ఏసీబీ వలలో విశ్రాంత ఎస్‌ఈ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో విశ్రాంత ఎస్‌ఈ

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

ఏసీబీ వలలో విశ్రాంత ఎస్‌ఈ

ఏసీబీ వలలో విశ్రాంత ఎస్‌ఈ

మధురవాడ/ మహారాణి పేట: పంచాయతీరాజ్‌ శాఖలో సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్‌ అయిన సీహెచ్‌ శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో గురువారం ఏకకాలంలో సోదాలు జరిగాయి. ముఖ్యంగా విశాఖలోని మధురవాడ ఎంవీవీ సిటీలో ఉన్న ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు విలువైన డాక్యుమెంట్లు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, ఇతర స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించారు.శ్రీనివాసరావు తన సర్వీసులో ఎక్కువ కాలం విశాఖలోనే ఈఈగా, ఎస్‌ఈగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో భారీగా కమీషన్లు తీసుకోవడం, ఎస్టిమేషన్లు పెంచడం, కాంట్రాక్టర్లను బెదిరించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు ఏసీబీ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా 2022 నుంచి 2024 వరకు ఈఈగా, అనంతరం ఇన్‌చార్జి ఎస్‌ఈగా పనిచేసి గత ఏడాది సెప్టెంబర్‌ 30న ఆయన పదవీ విరమణ పొందారు. పాడేరు ప్రాంతానికి చెందిన బిల్లుల చెల్లింపుల్లోనూ ఆయన కీలకంగా వ్యవహరించి భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టు పనుల మంజూరు నుంచి బిల్లుల చెల్లింపు వరకు ప్రతి దశలోనూ పర్సంటేజీలు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా మూడు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, రెండు ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. వీటితో పాటు రూ. 61.87 లక్షలు సుమారు రెండున్నర కిలోల బంగారం, 20 కిలోలకు పైగా వెండి, ఒక కారు, ద్విచక్రవాహనం, విలువైన గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో ఐదు బ్యాంక్‌ లాకర్ల తాళాలు లభించాయని, శుక్రవారం ఆ లాకర్లను తెరిచి పరిశీలిస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఒక ఉన్నత స్థాయి రిటైర్డ్‌ అధికారి ఇంట్లో ఈ స్థాయిలో సోదాలు జరగడం ప్రస్తుతం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement