కేజీహెచ్‌లో డబ్బు జబ్బు | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో డబ్బు జబ్బు

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

కేజీహెచ్‌లో డబ్బు జబ్బు

కేజీహెచ్‌లో డబ్బు జబ్బు

కట్టు కట్టాలన్నా వసూళ్లే.. ఆగని సిబ్బంది ఆగడాలు వైరల్‌ అవుతున్న వీడియో

మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాలకే కాక పొరుగు రాష్ట్రాల పేద ప్రజలకు సైతం ఆశాదీపంగా నిలిచిన కేజీహెచ్‌ ఇప్పుడు సమస్యల నిలయంగా మారింది. నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందాల్సిన ఈ మహోన్నత సంస్థలో అడుగడుగునా అవినీతి, అలసత్వం రాజ్యమేలుతున్నాయి. ఆస్పత్రిలో వైద్య సేవలు కుంటుపడడమే కాకుండా, క్షేత్రస్థాయిలో రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఒక వీడియో కేజీహెచ్‌లో ఉన్న దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కేజీహెచ్‌ క్యాజువాలిటీలో తన తల్లికి కట్టు కట్టడానికి, ఇంజెక్షన్‌ చేయడానికి సిబ్బంది డబ్బులు అడిగారని, తన వద్ద చిల్లిగవ్వ లేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని ఓ బాధిత కుమార్తె ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను విడుదల చేసింది. ‘పైసలిస్తేనే సేవలు’ అన్నట్లుగా తయారైన అక్కడి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి ప్రాణధార వంటి క్యాజువాలిటీ విభాగంలో ఓపీ టికెట్‌ దగ్గర నుంచి ప్రాథమిక చికిత్స వరకు ప్రతి దశలోనూ పేద రోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నాలుగో తరగతి సిబ్బంది ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడి అత్యవసర స్థితిలో వచ్చే వారిని కూడా వదిలిపెట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌తో పాటు భారీ సంఖ్యలో ఆర్‌ఎంవోలు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇతర పరిపాలనా అధికారులు ఉన్నప్పటికీ, వార్డుల్లో పర్యవేక్షణ మచ్చుకై నా కనిపించడం లేదు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితమై, సంతకాలతోనే కాలక్షేపం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు వేయించుకోవడం పైనే చూపిస్తున్న శ్రద్ధ, రోగుల సంరక్షణపై చూపడం లేదని స్పష్టమవుతోంది.

రోగులకు నిరాశే

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం ఉచితమని నమ్మి వచ్చే పేదలకు నిరాశే ఎదురవుతోంది. వైద్యులు ఉంటే మందులు ఉండవు, మందులు ఉంటే సిబ్బంది అందుబాటులో ఉండరు. పోనీ పరీక్షలు చేయించుకుందామంటే ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ, స్కాన్‌ల కోసం రోజులు తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. బయట ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకోవడానికి డబ్బులు లేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ సమస్యలను పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో కేజీహెచ్‌ ప్రతిష్ట మసకబారుతోంది. జిల్లా కలెక్టర్‌ తక్షణమే స్పందించి, కేజీహెచ్‌లో పేరుకుపోయిన ఈ అవినీతి వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు న్యాయం చేయాలని రోగులు వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement