కిలాడీ టెక్కీ.. పోలీసులకు చిక్కి.. | - | Sakshi
Sakshi News home page

కిలాడీ టెక్కీ.. పోలీసులకు చిక్కి..

Feb 8 2026 3:48 AM | Updated on Feb 8 2026 3:48 AM

కిలాడ

కిలాడీ టెక్కీ.. పోలీసులకు చిక్కి..

● 60 కేసుల హైటెక్‌ దొంగ అరెస్ట్‌ ● పగలు సాఫ్ట్‌వేర్‌ కోడింగ్‌.. రాత్రి చోరీలు ● భారీగా సొత్తు, కారు స్వాధీనం

అల్లిపురం: పగలు కంప్యూటర్‌ ముందు కూర్చు ని కోడింగ్‌ చేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. రాత్రి వేళల్లో తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, 15 ఏళ్ల వయసులోనే దొంగతనాలు మొదలుపెట్టాడు. నేడు 60 నేరాల రికార్డున్న గజదొంగగా మారిన అచ్చి మహేష్‌ రెడ్డి అలియాస్‌ సన్నీని విశాఖ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. నగర పోలీస్‌ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ఈ వివరాలను వెల్లడించారు. నిందితుడి నుంచి 699 గ్రాముల బంగారం, 3.8 కేజీల వెండి, నేరాలకు ఉపయోగించిన బీఎండబ్ల్యూ కారు, నంబర్‌ ప్లేట్‌ లేని స్కూటీ, ఐరన్‌ రాడ్‌, డ్రిల్లింగ్‌ మెషిన్‌, సుత్తి, స్క్రూడ్రైవర్‌, కట్టింగ్‌ ప్లయిర్‌, ఫేస్‌ మాస్కులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖ నగరంలో జరిగిన 26 దొంగతనం కేసుల్లో మొత్తం 108.494 తులాల బంగారం, 633.35 తులాల వెండి, నగదు రూ.40,500ను సన్నీ చోరీ చేసినట్లు సీపీ వెల్లడించారు.

అసలేం జరిగిందంటే?

గత ఏడాది అక్టోబర్‌ 10న గాజువాకలోని ఎన్టీఆర్‌ నగర్‌లో నివాసం ఉంటున్న కన్నా శివ రామకృష్ణ తన కుమార్తె డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ కోసం తన కుటుంబంతో అరుణాచలం వెళ్లారు. కాకినాడకు చెందిన సన్నీ వారి ఇంటి తాళాలు పగలగొట్టి 17 తులాల బంగారం, 30 తులాల వెండిని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న గాజువాక క్రైం ఇన్‌స్పెక్టర్‌ కల్లూరి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే గాజువాక, ఆరి లోవ, మల్కాపురం, పెందుర్తి, దువ్వాడ ప్రాంతాల్లో ఒకే తరహా దొంగతనాలు జరగడంతో పోలీసులు దీనిని సవాలుగా తీసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగరంలోని మాధవస్వామి కల్యాణ మండపం సమీపంలోని పార్క్‌ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న సన్నీని శనివారం గాజువాకలోని మింది ఆర్చ్‌ రోడ్‌ వద్ద క్రైం ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ సన్నీ నేర చరిత్ర

నిందితుడు మహేష్‌ రెడ్డి పీజీ పూర్తి చేశాడు. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే చిన్నతనం నుంచే విలాసాలకు అలవాటు పడటంతో 15 ఏళ్లకే దొంగతనాలకు శ్రీకారం చుట్టాడు. పీఎంపాలెం పరిధిలో నాలుగు దొంగతనాలు చేసి తొలిసారి జువైనెల్‌ హోంకి వెళ్లాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత కాకినాడ, సర్పవరం, రామచంద్రాపురం, రాజమండ్రి పరిసరాల్లో 32 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో పట్టుబడి రాజమండ్రి జైలులో 14 నెలలు శిక్ష కూడా అనుభవించాడు. ఇలా మొత్తం 60కి పైగా దొంగతనాలు చేశాడు. అప్పుడప్పుడు విశాఖ వచ్చి దొంగతనాలు చేసి, మళ్లీ హైదరాబాద్‌ వెళ్లి విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. ఎట్టకేలకు అతన్ని విశాఖ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు.

కిలాడీ టెక్కీ.. పోలీసులకు చిక్కి.. 1
1/1

కిలాడీ టెక్కీ.. పోలీసులకు చిక్కి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement