చాయి. సీపీ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

జీవీఎంసీ జోన్‌–3 ఏసీపీపై చర్యలు తీసుకోవాలి

నా సొంత స్థలంలో ఉన్న షాపును ఓ ప్రైవేట్‌ వ్యక్తితో చేతులు కలిపి జీవీఎంసీ జోన్‌–3 ఏసీపీ గత ఏడాది జూన్‌ 2న ఫుట్‌పాత్‌ ఆక్రమణ పేరిట తొలగించారు. నా షాప్‌ పక్కన చాలా షాపులున్నా.. కేవలం రాజకీయ ఒత్తిడితో నా షాపును మాత్రమే తొలగించారు. గత 30 ఏళ్లుగా కరెంట్‌ బిల్లు, టాక్స్‌లు కడుతున్నాను. వేరే వ్యక్తులు అక్కడ ఫుట్‌పాత్‌ను ఆక్రమించి మటన్‌ షాపులు నిర్వహిస్తున్నారు. వాటికి ఏసీపీ సహకరిస్తున్నారు. తక్షణమే ఏసీపీపై విచారణ జరిపి, నాకు న్యాయం చేయాలి.

– ఎం.శ్యామ్‌కుమార్‌, చినవాల్తేరు

గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందే1
1/1

గడువులోగా అర్జీలకు పరిష్కారం చూపాల్సిందే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement